కమల్, రజనీ (ఫైల్‌ఫొటో)
సాక్షి, చెన్నై : సినిమాల్లో స్నేహితులు.. రాజకీయాల్లో ప్రత్యర్థులు.. ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రజనీకాంత్, కమల్ హాసన్ పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. భవిష్యత్తులో వీరు చేతులు కలుపుతారో లేదో తెలియదుకానీ.. ప్రస్తుతానికైతే రాజకీయాల్లో తలోదారిలో సాగుతున్నారు. రజనీ ఆధ్యాత్మిక రాజకీయమార్గం పడితే.. కమల్ ద్రవిడ రాజకీయాలను భుజానెత్తుకున్నారు. మొత్తానికి వీరిద్దరి దారులు వేరుకావడంతో రాజకీయంగా పరస్పరం విమర్శలు చేసుకోవడం అనివార్యంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మొదట కమల్ హాసన్ రజనీపై పరోక్ష విమర్శలను మొదలుపెట్టారు. చాలా అంశాలపై రజనీకాంత్ స్పందించడం లేదని మక్కల్ నీది మయ్యం చీఫ్ పేర్కొన్నారు. కావేరీ జలాల వివాదంపై రజనీ ఎందుకు మౌనంగా ఉన్నారని విలేకరులు ప్రశ్నించగా.. కావేరీ జలాల అంశమే కాదు... చాలా అంశాలపై రజనీ స్పందించడం లేదని, ఈ నేపథ్యంలో ఒక విషయాన్ని తీసుకొని.. మనం మాట్లాడలేమని ఆయన సోమవారం చెన్నైలో పేర్కొన్నారు.
దివంగత ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్ శిష్యులుగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రజనీకాంత్, కమల్ హాసన్ కోలీవుడ్‌లో సూపర్‌స్టార్లుగా ఎదిగారు. ఇటీవలి తమిళనాడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ రాజకీయాల్లో రాణించేందుకు అడుగులు వేస్తున్నారు. ఇటీవల కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీని ప్రకటించగా.. త్వరలోనే రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టేందుకు రజనీ సన్నాహాలు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment