‘ఈవీఎం’ల వల్లే ఓడిపోయాం..
ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే
ముంబై: శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక శాతం సీట్లు రావడానికి మోడీ హవా కారణం కాదని, యాంత్రిక లోపలున్న ఈవీఎంలను అమర్చడమే అందుకు ప్రధాన కారణమని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) మాజీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత అందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఎంపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ప్రతులను పార్టీ నేత సోనియాగాంధీకి పంపారు. అయితే వాటిని అధిష్టానం ఇంతవరకు ఆమోదించలేదు. కాగా, శనివారం సాయంత్రం మాణిక్‌రావ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలు మొరాయించినట్లు బరిలో దిగిన అభ్యర్థుల నుంచి తమ అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఏయే నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కు 90 శాతం ఓట్లు పడాల్సి ఉందో, ఆయా చోట్ల కేవలం మూడు లేదా నాలుగు శాతం మాత్రమే పోలయ్యాయని ఆరోపిం చారు. దీనిపై విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కాగా దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ కమిటీ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. పోటీచేసిన అభ్యర్థులు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేస్తారన్నారు. కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుల సమావే శం ఈ నెల 28న ఢిల్లీలో జరగనుంది.అక్కడ ఎన్నికల్లో పరాజయం కావడానికి గల కారణాలు, విశ్లేషణలు, ఇతర అంశాలపై చర్చలు జరుగుతాయని వివరించారు. ‘15 యేళ్ల నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం.. అనేక అభివృద్థి కార్యక్రమాలు చేపట్టాం.. దీంతో ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు వస్తాయనే ధీమాతో ఉన్నాం.. అయినప్పటికీ పరిస్థితులు తారుమారయ్యాయి.. బీజేపీ తమకు వ్యతిరేకంగా ప్రజలకు మాయమాటలు చెప్పి వారి వైపు లాక్కుంది..’ అని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో పార్టీపై తిరుగుబాటు చేసినవారిని తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ లేదా శివసేన పార్టీలకు కాంగ్రెస్‌కు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా మద్దతు ఇవ్వరని స్పష్టం చేశారు.