
జల్లికట్టుకు సిద్ధం
చెన్నై, సాక్షి ప్రతినిధి:తమిళులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ పొంగల్. గ్రామీణ వాతావరణం వెల్లివిరిసే పొంగల్ పండుగలో జల్లికట్టు నిర్వహణ హైలెట్. మదించిన దున్నను అదుపు చేసిన వారు స్వగ్రామాల్లో హీరోగా చలామణి అవుతారు. ఏడాది పొడవునా అతనికి ఆ గౌరవం దక్కుతుంది. జల్లికట్టు ప్రమాదకరమని తెలిసినా యువత వెనక్కు తగ్గడం లేదు. మదురై, అలంగానల్లూరు, పుదుక్కోట్టై, కారైక్కుడి, శివగంగై, సేలం, తేనీ తదితర ప్రాంతాల్లో జల్లికట్టు హోరాహోరీగా సాగుతుంది. అలంగానల్లూరు ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ సాగే జల్లికట్టును చూసేందుకు విదేశీ యులు సైతం తరలి వస్తారు. తమిళనాడులో ఇంతటి ప్రాముఖ్య ం సంతరించుకున్న జల్లికట్టుపై గతేడాది నిషేధం వేటు పడింది. మదురై జిల్లా అలంగానల్లూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి జల్లికట్టుపై నిషేధం విధించాలని కోరుతూ 2006లో కోర్టులో పిటిషన్ వేశారు. జల్లికట్టు అత్యంత ప్రమాదంగా పరిణమించిందని, ఎందరో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వికృత క్రీడ బారినపడి 2012న రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారని, 33 మంది తీవ్రంగా గాయ పడ్డారని తెలిపారు. జల్లికట్టులో పాల్గొనే దున్న చేత మద్యం తాగిస్తారంటూ జంతు ప్రేమికులు అభ్యంతరాలు లేవనెత్తారు. జంతుప్రేమికుల సంఘం రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధిస్తూ గత ఏడాది మే 7న తీర్పు చెప్పింది.
జల్లికట్టుకు సీఎం ఏర్పాట్లు
గతేడాది పొంగల్ పండుగలో జల్లికట్టు ముగిసిన తర్వాత సుప్రీం కోర్టు తీర్పు వెలువడడంతో ప్రభావం కనిపించలేదు. అయితే ఈ ఏడాది జల్లికట్టు జరిగేనా అనే ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పక్షాలన్నీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రారంభించాయి. ప్రజలు సైతం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా జల్లికట్టు నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శనివారం ప్రకటించారు. నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టులో తీర్పు వెలువడగానే ప్రభుత్వం తరపున అప్పీలు చేశామని తెలిపా రు. అప్పీలుపై విచారణ జరుగుతున్నందున జల్లికట్టును నిర్వ హించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. క్రీడలో దున్నలను వినియోగించరాదని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహ రించాలని కోరుతూ ఈ నెల 7న ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం ఢిల్లీకి వెళ్లిందన్నారు. ఈ నెల 12న మరోసారి వెళుతుందని చెప్పారు. కేంద్రం సైతం తమ సంప్రదాయానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పన్నీర్‌సెల్వం తెలిపారు. కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడగానే ప్రణాళికాబద్ధంగా జల్లికట్టు నిర్వహిస్తామని పేర్కొన్నారు.