సాక్షి ముంబై: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసిన నారాయణ్ రాణే కాంగ్రెస్ పార్టీని కూడా వీడనున్నట్లు వచ్చిన ఊహాగానాలకు మాణిక్‌రావ్ మంత్రాంగంతో తెరపడింది. నారాయణ రాణే జులై 21న మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
రాజీనామా అనంతరం ఢిల్లీలో రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యారు. అధిష్టానం నుంచి సరైన స్పందన రాలేదని, దీంతో రాణే పార్టీని వీడనున్నారంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే రాణేను బుజ్జగించేందుకు అధిష్టానం మాణిక్‌రావ్ ఠాక్రేను రంగంలోకి దించింది. వీరిమధ్య మంగళవారం సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం రాణే తన రాజీనామాను వెనక్కితీసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలోనూ, మంత్రిపదవిలోనూ కొనసాగుతానని స్వయంగా రాణే ప్రకటించారు. ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రేతో చర్చల అనంతరం మంగళవారం సాయంత్రం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబైలోని ధ్యానేశ్వరి నివాసస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాణే మాట్లాడుతూ... మంత్రి పదవిని చేపట్టి పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తన డిమాండ్లను నెరవేరుస్తామని పార్టీ అధిష్టానం నుంచి హామీ లభించిందని చెప్పారు. ఈసారి మాట తప్పబోమంటూ పార్టీ చెప్పడంతో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాన్నారు. మంత్రిపదవికి చేసిన తన రాజీనామాను ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ ఇంత వరకు స్వీకరించలేదన్నారు. దీంతో తాను మంత్రి పదవిలో కొనసాగడంతోపాటు పార్టీలో క్రియశీలంగా వ్యవహరించనున్నట్టు స్పష్టం చేశారు.
మూడు నెలలు అధ్యక్ష పదవి కావాలి...
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడునెలపాటు తనను అధ ్యక్షుడిగా కొనసాగించాలని అధిష్టానాన్ని కోరానని, బుధవారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై రాణే వివరణ ఇస్తూ... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని భావించానని, విషయాన్ని అధిష్టానానికి తెలిపానన్నారు. అయితే ఈసారి పోటీ చేయాల్సిందిగా అధిష్టానం కోరిందని, దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని రాణే స్పష్టం చేశారు. అయితే అంతకు ముందు తన కుమారుడు నితేశ్ రాణే పోటీ చేయడానికే తాను తొలి ప్రాధాన్యతనిస్తానని చెప్పారు.
ఉద్దవ్‌పై మండిపాటు...
శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రేతోపాటు శివసేనలో చేరిన దీపక్ కేసర్కర్‌పై రాణే తీవ్రంగా మండిపడ్డారు. ఘాటైన పదజాలంతో ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించారు. కేవలం శివసేన అధినేత దివంగత బాల్‌ఠాక్రే కారణంగా ఉద్ధవ్‌కు రాజకీయాల్లో చోటు దక్కిందనే విషయం మరచిపోవద్దని విమర్శించారు. లోకసభ ఎన్నికల్లో గెలిచినంత మాత్రానా అసెంబ్లీలో కూడా అలాంటి ఫలితాలే పునరావృతమవుతాయని కలలు కంటున్న ఉద్ధవ్‌కు భంగపాటు తప్పదన్నారు. ఎన్సీపీని వీడి, శివసేన పార్టీలో చేరి దీపక్ కేసర్కర్‌పై కూడా రాణే విమర్శలు కొనసాగించారు. ఎమ్మెల్యేగా విఫలమైన కేస్కర్ శివసేనలో చేరారని, అసలు కేస్కర్ ఎవరని ప్రశ్నించారు.
అభివృద్ధి పనులే మా ఎజెండా...
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ది పనులే ఎజెండాగా కాంగ్రెస్ ముందుకెళ్తుందన్నారు. మంచిరోజులు వస్తాయంటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రజలను మోసగించారని, ఆయన పాలనలో ధరలు మరింతగా పెరుగుతున్నాయనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఈసారి రాష్ట్ర ప్రజలు మోడీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
‘చేయి’జారలే..!
Published Wed, Aug 6 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
Advertisement
Advertisement