సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ సన్నద్ధమవుతోందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ఈసారి గెలుపుగుర్రాలకే టికెట్లు లభిస్తాయని, వారిలో నాయకుల బంధువులు ఉండొచ్చు... ఉండకపోవచ్చునని సీఎం వ్యాఖ్యానించారు. ఆగస్ట్ క్రాంతి దినాన్ని పురస్కరించుకుని శనివారం సీఎం,పలువురు నాయకులు ఆగస్ట్ క్రాంతి మైదానంలో అమరవీరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలపై స్పందించారు. టికెట్ల కేటాయింపులో గెలుపు గుర్రాలకే పెద్దపీట వేస్తున్నామని ప్రకటించారు. ‘అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న వారు చాలామంది ఉన్నారు.. వారిలో పలువురు మంత్రుల, బడానేతల కుమారులు, బంధువులు కూడా ఉన్నారు.. అయితే పోటీచేస్తానంటోంది నాయకుడి కుమారుడా, బంధువా అని చూడటం లేదు.. టికెట్ ఇస్తే సదరు వ్యక్తి గెలవగలడా..లేదా అనేది మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అధిష్టానం నిర్ణయించింది.. అటువంటి వ్యక్తులకే టికెట్ కేటాయించాలని స్పష్టం చేసింది..’ అని తెలిపారు. కాగా, ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన నారాయణ్ రాణేపైనే సీఎం పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు.
తనకు తగిన గుర్తింపునివ్వడం లేదని, ముఖ్యమంత్రి పనితీరు బాగాలేదని ఇటీవల మంత్రి పదవికి నారాయణ్ రాణే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తర్వాత పార్టీని కూడా వీడి వెళ్లనున్నట్లు ప్రకటించి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పోటీచేయాలని లేదని, పార్టీ అధిష్టానం ఆదేశాలనుసరించి పనిచేస్తానని ప్రకటించిన రాణే తన కుమారుడు అసెంబ్లీకి పోటీచేస్తాడని ప్రకటించారు.
రాణే ప్రకటన తర్వాత సీఎం శనివారం పై విధంగా స్పందించడంపై పలురకాల వ్యాఖ్యలు వినవస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో రాణే సహా నాయకులెవరూ తమ పిల్లలు, బంధువులకు టికెట్ల కోసం సిఫారస్ చేయొద్దని సీఎం పరోక్షంగా హెచ్చరించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. గెలుపు గుర్రాల వేటలో ఎటువంటి విధివిధానాలు పాటించనున్నారోననే విషయమై కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పటికే చర్చ మొదలైంది.
గెలుపుగుర్రాలకే టికెట్లు
Published Sat, Aug 9 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM
Advertisement
Advertisement