సాక్షి, ముంబై: కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణేను బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వర్షా బంగ్లాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి రాణే, చవాన్‌తోపాటు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, మరికొందరు సీనియర్ నాయకులు హాజరయ్యారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని రాణే ఈ సందర్భంగా పట్టుబట్టినట్లు తెలిసింది.
రాజీనామాను ఉపసంహరించుకొని, తమతోపాటు పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని చవాన్, ఠాక్రే విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన అంగీకరించలేదు. తనను సంతృప్తి పరిచేందుకు చవాన్ కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదని రాణే స్పష్టం చేశారు. దీంతో ఎటువంటి పరిష్కారం లేకుండానే సమావేశం ముగిసింది. మంగళవారం నాటిచర్చల సారాంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళతామని ముఖ్యమంత్రి చవాన్ స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో తనతోపాటు రాణే, ఠాక్రే ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీతో భేటీ అవుతామని ప్రకటించారు. ఆమె ఆపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమావేశం అనంతరం చవాన్ వెల్లడించారు.
సోనియాగాంధీ దృష్టికి రాణే డిమాండ్లను తీసుకెళ తామని అన్నారు. ఈ సమావేశంలో రాణే రాజీనామా అంశంతోపాటు వచ్చే శాసనసభ ఎన్నికల విషయంపైనా చర్చించినట్లు చవాన్ తెలిపారు. ఇదిలా ఉండగా సోనియాతో భేటీ అనంతరం రాణే ఎంత వరకు శాంతిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మీకు ఎంపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే సమస్యకు పరిష్కారం దక్కుతుందని భావిస్తున్నారా అన్న విలేకరుల ప్రశ్నకు రాణే బదులిస్తూ ‘నాకు అలాంటి అవకాశం ఇస్తామని ఎవరూ చెప్పలేదు. నేను లేవనెత్తిన అంశాలకు పరిష్కారం చూపిస్తే రాజీనామా ఉపసంహరణ గురించి ఆలోచిస్తానని చెప్పాను’ అని వివరించారు.
ఈ సందర్భంగా చవాన్ మీడియాతో మాట్లాడుతూ చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటామని అన్నారు. 2005లో శివసేనను వీడిన రాణే కాంగ్రెస్‌లో చేరడం తెలిసిందే. తమ పార్టీలోకి వచ్చిన ఆరు నెలల్లోపు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పటికీ ఆ పని చేయకపోవంతో ఆగ్రహానికి గురైన రాణే రాజీనామా బాట పట్టారని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
పంచాయితీ ఢిల్లీకి..
Published Tue, Jul 22 2014 11:17 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement