► ఒక్క రోజే
► దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళితో సరి
సాక్షి, చెన్నై : అసెంబ్లీని సమావేశ పరిచేందుకు తగ్గ కసరత్తుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. కొత్త ఏడాదిలో అయితే, గవర్నర్ ప్రసంగంతో సభను ప్రారంభించాల్సిన అవశ్యం ఉన్న దృష్ట్యా, ఈ నెలాఖరులో ఓ రోజు సమావేశం నిర్వహించేందుకు తగ్గ పరిశీలన సాగుతోంది. అమ్మ జయలలితకు నివాళులతో సరి పెట్టే విధంగా చర్యల్ని వేగవంతం చేశారు. సీఎం జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచే రాష్ట్రంలో పాలన కుంటు పడి ఉందని చెప్పవచ్చు. అమ్మ మరణం తదుపరి పగ్గాలు చేపట్టిన పన్నీరు సెల్వంకు వచ్చి రాగానే, వర్దా దెబ్బ తగిలింది. దాన్ని ధీటుగానే ఎదుర్కొన్నా, పార్టీలో సాగుతున్న వ్యవహారాలు ఎక్కడ పదవికి ఎసరు పెడుతుందోనన్న బెంగ తప్పడం లేదు. అదే సమయంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు అసెంబ్లీని సమావేశ పరచాలని పదే పదే ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
కావేరి జలాలు అందక ఎండుతున్న పంట, మొలకెత్తని విత్తనాలను చూసి అన్నదాతల గుండెలు పగులుతుండడం, బలవన్మరణాల పర్వం సాగుతుండడంతో అసెంబ్లీని సమావేశ పరచాల్సిందేనన్న ఒత్తిడి ప్రభుత్వం మీద పడింది. శనివారం కూడా ఇద్దరు రైతుల గుండెలు పగలడంతో గమనార్హం. ఇందులో ఒకరు నాగపట్నం జిల్లాకీలవేలూరుకు చెందిన త్యాగరాజన్(60), తిరువారూర్ సేతగ మంగళంకు చెందిన అళగు స్వామి(58) ఉన్నారు. రైతుమరణాల పర్వంతో అసెంబ్లీని సమావేశ పరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా..? అన్న ఎదురు చూపులు సర్వత్రా బయలు దేరింది. ఈ పరిస్థితుల్లో ప్రతి పక్షాల డిమాండ్ ఓ వైపు, అమ్మకు సంతాపం లక్ష్యంగా మరో వైపు ఓ రోజు పాటు సభను మమా అనిపించేందుకు ప్రభుత్వంలో చర్యల్లో పడింది.
కొత్త సంవత్సరంలో అసెంబ్లీ సమావేశం సాగాలంటే, గవర్నర్ ప్రసంగంతో మొదలు పెట్టక తప్పదు. ఈ దృష్ట్యా, ఈనెలఖరులో ఏదో ఒక రోజు అసెంబ్లీని సమావేశ పరిచి కేవలం దివంగత సీఎం జయలలిత మృతికి సంతాప తీర్మానం , ప్రతి పక్ష నేత ప్రసంగంతో ఈ ఏడాదిలో చివరి సమావేశాన్ని ముగించేందుకు తగ్గ పరిశీలనలో పన్నీరు ప్రభుత్వం నిమగ్నమై ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.