
సిగ్గుపడాల్సి వస్తోంది : కమలహాసన్
తమిళసినిమా: కర్ణాటకలోని కొన్ని సంఘాలు, అసాంఘిక శక్తులు పాల్పడుతున్న హింసాత్మక చర్యలను ఖండిస్తూ శుక్రవారం తమిళనాడులో బంద్ నిర్వహిస్తున్నారు. కాగా కావేరి జలాల వివాదంపై ప్రముఖ నటుడు కమలహాసన్ గురువారం స్పందిస్తూ మనం భాష తెలియని వానరంలా జీవించినప్పటి నుంచి కావేరి నది ప్రవహిస్తోంది. ఈ జలాలపై వివాదం ఏర్పడడం బాధాకరమని పేర్కొన్నారు. చరిత్ర అనే అద్దంలో మనం ముఖం చూసుకుని సిగ్గు పడాల్సి వస్తోంది అని కమల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
బంద్‌కు కోలీవుడ్ మద్దతు : నేడు షూటింగ్‌లు రద్దు
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన అన్ని సంఘాలు శుక్రవారం జరగనున్న బంద్‌కు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా అన్ని సంఘాల వారు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో పేర్కొంటూ తమిళ రైతుల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి అమ్మ సుప్రీంకోర్టులో పోరాడి కావేరి నీటిని తీసుకొస్తున్నారన్నారు. ధర్మాసనం ఆదేశాలను గౌరవించకుండా కర్ణాటక సంఘాలు హింసాత్మక చర్యలకు పాల్పడుతూ అక్కడి తమిళులపై దాడులకు దిగడాన్ని ఖండిస్తున్నామన్నారు.
రైతుల కోసం పోరాడుతున్న ముఖ్యమంత్రి జయలలితకు అభినందనలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. కర్ణాటకలో తమిళులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ శుక్రవారం చేపట్టనున్న బంద్‌కు మద్దతుగా షూటింగ్‌లను, ఇతర కార్యక్రమాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. చిత్ర ప్రదర్శనలు కూడా ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ నిలిపివేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.