
'తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలి'
చెన్నై: తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్కు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం రాజనాథ్కు సుబ్రహ్మణ్యస్వామి లేఖ రాశారు. సీఎం అనారోగ్యంతో విధులు నిర్వహించలేక పోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కోలుకునే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో ఐసిస్ స్లీపర్ సెల్స్ ఉన్నాయని... అవి ఎప్పుడైనా విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.
తీవ్ర అనారోగ్యం పాలైన సీఎం జయలలిత గత 15 రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత అనారోగ్యంపై అపోలో ఆసుపత్రి గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన విషయం విదితమే. మరికొంత కాలం పాటు జయ ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాజనాథ్కు రాసిన లేఖలో ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. సీఎం జయ అనారోగ్యంపై పుకార్లు షికార్లు చేశాయి. దాంతో జయ ఆరోగ్యంపై వెంటనే ప్రకటన చేయాలని గవర్నర్ను ప్రతిపక్షం డీఎంకే డిమాండ్ చేసింది.
దాంతో జయను రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు పరామర్శించారు. అనంతరం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు తమిళనాడు రాజ్భవన్ లేఖను విడుదల చేసింది. ఆ తర్వాత జయ ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వెంటనే ప్రకటన చేయాలని పలువురు మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో గురువారం అపోలో ఆసుపత్రి ఆమె హెల్ బులెటిన్ విడుదల చేసింది.