వాళ్లు స్మగ్లర్లు
కేంద్రం కొత్త బాణి
కోర్టుకు నివేదిక
జాలర్లలో ఆగ్రహం
ఖండించిన వైగో, శరత్
కాల్పులకు రెడీ : శ్రీలంక మంత్రి
‘‘వాళ్లు స్మగ్లర్లు.. అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తుండడంతో అరెస్టు అవుతున్నారు. భారత సరిహద్దుల్లోకి వచ్చే ఏ ఒక్కర్నీ శ్రీలంక నావికాదళం అరెస్టు చేయలేదు’’. అంటూ తమిళ జాలర్లకు వ్యతిరేకంగా కేంద్రం కొత్త బాణి అందుకుంది. మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో ఇందుకు తగ్గ నివేదికను సమర్పించి ఉండడం వెలుగులోకి రావడంతో జాలర్ల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సాక్షి, చెన్నై:తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బంధీలుగా పట్టుకెళ్లడం, విడుదల చేయడం, పడవల్ని స్వాధీనం చేసుకోవడం వంటి సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమకు కడలిలో భద్రత కల్పించాలంటూ బుధవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ నేతృత్వంలో తమిళ జాలర్ల బృందం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ అయింది. తాను ఉన్నానంటూ ఆమె ఇచ్చిన భరోసాతో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం జాలర్ల సంఘాల ప్రతినిధుల్లో నెలకొంది. అదే సమయంలో జాలర్లల ఆశలపై నీళ్లు చల్లే విధంగా చెన్నైకు వచ్చిన శ్రీలంక మంత్రి స్వామినాథన్ చేసిన వ్యాఖ్యలు విస్మయంలో పడేశాయి.
మీనంబాక్కం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన సరిహద్దులు దాటిన పక్షంలో తుపాకులతో కాల్చే అధికారం తమకు ఉందని స్పష్టం చేశారు. ‘మీ ఇంట్లోకి హద్దులు మీరి ఎవరైనా వ్యవహరిస్తే అడ్డుకోరా..’ అదే తాము చేస్తున్నాం అని సమాధానం ఇవ్వడం జాలర్లలో మరింత ఆందోళన రేకెత్తించేలా చేస్తున్నది. అలాగే, జాలర్లకు భద్రత అన్నది తాము కల్పించాల్సిన విషయం కాదు అని, అది భారత ప్రభుత్వం చేతిలో ఉందని వ్యాఖ్యానించడం బట్టి చూస్తే, ఏ మేరకు కేంద్రానికి తమిళ జాలర్లపై చిత్తశుద్ధి ఉన్నదో స్పష్టం అవుతోంది. ఈ సమయంలో పుండు మీద కారం చల్లినట్టుగా కేంద్రం వ్యవహరించిన నక్క చిత్తుల వ్యవహారం
వెలుగులోకి రావడంతో రాష్ట్రంలోని జాలర్లు అగ్గి మీద బుగ్గిలా మండి పడుతున్నారు. వాళ్లు స్మగ్లర్లు : ఓ వైపు తమను కలిసిన జాలర్లకు భరోసా ఇచ్చి పంపిన కేంద్రం మరో వైపు భారత నావికాదళం ద్వారా స్మగ్లర్లుగా చిత్రీకరించే పనిలో పడటం రాజకీయ పక్షాలను , జాలర్లను జీర్ణించుకోలేకుండా చేస్తున్నది. జాలర్ల భద్రతకు సంబంధించిన పిటిషన్ విచారణ మదురై ధర్మాసనంలో జరుగుతూ వస్తున్నది. మంగళవారం పిటిషన్ విచారణ సమయంలో భారత నావికాదళం తరపున వివరణతో కూడిన ఓ నివేదికను ధర్మాసనంకు సమర్పించి ఉన్నారు.
ఇందులో పేర్కొన్న అంశాలు వెలుగులోకి రావడంతో జాలర్లు తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జాలర్లను స్మగ్లర్లుగా చిత్రీకరించి ఉండటం గమనించాల్సిన విషయం. మాదక ద్రవ్యాల్ని అక్రమంగా తరలిస్తుండడంతోనే శ్రీలంక నావికాదళం తరచూ అరెస్టులు చేస్తున్నదని జాలర్లను ఉద్దేశించి ఆ నివేదికలో వివరించి ఉన్నారు. అలాగే, నిషేధిత వలల్ని జాలర్లు ఉపయోగిస్తున్నారని, సరిహద్దులు దాటి పదే పదే వెళ్లడం వల్లే దేశ భద్రత నిమిత్తం శ్రీలంక నావికాదళం ఇప్పటి వరకు 937 కేసులను జాలర్లపై నమోదు చేసి ఉన్నదని పేర్కొన్నారు. ఇక , చెప్పాలంటే, భారత సరిహద్దుల్లోకి వచ్చి ఎవర్ని అరెస్టు చేయలేదని, అలా అరెస్టు చేసినట్టుగా తమకు ఇంత వరకు ఏ ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని స్పష్టం చేయడం గమనించాల్సిన విషయం. శ్రీలంక తీరంలో చేపలు అధికంగా ఉండటంతో సరిహద్దులు దాటే వెళ్తున్నారని పేర్కొన బడి ఉంది.
అలాగే, జాలర్లను కట్టడి చేయడంలో , భద్రత కల్పించడంలో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయడం బట్టి చూస్తే, కేంద్రం ఆడుతున్న కపట నాటకాలు మరో మారు స్పష్టం అవుతోన్నది. ఈ నివేదికలోని అంశాలు వెలుగులోకి రావడంతో ఎండీఎంకే నేత వైగో, ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాలర్లకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. ప్రధానంగా మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారని పేర్కొంటూ స్మగ్లర్లుగా చిత్రీకరించడాన్ని ఖండించారు. ఇదే, విషయాన్ని పరిగణలోకి తీసుకున్న జాలర్ల సంఘాలు కేంద్రం మీద గుర్రుగా ఉన్నాయి.