Tamil Nadu bandh
-
కనిమొళి, స్టాలిన్ అరెస్ట్
చెన్నై: కర్ణాటకలో తమిళులపై దాడులకు నిరసనగా తమిళనాడు వ్యాప్తంగా శుక్రవారం చేపట్టిన బంద్ ఉద్రిక్తంగా కొనసాగుతోంది. ఆందోళన కారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కొందరు ముఖ్యనేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ⇒ డీఎంకే కార్యకర్తలతో ఆందోళనకు దిగిన ఎంపీ కనిమొళిని పోలీసులు అన్నా సలైలో అదుపులోకి తీసుకున్నారు. ⇒ ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడానికి బయలుదేరిన డీఎంకే నేత స్టాలిన్, నలుగురు ఎమ్మెల్యేలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ⇒ సైదాపేట్ రైల్వే స్టేషన్లో రైతు నాయకుడు ఆర్పీ పాండ్యన్, డీఎంకే కార్యకర్తలతో కలిసి రైల్ రోకో నిర్వహించారు. ⇒ వీసీరే నేత తిరుమవల్వన్, కార్యకర్తలను బేసిన్ బ్రిడ్జ్ సమీపంలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ⇒ తిరుచ్చి రైల్ జంక్షన్లో పార్టీ కార్యకర్తలతో రైల్ రోకోలో పాల్గొనడానికి వెళ్తున్న ఎండీఎంకే నేత, రాజ్యసభ సభ్యులు వైకోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ⇒ ప్రతిపక్షాల నిరసన కార్యక్రమాలతో ఏఎంయూ ట్రైన్ సర్వీసులు నిలిపివేశారు ⇒ తంజావూరులో సీపీఐ నేత సీ. మహేంద్రన్ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ⇒ డీఎంకే ఎమ్మెల్యే కార్తీక్, కార్యకర్తలతో కలిసి సింగనల్లూరులో రైల్ రోకో నిర్వహించారు. ⇒ కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో పెద్ద మొత్తంలో భద్రతా బలగాలను మోహరించారు ⇒ ఐటీ కంపెనీలు, ప్రైవేటు కాలేజీలకు పోలీసులు పటిష్ట భద్రతను కల్పించారు. కర్ణాటకలోని తమిళులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ తదితర సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, పీఎంకే, సీపీఐ, సీపీఎం, తమాకా, వీసీకే తదితర పార్టీలన్నీబంద్‌కు మద్దతు పలికాయి. బంద్‌లో రాష్ట్రంలోని 65 లక్షల మంది వ్యాపారులు పాల్గొంటున్నారు. కావేరీ జలాశయం నుంచి తమిళనాడుకు ఈనెల 20వ తేదీ వరకు సెకనుకు 12వేల ఘనపుటడుగల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పును నిరసిస్తూ కర్ణాటకలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన వందలాది వాహనాలను తగులబెట్టి విధ్వంసాలకు పాల్పడ్డారు. తమిళుల కార్యాలయాలు, వ్యాపార సంస్థలను ధ్వంసం చేశారు. తమిళులపై దాడి చేశారు. ఒక తమిళుడిని సజీవదహనం కూడా చేసిన విషయం తెలిసిందే. -
సిగ్గుపడాల్సి వస్తోంది : కమలహాసన్
తమిళసినిమా: కర్ణాటకలోని కొన్ని సంఘాలు, అసాంఘిక శక్తులు పాల్పడుతున్న హింసాత్మక చర్యలను ఖండిస్తూ శుక్రవారం తమిళనాడులో బంద్ నిర్వహిస్తున్నారు. కాగా కావేరి జలాల వివాదంపై ప్రముఖ నటుడు కమలహాసన్ గురువారం స్పందిస్తూ మనం భాష తెలియని వానరంలా జీవించినప్పటి నుంచి కావేరి నది ప్రవహిస్తోంది. ఈ జలాలపై వివాదం ఏర్పడడం బాధాకరమని పేర్కొన్నారు. చరిత్ర అనే అద్దంలో మనం ముఖం చూసుకుని సిగ్గు పడాల్సి వస్తోంది అని కమల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. బంద్‌కు కోలీవుడ్ మద్దతు : నేడు షూటింగ్‌లు రద్దు తమిళ చిత్రపరిశ్రమకు చెందిన అన్ని సంఘాలు శుక్రవారం జరగనున్న బంద్‌కు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా అన్ని సంఘాల వారు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో పేర్కొంటూ తమిళ రైతుల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి అమ్మ సుప్రీంకోర్టులో పోరాడి కావేరి నీటిని తీసుకొస్తున్నారన్నారు. ధర్మాసనం ఆదేశాలను గౌరవించకుండా కర్ణాటక సంఘాలు హింసాత్మక చర్యలకు పాల్పడుతూ అక్కడి తమిళులపై దాడులకు దిగడాన్ని ఖండిస్తున్నామన్నారు. రైతుల కోసం పోరాడుతున్న ముఖ్యమంత్రి జయలలితకు అభినందనలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. కర్ణాటకలో తమిళులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ శుక్రవారం చేపట్టనున్న బంద్‌కు మద్దతుగా షూటింగ్‌లను, ఇతర కార్యక్రమాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. చిత్ర ప్రదర్శనలు కూడా ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ నిలిపివేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. -
నేడు రాష్ట్ర బంద్
సాక్షి ప్రతినిధి, చెన్నై: కర్ణాటకలో తమిళులపై దాడులను ఖండిస్తూ, వారికి తగిన బందోబస్తు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పుదుచ్చేరీ సహా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించనున్నారు. తమిళనాడులోని వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ తదితర సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా తమిళనాడు, పుదుచ్చేరీల్లో ప్రయివేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.కావేరీ జలాశయం నుంచి తమిళనాడుకు ఈనెల 20వ తేదీ వరకు సెకనుకు 12వేల ఘనపుటడుగల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పును నిరసిస్తూ కర్ణాటకలో అల్లర్లు చెలరేగాయి. తమిళనాడుకు చెందిన వందలాది వాహనాలను తగులబెట్టి విధ్వంసాలకు పాల్పడ్డారు. తమిళుల కార్యాలయాలు, వ్యాపార సంస్థలను ధ్వంసం చేశారు. తమిళులపై దాడి చేశారు. ఒక తమిళుడిని సజీవదహనం కూడా చేశారు. కర్ణాటకలో తమిళుల రక్షణ కోసం వ్యవసాయ, వాణిజ్య, వ్యాపార సంఘాలు, లారీ యజమానుల సంఘాలు గురువారం అత్యవసరంగా సమావేశమయ్యాయి. కర్ణాటకలో ఆందోళనకారుల విధ్వంసకర చర్యలను ఈ సమావేశంలో ఖండించడంతోపాటూ కావేరీ జలాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు తమిళనాడు, పుదుచ్చేరీల్లో బంద్ నిర్వహించాలని తీర్మానించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఖండన పోరాటం నిర్వహించాలని నిర్ణయించారు. బంద్‌లో రాష్ట్రంలోని 65 లక్షల మంది వ్యాపారులు పాల్గొంటున్నారు. డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, పీఎంకే, సీపీఐ, సీపీఎం, తమాకా, వీసీకే తదితర పార్టీలన్నీ బంద్‌కు మద్దతు పలుకుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాపార సంస్థలన్నిటినీ మూసివేయనున్నారు. ట్రక్కులు, ట్యాంకర్ లారీలు, సాధారణ లారీలను కూడా నిలిపివేస్తున్నట్లు యజమానుల సంఘం తెలిపింది. వ్యాన్, ఆటోలు సైతం తిరగవు. అయితే ప్రభుత్వ సిటీ బస్సులను పోలీసు బందోబస్తుతో నడిపేందుకు సిద్ధమవుతున్నారు. నాడు, పుదుచ్చేరీల్లో శుక్రవారం ప్రయివేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఉపాధ్యా, అధ్యాపక సంఘాలు తెలిపాయి. పెట్రోలు బంకులు, కోయంబేడు మార్కెట్ మూతపడనున్నాయి. పుదుచ్చేరీలో వివిధ పార్టీలు, సంఘాలు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. డీఎంకే, ఎండీఎంకే బంద్‌కు మద్దతు ప్రకటించాయి. ఆత్మాహుతి యత్నం:కర్ణాటక ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ కావేరీ జలాల కోసం నామ్‌తమిళర్ కట్చి అధ్యక్షులు సీమాన్ ఆధ్యర్యంలో గురువారం ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనైన విఘ్నేష్‌కుమార్ అనే కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతి యత్నం చేశాడు. తీవ్రగాయాలకు గురైన అతడిని ఆసుపత్రిలో చేర్పించారు.