ఇక సమరమే!
► స్టాలిన్ దూకుడు
► 22న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు
►భవిష్యత్ కార్యాచరణ
► ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహాలు
అసెంబ్లీ వేదికగా పళని స్వామి ప్రభుత్వంతో సమరానికి సై అన్న, డీఎంకే కార్యనిర్వాహక కార్యదర్శి స్టాలిన్ దూకుడున ప్రదర్శించేందుకు నిర్ణయించారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం లక్ష్యంగా వ్యూహాల్ని రచించారు. ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా నిరసనల దీక్షకు స్టాలిన్ పిలుపునిచ్చారు. పళనిస్వామి ప్రభుత్వం ఇక, ప్రధాన ప్రతి పక్షాన్ని ఎలా ఢీ కొననుందో అన్న ఉత్కంఠ బయలు దేరింది.
సాక్షి, చెన్నై : ప్రధాన ప్రతి పక్షం అంటే, ఇక, ఇలాగే ఉంటామన్నట్టుగా అసెంబ్లీలో డీఎంకే ప్రదర్శించిన ఆక్రోశం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసెంబ్లీ లో డీఎంకే సృష్టించిన వీరంగం కంటే, స్టాలిన్ మీద జరిగిన దాడి చర్చనీయాంశంగా మారింది. చిన్నమ్మ శశికళ మీద ప్రజల్లో ఆగ్రహం తాండవం చేస్తున్న దృష్ట్యా, వారి సేనలకు వ్యతిరేకంగా స్టాలిన్ ఎమ్మెల్యే బృందం ప్రదర్శించిన వ్యూహాలను ఆహ్వానించే ప్రజానీకం ఎక్కువే. ఇక, రాజకీయ పక్షాలు సైతం స్టాలిన్ మీద జరిగిన దాడిని తీవ్రంగానే ఖండిస్తున్నాయి. పీఎంకే యువనేత అన్భుమణి, ఎండీఎంకే నేత వైగో మినహా మెజారిటీ శాతం మంది డీఎంకే చర్యలను సమర్థిస్తున్నారు.
బలపరీక్షలో స్పీకర్ తీరును, ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. ఇక, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ అయితే, ఈ దాడిపై న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్న డిమాండ్‌ను తెర మీదకు తీసుకురావడం గమనార్హం.అలాగే, స్పీకర్ కుల ప్రస్తావనతో సభలో వ్యాఖ్యలు చేయడాన్ని డీఎండీకే అధినేత విజయకాంత్ తీవ్రంగా ఖండించారు. అలాగే సభా నిబంధనలకు అనుగుణంగా స్పీకర్ ఓటింగ్ నిర్వహించలేదని మాజీ స్పీకర్లు సేడపట్టి ముత్తయ్య, ఆవుడయప్పన్, పి.పి.దొరైస్వామి వ్యాఖ్యానించడం, స్పీకర్ తీరును దుయ్యబట్టడం డీఎంకెకు కలసి వచ్చే అంశంగా మారాయి.
ప్రతి పక్షాలన్నీ తమకు మద్దతుగా స్పంది స్తుండడంతో ఇక, తన మీద పథకం ప్రకారం దాడి జరిగి ఉండడం వెలుగులోకి రావడం, ఇందులో తొమ్మిది మంది ఐపీఎస్‌ల హస్తం ఉన్నట్టు తేలడాన్ని తనకు అనుకూలంగా మలచుకుని ప్రజా మద్దతును కూడగట్టుకునేందుకు స్టాలిన్ సిద్ధమయ్యారు. అసెంబ్లీ నిబంధనల్ని ఉల్లంఘించి, మార్షల్స్ ముసుగులో చొరబడ్డ తొమ్మిది మంది ఐపీఎస్‌ల చర్యల్ని, స్పీకర్ ధనపాల్ రచించిన వ్యూహాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఇక సమరమే అని దూకుడు పెంచేందుకు నిర్ణయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు: స్పీకర్ చర్యలు ఓ వైపు ఉంటే, మరో వైపు సభలో అన్నాడీఎంకే సభ్యుల మెజారిటీ లెక్కలు తేలడం లేదన్న ప్రచారం ఊపందుకుని ఉండడాన్ని ఆసరాగా చేసుకుని, మళ్లీ బల పరీక్ష లక్ష్యంగా వ్యూహ రచనల్లో స్టాలిన్ నిమగ్నం అయ్యారు. ఇందుకుగాను, ఆదివారం ఉదయం తేనాంపేటలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులతో సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించా రు. ఇక, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం లక్ష్యంగా దూకుడు ప్రదర్శించేందుకు నిర్ణయించారు. బల పరీక్షలో నెగ్గిన విశ్వాస తీర్మానం ఆమోదించ వద్దు అని, దానిని రద్దు చేసి మళ్లీ పరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌కు విన్నవించుకునే పనిలో పడ్డారు.
ఇందుకోసం డీఎంకే ఎంపీలు తిరుచ్చిశివ, ఆర్‌ఎస్ భారతి, టీకేఎస్ ఇళంగోవన్ రాజ్‌భవన్ చేరుకుని గవర్నర్ విద్యాసాగర్‌రావుతో భేటీ కావడం గమనార్హం. ఈ భేటీ ఓ వైపు సాగుతుంటే, మరో వైపు తన మీద జరిగిన దాడిపై ఆందోళన వ్యక్తం చేస్తూ స్టాలిన్ ప్రకటన విడుదల చేయడం, తదుపరి దాడికి నిరసనగా ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా పోరుకు పిలుపు నివ్వడం బట్టి చూస్తే దూ కుడు మరింతగా పెరినట్టే అన్నది స్పష్టం అవుతోంది. ఆ రోజున ఉద యం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన దీక్ష సాగనుంది. దాడిని ఖండించే వాళ్లు, సభలో డీఎంకే చర్యల్ని సమర్థించే ప్రజానీకం ఈ నిరసనదీక్షకు తరలి రావాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జిని కలిసేందుకు ప్రయత్నాలు చేపట్టడం, చివరగా కోర్టుకు సైతం వెళ్లేందుకు డీఎంకే కసరత్తు చేసి ఉండడం గమనార్హం.
కేసు నమోదు: స్టాలిన్ తన దూకుడుతో ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు ఉరకలు తీస్తుంటే, మరో వైపు పోలీసులు కేసుల నమోదుకు సిద్ధం అయ్యారు. మెరీనా తీరంలో అనుమతి లేకుండా ఆందోళన చేపట్టారని, ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం సృష్టించారని పేర్కొంటూ, స్టాలిన్ తో , ఇద్దరు ఎంపీలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో పాటుగా మొత్తంగా రెండు వేల మంది పై కేసులు రెండు సెక్షన్లలో నమోదు కావడం గమనార్హం.
రవిచంద్రన్ కు స్టాలిన్ పరామర్శ: మార్షల్ దురుసుతో గాయపడ్డ ఎగ్మూర్ ఎమ్మెల్యే రవిచంద్రన్ ను డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పరామర్శించారు. నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను పరామర్శించి, కుటుంబీకులకు భరోసా ఇచ్చారు. శనివారం అసెంబ్లీలో డీఎంకే సభ్యుల గెంటి వేత ఉద్రిక్తతకు దారితీసిన సమయంలో రవిచంద్రన్ గాయపడ్డారు.