డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..?
ఇటీవలి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్ సంస్థ చేసిన నిర్వాకం చూసి డెట్ ఫండ్స్ ఇన్వెస్టర్లు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఈ సంస్థ ఆరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ (క్రెడిట్‌రిస్క్) పథకాలను ఉన్నట్టుండి మూసేసింది. అప్పటికే ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు అవసరాలకు పెట్టుబడులను తిరిగి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారిని అయోమయానికి, భయానికి గురి చేసింది.
కొందరు అయితే ఇతర డెట్ ఫండ్స్ పథకాల్లోని పెట్టుబడులకు భయంతో తీసేసుకునే ఆలోచన చేస్తున్నారు. కానీ, మరే మ్యూచువల్ ఫండ్స్ సంస్థ (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ/ఏఎంసీ) కూడా ఇప్పటి వరకు ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. కనుక ఫ్రాంక్లిన్ చర్యను చూసి ఆందోళన చెందాల్సిన పని లేదు. కాకపోతే డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారు, కేవలం రాబడుల రేటు ఒక్కటి కాకుండా.. తమ స్కీమ్‌లకు సంబంధించిన రిస్క్ విషయాలను పూర్తిగా తెలుసుకోవడం ఎంతో అవసరం.
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్ సంస్థ మూసి వేసిన ఆరు పథకాలు కూడా క్రెడిట్ రిస్క్ విభాగంలోనివే. ఈ పథకాల నిర్వహణలోని ఆస్తులు రూ.25,856 కోట్లుగా ఏప్రిల్ 22 నాటికి ఉన్నాయి. కానీ, ఇన్వెస్టర్లు గమనించాల్సిన విషయం.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో మరో ఏడు డెట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ పథకాల నిర్వహణలోని ఆస్తులు ఏప్రిల్ 22 నాటికి రూ.17,800 కోట్లుగా ఉండడం గమనార్హం. అంతేకాదు ఈ సంస్థ నిర్వహణలో 15 ఈక్విటీ పథకాలు, వాటి పరిధిలో రూ.36,663 కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. కనుక ఇన్వెస్టర్లు ఈ చర్యను ఫండ్స్ అంతటికీ ఆపాదించి ఒకే విధంగా చూడడం సరికాదు.
అసలేం జరిగింది..?
కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థలను స్తంభింపజేసింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చూవిచూస్తున్నాయి. దీంతో డెట్ మార్కెట్లో ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పెరిగారు. అదే సమయంలో డెట్ ఫండ్స్‌లోకి తాజా పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ముఖ్యంగా క్రెడిట్ రిస్క్ ఫండ్స్‌లో అయితే లిక్విడిటీ మరింత తక్కువ స్థాయికి పడిపోయింది.
ఈ పరిస్థితుల్లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ఆరు డెట్ పథకాల్లో ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న రిడెంప్షన్ (పెట్టుబడుల ఉపసంహరణ) ఒత్తిళ్లను తట్టుకోలేక వాటిని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులు చిక్కుకుపోయాయే కానీ, అవి పూర్తిగా రాకుండా పోయినట్టు కాదు. డెట్ మార్కెట్లో లిక్విడిటీ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఈ పథకాల వద్ద ఉన్న డెట్ పేపర్లను ఫ్రాంక్లిన్ సంస్థ విక్రయించి ఇన్వెస్టర్లకు సొమ్ములు చెల్లిస్తుంది. లేదా ఆయా డెట్ పేపర్ల గడువు తీరిపోయిన తర్వాత ఎంత మొత్తం వస్తుందన్న ఆధారంగా ఇన్వెస్టర్లకు చెల్లింపులు ఆధారపడి ఉంటాయి.
క్రెడిట్ రిస్క్ ఫండ్స్‌లోనే సమస్య అంతా..
డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్నో రకాల పథకాలు ఉంటాయి. వీటిల్లో క్రెడిట్ రిస్క్ ఫండ్స్ కూడా ఒకటి. తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న కార్పొరేట్ రుణ పత్రాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులు ఇవ్వడం ఈ పథకాల పనితీరు విధానం. కనుకనే ఈ ఫండ్స్‌లో రాబడులు అధికంగా ఉండడంతోపాటు పెట్టుబడులకు రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుందని అర్థం చేసుకోవాలి. సెబీ నిర్దేశించిన నిబంధనల ప్రకారం క్రెడిట్ రిస్క్ ఫండ్స్ తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని ఏఏప్లస్ అంతకంటే తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న పత్రాల్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం, డీహెచ్ఎఫ్ఎల్ సంక్షోభం, అడాగ్ గ్రూపు కంపెనీలు, వొడాఫోన్ ఐడియా ఈ కంపెనీల రుణ పత్రాలు తక్కువ నాణ్యత విభాగంలోనివే కావడం గమనార్హం. ఆర్థిక పరిస్థితులు బలంగా లేకపోవడం వల్ల ఆయా కంపెనీలు ఎక్కువ రేటుపై డెట్ పేపర్ల ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ చేస్తుంటాయి. కంపెనీల ఆర్థిక పరిస్థితులు తలకిందులైతే అవి చెల్లింపుల్లో విఫలం కావచ్చు. దాంతో వాటికి రుణాలు ఇచ్చిన, డెట్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్‌కు దెబ్బలు తగిలినట్టే. దాంతో ఇన్వెస్టర్ల రాబడులు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. కేవలం రాబడుల కాంక్షతోనే వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే చేతులు కాల్చుకున్నట్టే అవుతుంది. అందుకే ఇన్వెస్ట్ చేసే ముందుగానే తమ రిస్క్ సామర్థ్యం, ఇన్వెస్ట్ చేస్తున్న పథకంలో ఉండే రిస్క్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి.
ఎస్టీపీ విషయంలో జాగ్రత్త..
ఈక్విటీల్లో ఒకే విడత ఇన్వెస్ట్ చేయడం నచ్చని వారు, క్రమానుగతంగా (సిప్) ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు సాధారణంగా డెట్ ఫండ్స్‌లో లంప్సమ్(ఒకే మొత్తం)గా ఇన్వెస్ట్ చేస్తుంటారు. తర్వాత ఆయా డెట్ ఫండ్స్ నుంచి సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ/క్రమానుగతంగా బదిలీ చేయడం) ద్వారా ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని తాము ఎంపిక చేసుకున్న ఈక్విటీ పథకాల్లోకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటారు. మరి ఫ్రాంక్లిన్ ఉదంతం చూసిన తర్వాత.. ఇన్వెస్టర్లు ఎస్టీపీ కోసం ఎంచుకునే డెట్ ఫండ్స్ అధిక నాణ్యత, రిస్క్ తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
డెట్ ఫండ్స్ సురక్షితమేనా..?
ద్రవ్యోల్బణంపై 1.5 శాతానికి మించి రాబడులను డెట్ ఫండ్స్ నుంచి ఆశించకూడదన్నది నిపుణుల సూచన. రిస్క్ భరించలేని వారు ఏఏఏ రేటింగ్ (అధిక నాణ్యత) పేపర్లలో ఇన్వెస్ట్ చేసే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కే పరిమితం కావాలి. బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ బాండ్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, గిల్ట్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. ఎస్టీపీ కోసం ఇవి మంచి ఆప్షనే అవుతాయి. ఇన్వెస్ట్ చేసే ముందు ఆయా పథకాల పోర్ట్‌ఫోలియోల్లోని డెట్ పేపర్ల రేటింగ్లను చూసి నిర్ణయం తీసుకోవాలి.
డెట్ ఫండ్స్‌ను అమ్మేసుకోవాలా..?
ఫ్రాంక్లిన్ చర్యను చూసి ఇతర డెట్ ఫండ్స్‌ను అమ్ముకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఎగ్జిట్ చార్జీలు, పన్నులు చెల్లించాల్సి రావచ్చు. డెట్ ఫండ్స్‌లో లాభాలపై, స్వల్పకాల, దీర్ఘకాల లాభాల పన్ను వర్తిస్తుంది. ‘‘అన్ని బాండ్ ఫండ్స్ కూడా రాబడుల కోసం అధిక క్రెడిట్ రిస్క్ తీసుకుంటాయని అనుకోవద్దు. చక్కని నిర్వహణతో కూడిన ఫండ్స్ ఉత్తమ క్రెడిట్ రేటింగ్ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేస్తుంటాయి’’ అని ఇన్వెస్టికా రీసెర్చ్ మేనేజర్ సయాలీ ఖండ్కే తెలిపారు.
వీటిల్లో రిస్క్ తక్కువ
డెట్ ఫండ్స్ గురించి అంతగా అవగాహన లేని వారు, ఎక్కువ రిస్క్ వద్దనుకుంటే, కొంచెం భద్రత పాళ్లు ఎక్కువగా ఉంటే ఈ డెట్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. కాకపోతే వీటిల్లో రాబడులు తక్కువగా ఉంటాయి.
ఓవర్‌నైట్ ఫండ్స్..: డెట్ ఫండ్ విభాగంలో సురక్షితం. ఒక రోజు వ్యవధితో కూడిన ఓవర్‌నైట్ రివర్స్ రెపో, ఇతర డెట్, మనీ మార్కెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఒక రోజు నుంచి నెల కోసం అనుకూలం. రాబడి 5% వరకూ ఉంటుంది.
లిక్విడ్ ఫండ్స్..: 91 రోజుల కాల వ్యవధి మించని ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ సెక్యూరిటీలు, రెపోలు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్‌లో లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడులు పెడుతుంటాయి. రాబడులు 6 శాతం వరకు ఉంటాయి.
బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ ఫండ్స్..: ఈ పథకాలు బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. డిఫాల్ట్ రిస్క్ చాలా తక్కువ. మూడేళ్ల కాలానికి అనుకూలం. వడ్డీ రేట్లు పెరిగే తరుణంలో మార్కెట్ టు మార్కెట్ నష్టాలు ఈ ఫండ్స్‌కు ఉంటాయి. రాబడులు దీర్ఘకాలంలో 8 శాతం వరకు ఉంటాయి.
ఇతర డెట్ ఫండ్స్ రకాలు
ఈ పథకాలన్నింటిలోనూ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆయా పథకాల్లోని పోర్ట్‌ఫోలియోపై రిస్క్ ఆధారపడి ఉంటుంది.
అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్
మూడు నుంచి ఆరు నెలల్లోపు గడువుతీరే డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో ఈ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్‌తో పోలిస్తే అధిక రాబడులను ఇస్తాయి. లిక్విడ్ ఫండ్స్ కంటే వీటిల్లో రిస్క్ ఎక్కువ. ఎంచుకునే పథకాలను బట్టి రిస్క్ వేర్వేరుగా ఉంటుంది.
షార్ట్ డ్యురేషన్ ఫండ్స్
ఇవి 1–3 ఏళ్ల కాల వ్యవధి కలిగిన కంపెనీల బాండ్లు, బ్యాంకుల బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి.
లాంగ్ డ్యురేషన్ ఫండ్స్
దీర్ఘకాలంలో మెచ్యూరిటీ అయ్యే గవర్నమెంట్ సెక్యూరిటీలు, బాండ్లు, డిబెంచర్లలో ఇన్వెస్ట్ చేస్తా యి. ఏడేళ్లకు పైగా వీటి కాల వ్యవధి ఉంటుంది.
కార్పొరేట్ బాండ్ ఫండ్స్
80% పెట్టుబడులను అధిక క్రెడిట్ రేటింగ్ ఉన్న కంపెనీల బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. అలాగని ఈ విభాగంలోని అన్ని పథకాల్లోనూ రిస్క్ ఒకే మాదిరిగా ఉంటుందనుకోవద్దు.పోర్ట్‌ఫోలియోలోని పేపర్లను చూసిన తర్వాతే అవగాహనకు రావాలి.
డైనమిక్ బాండ్ ఫండ్స్
వడ్డీ రేట్లలో మార్పులను పెట్టుబడి అవకాశాలుగా మలుచుకుని అధిక రాబడులను ఇచ్చే విధంగా డైనమిక్ బాండ్ ఫండ్స్ పనిచేస్తుంటాయి. వివిధ కాల వ్యవధులతో ఉన్న సెక్యూరిటీలను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంటాయి. వీటిల్లో అధిక రిస్క్ ఉంటుంది.
ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు (ఎఫ్ఎంపీ)
ఇవి క్లోజ్ ఎండెడ్ డెట్‌ఫండ్స్. ఎన్ఎఫ్వో సమయంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. సాధారణంగా మూడేళ్లకు పైబడిన కాల వ్యవధితో ఉంటుంటాయి. అధిక రాబడులను ఆఫర్ చేస్తాయి. రిస్క్ ఉంటుంది.
గిల్ట్ ఫండ్స్
గిల్ట్ ఫండ్స్ ప్రధానంగా ప్రభుత్వ సెక్యూరిటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. దీంతో పెట్టుబడులు, వడ్డీ చెల్లింపులకు ఎటువంటి రిస్క్ ఉండదు. వడ్డీ రేట్లు తరచుగా మార్పులకు గురవుతుంటే ఆ ప్రభావం వీటిపై ఎక్కువగా ఉంటుంది. అధిక రాబడులు, ప్రతికూల రాబడుల రిస్క్ కూడా ఉంటుంది.
ఈక్విటీల్లోనే కాదు డెట్‌లోనూ రిస్క్
ఈక్విటీలతో పోలిస్తే డెట్ విభాగంలో రిస్క్ తక్కువ. కాకపోతే డెట్ పెట్టుబడులపై క్రెడిట్ రేటింగ్, వడ్డీ రేట్ల రిస్క్ ఎప్పుడూ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఫండ్ మేనేజర్ తక్కువ క్రెడిట్ రేటింగ్ బాండ్లలో (చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉండే కంపెనీల పేపర్లు) ఇన్వెస్ట్ చేస్తుంటే ఆయా పథకాల్లో రిస్క్ ఈక్విటీల స్థాయిల్లోనే ఉంటుందని అర్థం చేసుకోవాలి. వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా బాండ్ల ధరలు పడిపోతే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈక్విటీలనే కాకుండా, డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు కూడా ఆర్థిక నిపుణులు, సలహాదారులను సంప్రదించి, తమ రిస్క్, పెట్టుబడుల సామర్థ్యాలకు అనుగుణంగా మెరుగైన ప్రణాళికను రూపొందించుకోవడం సూచనీయం.