కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ సాధన లక్ష్యంగా తమిళనాట ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. పాలకపక్షం, ప్రతిపక్షం అని తేడా లేకుండా అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, రైతులు, యువత, విద్యార్థులు రాస్తారోకోలు, రైలురోకోలు, బంద్‌ల రూపంలో ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పోరాటం సాగుతోంది. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా కోలీవుడ్ ఆదివారం మౌన దీక్ష చేపట్టింది. చెన్నై నగరం నుంగంబాక్కంలోని వళ్లువర్‌కోట్టం సమీపంలో దీక్ష చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ దీక్ష సాగింది. సినీపరిశ్రమకు చెందిన నిర్మాతల మండలి, దక్షిణ భారత నటీనటుల సంఘం, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య, సినీ దర్శకుల సంఘం అంటూ అన్నీ సంఘాల నాయకులు, ప్రముఖ నటులు రజనీకాంత్, కమలహాసన్, విజయ్, సూర్య, విశాల్, ధనుష్‌లతో సహా పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు, సినీ కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల మనోభావాలను గౌరవించి కావేరి బోర్డు ఏర్పాటు చేసి, స్టెరిలైట్ పరిశ్రమను మూసివేయాలని తీర్మానించారు. సినీ పరిశ్రమకు చెందిన 30 వేల మంది సంతకాలతో కూడిన తీర్మాన పత్రాన్ని గవర్నర్‌ను అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
తమిళ సినిమా : కావేరి బోర్డు ఏర్పాటు, స్టెర్‌లైట్ పరిశ్రమ మూసివేతపై తమిళనాడులో ఆందోళన హోరెత్తుతోంది. అన్ని పార్టీల నాయకులు రోడ్డురోకో, రైలు రోకో, బంద్‌లు అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ తాము సైతం అంటూ ఆందోళనలకు సంఘీభావం తెలిపింది. ఆదివారం నుంగంబాక్కంలోని వళ్లువర్‌కోట్టం సమీపంలో కోలీవుడ్ మౌనదీక్ష చేపట్టింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మౌనదీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకూ జరిగింది. నిర్మాతల మండలి, దక్షిణ భారత నటీనటుల సంఘం, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య, సినీ దర్శకుల సంఘాలు తరలివచ్చి దీక్షలో పాల్గొన్నాయి.
రజనీకాంత్, కమలహాసన్ సంఘీభావం
దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి విశాల్, సంఘం అధ్యక్షుడు నాజర్, ఉపాధ్యక్షుడు పోన్‌వన్నన్, కోశాధికారి కార్తి తదితర కార్యవర్గ సభ్యులు మౌనదీక్షకు ఏర్పాట్లు చేశారు. రజనీకాంత్, కమలహాసన్‌ల నుంచి పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు, ఇతర సినీ ప్రముఖులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు కమలహాసన్, 11.30 గంటలకు రజనీకాంత్ దీక్షాస్థలికి చేరుకున్నారు. నటులు విజయ్, విక్రమ్, సూర్య, కార్తి, జయంరవి, విజయ్‌సేతుపతి, శివకుమార్, సత్యరాజ్, ధనుష్, శివకార్తికేయన్, పార్థిబన్, విజయ్‌ఆంటోని, ప్రశాంత్, సిబిరాజ్, శాంతను, వివేక్, సశుపతి, ఐసరిగణేశ్, రమేశ్‌ఖన్నా, తంబిరామయ్య, మన్సూర్‌అలీఖాన్, ఉదయ, ఆర్‌కే.సురేశ్, దర్శకుడు శంకర్, ఆర్‌కే.సెల్వమణి, సంగీత దర్శకుడు ఇళయరాజా, తంగర్‌బచ్చన్, ఆర్‌వీ.ఉదయకుమార్, ఎస్‌జే.సూర్య, నిర్మాత కలైపులి ఎస్.థాను, కేఈ.జ్ఞానవేల్‌రాజా, గీత రచయిత వైరముత్తు, ఛాయాగ్రాహకుడు పీసీ.శ్రీరామ్, నటి వరలక్ష్మి, కస్తూరి, శ్రీప్రియ, లత, పూర్ణిమ, రేఖ, లలితకుమారి, రోహిణి, సీఆర్.సరస్వతి, ఆర్తిగణేశ్ మొదలగు ప్రముఖులు తరలివచ్చి దీక్షలో పాల్గొన్నారు. నాజర్ మాట్లాడుతూ మౌనదీక్ష కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాంటిదన్నారు. రజనీ, కమల్ మాట్లాడతారని భావించిన వారికి నిరాశే ఎదురైంది.
తమిళులనే భావన లేని వారు పారిపోండి
ఇది మౌన దీక్ష అని ప్రకటించినా చివర్లో నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ తమిళుల వైపే నిలబడతానన్నారు. తమిళుల కోసం ఉండాలనుకునే వారు ఉండండి, తమిళులనే భావన లేని వారు పారిపోండి అని ఆవేశంగా మాట్లాడారు.
కానరాని నాయికలు
మౌనదీక్షకు నయనతార, త్రిష, స్నేహ, కుష్బూ, హన్సిక, కాజల్‌అగర్వాల్ వంటి ప్రముఖ నాయికలు డమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా నటుడు అజిత్, ఉదయనిధి స్టాలిన్, శింబు దీక్షకు గైర్హాజరయ్యారు. ఆహ్వానం అందనందువల్లే దీక్షకు రాలేదని శింబు మీడియాకు తెలిపారు.
ఆమోదించిన తీర్మానాలు
దీక్ష ముగించిన అనంతరం 4 తీర్మానాలు చేశారు. అందులో ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ పథకమైనా రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు అమలు పరచకూడదు. కావేరి జలాల పంపకంలో తమిళ రైతుల హక్కులను పరిరక్షించాలి. కావేరి మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలి. స్టెర్‌లైట్ పరిశ్రమను మూసివేయాలి లాంటి తీర్మానాలను చేశారు. ఈ తీర్మాన పత్రంతో పాటు సినీపరిశ్రమకు చెందిన 30వేల మంది సంతకాలతో గవర్నర్‌కు అందించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment