ఈవీఎం ట్యాంపరింగ్‌ సాధ్యమేనా?! | Is it possible to Tampering the EVMs? | Sakshi
Sakshi News home page

ఈవీఎం ట్యాంపరింగ్‌ సాధ్యమేనా?!

Published Thu, Mar 16 2017 2:01 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

ఈవీఎం ట్యాంపరింగ్‌ సాధ్యమేనా?! - Sakshi

ఈవీఎం ట్యాంపరింగ్‌ సాధ్యమేనా?!

సాక్షి నేషనల్‌ డెస్క్‌: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మళ్లీ ఈవీఎంల ట్యాంపరింగ్‌ అంశం తెరపైకి వచ్చింది. ఫలితాలు వచ్చిన రోజే బీఎస్పీ చీఫ్‌ మాయావతి, ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం రావత్‌ ఈవీఎంలపై (ట్యాంపరింగ్‌ జరిగిందంటూ) తీవ్ర ఆరోపణలు చేయగా.. వీటిపై విచారణ జరపాలని అఖిలేశ్‌ డిమాండ్‌ చేశారు. పంజాబ్‌లో తమ ఓటమికి కూడా ట్యాంపరింగే కారణమని ఆప్‌ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆరోపించారు. ట్యాంపరింగ్‌పై కోర్టుకు వెళ్లనున్నట్లు మాయావతి, కేజ్రీవాల్‌ తెలిపారు. 1982లోనే ఈవీఎంలను ప్రయోగాత్మకంగా భారత్‌లో వినియోగించినా.. 2004 సార్వత్రిక ఎన్నికల నుంచి పూర్తిస్థాయి వినియోగంలోకి వచ్చాయి. తాజా వివాదం నేపథ్యంలో ఈవీఎంను ట్యాంపరింగ్‌ చేయొచ్చా అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఈవీఎం ఎలా పనిచేస్తుంది?
బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఈవీఎంలో రెండు భాగాలుంటాయి. ఒకటి కంట్రోలింగ్‌ (నియంత్రణ) యూనిట్, రెండోది బ్యాలెటింగ్‌ (ఓట్ల ప్రక్రియ) యూనిట్‌. ఎన్నికల కేంద్రంలోని ప్రిసైడింగ్‌ అధికారి ఈ కంట్రోలింగ్‌ యూనిట్‌కు ఇంచార్జీగా వ్యవహరిస్తారు. ఓటర్‌ తన ఓటు వినియోగించుకునేందుకు సిద్ధమవగానే.. బ్యాలెటింగ్‌ యూనిట్‌ను ఆయన యాక్టివేట్‌ చేస్తారు. తర్వాత ఓటర్‌ తనకు నచ్చిన అభ్యర్థికి ఎదురుగా ఉన్న మీటను నొక్కి ఓటేస్తాడు. ఓటు పడగానే ప్రిసైడింగ్‌ అధికారి.. పోలింగ్‌ బూత్‌లో ఉన్న వివిధ పార్టీల ఏజెంట్లకు ఓటు నమోదైనట్లు ధ్రువీకరిస్తారు. కౌంటింగ్‌ సమయంలో నమోదైన ఓట్ల సంఖ్యలో తేడా రాకుండా ఏజెంట్ల లెక్కలతో ప్రిసైండింగ్‌ అధికారి లెక్కలు సరిపోయేందుకు ఇలా చేస్తారు. ఓటింగ్‌ సమయంలో ఈవీఎం బాహ్యనెట్‌వర్క్‌తో అనుసంధానం ఉండదు.

ఒక ఈవీఎం ద్వారా 3,840 ఓట్లను రికార్డు చేయొచ్చు. కౌంటింగ్‌ సమయలో ఈవీఎంపై ఉన్న ‘రిజల్ట్‌’ మీటను నొక్కటం ద్వారా ఎవరికెన్ని ఓట్లో తెలుసుకోవచ్చు. ఓటింగ్‌ సమయలో ఈ బటన్‌ సీల్‌ చేస్తారు. ప్రతి ఈవీఎంకు ఓ ఐడీ నెంబరుంటుంది. అది ఎన్నికల సంఘం డేటాబేస్‌లో రికార్డవుతుంది. పోలింగ్‌ బూత్‌కు తీసుకెళ్తున్నపుడు, ఓటింగ్‌ పూర్తైన తర్వాత ఈ ఐడీని మరోసారి చెక్‌ చేసుకుంటారు. ఆ తర్వాత వీటిని ఓ భద్రమైన ప్రదేశానికి తరలించి.. కౌంటింగ్‌ రోజు వరకు కేంద్ర బలగాల పహారాలో భద్రంగా ఉంచుతారు.

ఈవీఎంలపై వచ్చిన ఫిర్యాదులు
2000లో ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్‌ వార్తలు మొదటిసారిగా తెరపైకి వచ్చాయి. ఓ డచ్‌ టీవీ ఈవీఎం మెషీన్లను ఎలా హ్యాక్‌ చేయవచ్చో చూపుతూ డాక్యుమెంటరీని ప్రసారంచేసింది. దీంతో నెదర్లాండ్‌ ఈవీఎంలను రద్దుచేసి సంప్రదాయ పద్ధతిలో బ్యాలెట్‌లతో పోలింగ్‌ నిర్వహించింది. జర్మనీ, ఐర్లాండ్‌లు కూడా ఈవీఎంలను పక్కన పెట్టేశాయి. భారత్‌లో కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయొచ్చంటూ పలువురు బ్లాగర్లు పోస్టులు పెట్టారు. 2010లో మిచిగాన్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ జె అలెక్స్, భారత సైంటిస్టు హరిప్రసాద్‌లు కలిసి ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియకు ముందే ఎలా ట్యాంపరింగ్‌ చేసే అవకాశాలున్నాయో ఓ నివేదికలో వెల్లడించారు. మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఈవీఎంలను ఎలా మార్చవచ్చో చూపించారు. అయితే దీన్ని భారత ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. తమ దగ్గరున్న ఈవీఎంలు అత్యున్నత ప్రమాణాలతో కూడినవని ట్యాంపరింగ్‌కు వీల్లేనివని స్పష్టం చేసింది.

ఈవీఎంలపై వచ్చిన ఆరోపణలు
► 2004 ఎన్నికల్లో యూపీఏకు అనుకూలంగా ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు దీన్ని తోసిపుచ్చింది. 2005లో మరోకేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు.. ఎన్నికలప్రక్రియలో ఈవీఎంల పాత్ర గొప్పదని, వీటిని ట్యాంపరింగ్‌ చేయలేమని స్పష్టం చేసింది.  
► 2009 ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. ఆ తర్వాత ఎల్‌కే అడ్వాణీ కూడా ఈ విషయాన్ని లేవనెత్తారు.
► 2009లో ఒడిశా ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత జేబీ పట్నాయక్‌ కూడా ఈవీఎంల ట్యాంపరింగ్‌  బీజేడీ విజయం సాధించిందని ఆరోపించారు.
►  2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంల ట్యాపింగ్‌కు పాల్పడిందని అప్పటి అస్సాం సీఎం తరుణ్‌ గొగోయ్‌ విమర్శించారు. దీనిపై సామాజిక వేత్త మేథాపాట్కర్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు.

ఓటు ధ్రువీకరణ పత్రం సంగతేంటి?
బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా 2013 అక్టోబర్‌ 8న సుప్రీంకోర్టు ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీపీఏటీ–ఓటు ధ్రువీకరణ పత్రం)ను 2019లోపు దశల వారీగా ప్రవేశపెట్టాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.ఈవీఎంకు అనుసంధానించిన ప్రింటరు నుంచి తను ఓటేసిన గుర్తు, సీరియల్‌ నంబర్‌తో కూడిన ప్రింట్‌ డ్రాప్‌ బాక్స్‌లోకి వస్తుంది. అయితే డ్రాప్‌బాక్స్‌లో పడే ముందు కొద్ది క్షణాలపాటు ఓటరు దీన్ని చూసేందుకు (తను అనుకున్న పార్టీకే ఓటు పడిందా లేదా అని తెలుసుకునేందుకు) వీలుంటుంది. ఒకవేళ ఈవీఎం ఓట్లలో ఏమైనా తేడా ఉందనిపిస్తే.. డ్రాప్‌బాక్సును తెరిచి కౌంటింగ్‌ చేసుకోవచ్చు. దీన్ని 2013లో నాగాలాండ్‌ ఉప ఎన్నికల్లో, 2014 సాధారణ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా వినియోగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement