
కనిమొళి, స్టాలిన్ అరెస్ట్
చెన్నై:
కర్ణాటకలో తమిళులపై దాడులకు నిరసనగా తమిళనాడు వ్యాప్తంగా శుక్రవారం చేపట్టిన బంద్ ఉద్రిక్తంగా కొనసాగుతోంది. ఆందోళన కారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కొందరు ముఖ్యనేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
⇒ డీఎంకే కార్యకర్తలతో ఆందోళనకు దిగిన ఎంపీ కనిమొళిని పోలీసులు అన్నా సలైలో అదుపులోకి తీసుకున్నారు.
⇒ ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడానికి బయలుదేరిన డీఎంకే నేత స్టాలిన్, నలుగురు ఎమ్మెల్యేలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
⇒ సైదాపేట్ రైల్వే స్టేషన్లో రైతు నాయకుడు ఆర్‌పీ పాండ్యన్, డీఎంకే కార్యకర్తలతో కలిసి రైల్ రోకో నిర్వహించారు.
⇒ వీసీరే నేత తిరుమవల్వన్, కార్యకర్తలను బేసిన్ బ్రిడ్జ్ సమీపంలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
⇒ తిరుచ్చి రైల్ జంక్షన్లో పార్టీ కార్యకర్తలతో రైల్ రోకోలో పాల్గొనడానికి వెళ్తున్న ఎండీఎంకే నేత, రాజ్యసభ సభ్యులు వైకోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
⇒ ప్రతిపక్షాల నిరసన కార్యక్రమాలతో ఏఎంయూ ట్రైన్ సర్వీసులు నిలిపివేశారు
⇒ తంజావూరులో సీపీఐ నేత సీ. మహేంద్రన్ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
⇒ డీఎంకే ఎమ్మెల్యే కార్తీక్, కార్యకర్తలతో కలిసి సింగనల్లూరులో రైల్ రోకో నిర్వహించారు.
⇒ కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో పెద్ద మొత్తంలో భద్రతా బలగాలను మోహరించారు
⇒ ఐటీ కంపెనీలు, ప్రైవేటు కాలేజీలకు పోలీసులు పటిష్ట భద్రతను కల్పించారు.
కర్ణాటకలోని తమిళులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ తదితర సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, పీఎంకే, సీపీఐ, సీపీఎం, తమాకా, వీసీకే తదితర పార్టీలన్నీబంద్‌కు మద్దతు పలికాయి. బంద్‌లో రాష్ట్రంలోని 65 లక్షల మంది వ్యాపారులు పాల్గొంటున్నారు. కావేరీ జలాశయం నుంచి తమిళనాడుకు ఈనెల 20వ తేదీ వరకు సెకనుకు 12వేల ఘనపుటడుగల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పును నిరసిస్తూ కర్ణాటకలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన వందలాది వాహనాలను తగులబెట్టి విధ్వంసాలకు పాల్పడ్డారు. తమిళుల కార్యాలయాలు, వ్యాపార సంస్థలను ధ్వంసం చేశారు. తమిళులపై దాడి చేశారు. ఒక తమిళుడిని సజీవదహనం కూడా చేసిన విషయం తెలిసిందే.