చెన్నైలో జరిగిన దీక్షలో కమల్, రజనీకాంత్
తమిళసినిమా (చెన్నై): కేంద్ర ప్రభుత్వం తక్షణం కావేరీ బోర్డును ఏర్పాటు చేయకుంటే తమిళనాడు ప్రజల ఆగ్రహం చవిచూడాల్సి ఉంటుందని సూపర్‌స్టార్ రజనీకాంత్ హెచ్చరించారు. తమిళనాడు మొత్తం ముక్త కంఠంతో కావేరీ బోర్డు ఏర్పాటును కోరుతోందన్నారు. కావేరి బోర్డు ఏర్పాటు కోసం తమిళనాడు ప్రభుత్వం, ప్రతిపక్షాల పోరాటానికి మద్దతుగా ఆదివారం కోలీవుడ్ పరిశ్రమ నిర్వహించిన మౌన దీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం సబబు కాదన్నారు.
‘రాష్ట్రం మొత్తం కావేరీ అంశంపై ఆందోళన చేస్తుంటే ఐపీఎల్‌ను నిర్వహించడం అవమానకరమే అవుతుంది. ఐపీఎల్‌పై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మ్యాచ్‌ల నిర్వహణను నిర్వాహకులు రద్దు చేసుకుంటే మంచిది. అలా కుదరని పక్షంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు నల్లబ్యాడ్జీలు ధరించి మ్యాచ్‌లు ఆడాలి’ అని రజనీకాంత్ సూచించారు.
కావేరీ అంశంపై తమిళనాడు, కర్ణాటకల్లో ఆందోళన కొనసాగుతున్న వేళ.. కన్నడ సంతతికి చెందిన ఎంకే సూరప్పను అన్నా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా గవర్నర్ నియమించడం సరికాదని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చెన్నై నుంగంబాక్కంలోని వళ్లువర్ కోట్టం వద్ద జరిగిన ఈ మౌనదీక్షలో రజనీకాంత్‌తో పాటు కమల్‌హాసన్, విజయ్, సూర్య, విశాల్, శింబు, ధనుష్‌లు సహా పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు, సినీ కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment