
నేడు రాష్ట్ర బంద్
సాక్షి ప్రతినిధి, చెన్నై: కర్ణాటకలో తమిళులపై దాడులను ఖండిస్తూ, వారికి తగిన బందోబస్తు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పుదుచ్చేరీ సహా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించనున్నారు. తమిళనాడులోని వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ తదితర సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా తమిళనాడు, పుదుచ్చేరీల్లో ప్రయివేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.కావేరీ జలాశయం నుంచి తమిళనాడుకు ఈనెల 20వ తేదీ వరకు సెకనుకు 12వేల ఘనపుటడుగల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పును నిరసిస్తూ కర్ణాటకలో అల్లర్లు చెలరేగాయి.
తమిళనాడుకు చెందిన వందలాది వాహనాలను తగులబెట్టి విధ్వంసాలకు పాల్పడ్డారు. తమిళుల కార్యాలయాలు, వ్యాపార సంస్థలను ధ్వంసం చేశారు. తమిళులపై దాడి చేశారు. ఒక తమిళుడిని సజీవదహనం కూడా చేశారు. కర్ణాటకలో తమిళుల రక్షణ కోసం వ్యవసాయ, వాణిజ్య, వ్యాపార సంఘాలు, లారీ యజమానుల సంఘాలు గురువారం అత్యవసరంగా సమావేశమయ్యాయి. కర్ణాటకలో ఆందోళనకారుల విధ్వంసకర చర్యలను ఈ సమావేశంలో ఖండించడంతోపాటూ కావేరీ జలాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు తమిళనాడు, పుదుచ్చేరీల్లో బంద్ నిర్వహించాలని తీర్మానించారు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు ఖండన పోరాటం నిర్వహించాలని నిర్ణయించారు. బంద్‌లో రాష్ట్రంలోని 65 లక్షల మంది వ్యాపారులు పాల్గొంటున్నారు. డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, పీఎంకే, సీపీఐ, సీపీఎం, తమాకా, వీసీకే తదితర పార్టీలన్నీ బంద్‌కు మద్దతు పలుకుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాపార సంస్థలన్నిటినీ మూసివేయనున్నారు. ట్రక్కులు, ట్యాంకర్ లారీలు, సాధారణ లారీలను కూడా నిలిపివేస్తున్నట్లు యజమానుల సంఘం తెలిపింది.
వ్యాన్, ఆటోలు సైతం తిరగవు. అయితే ప్రభుత్వ సిటీ బస్సులను పోలీసు బందోబస్తుతో నడిపేందుకు సిద్ధమవుతున్నారు. నాడు, పుదుచ్చేరీల్లో శుక్రవారం ప్రయివేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఉపాధ్యా, అధ్యాపక సంఘాలు తెలిపాయి. పెట్రోలు బంకులు, కోయంబేడు మార్కెట్ మూతపడనున్నాయి. పుదుచ్చేరీలో వివిధ పార్టీలు, సంఘాలు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. డీఎంకే, ఎండీఎంకే బంద్‌కు మద్దతు ప్రకటించాయి.
ఆత్మాహుతి యత్నం:కర్ణాటక ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ కావేరీ జలాల కోసం నామ్‌తమిళర్ కట్చి అధ్యక్షులు సీమాన్ ఆధ్యర్యంలో గురువారం ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనైన విఘ్నేష్‌కుమార్ అనే కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతి యత్నం చేశాడు. తీవ్రగాయాలకు గురైన అతడిని ఆసుపత్రిలో చేర్పించారు.