
ప్రతిపక్షాలు ఏకం
• నేడు సమావేశం వేదికగా అన్నా అరివాలయం
• మద్దతుగా వాసన్ నిర్ణయం తేల్చని డీఎండీకే, పీఎంకే
• మిత్రులతో తిరుమా మంతనాలు
ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు డీఎంకే సిద్ధమైంది. మంగళవారం ఉదయం అన్నా అరివాలయం వేదికగా ఈ సమావేశం జరగనుంది. ఇందుకు కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్, ఎంఎంకేలతో పాటుగా పలు చిన్న పార్టీలు మద్దతు ప్రకటించాయి. మక్కల్ ఇయక్కంలో ఉన్న వీసీకే నేత తిరుమావళవన్ మిత్రులతో తీవ్ర మంతనాల్లో ఉన్నారు. మిత్రులు కలిసి వస్తే సమష్టిగా, లేకుంటే తానొక్కడే హాజరయ్యే అవ కాశాలు ఉన్నాయి.
సాక్షి, చెన్నై: కావేరి జల వివాదం జఠిలం అవుతోన్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అఖిలపక్షంతో ముందుకు సాగుదామని ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వంకు ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేసినా స్పందన శూన్యం. దీంతో ఇక తన నేతృత్వం అన్నట్టుగా ప్రధాన ప్రతిపక్షం ముందుకు కదిలింది. ప్రతిపక్షాలంతా ఏకమై ముందుకు సాగుదామని, వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేయాలని, కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని స్టాలిన్ ఇచ్చిన పిలుపుతో కొందరు స్పందిస్తే, మరి కొందరు విమర్శలు గుప్పించారు.
ఇంకొందరు మౌనం వహించే పనిలో పడ్డారు. విమర్శలు గుప్పించే వారిలో ప్రధానంగా బీజేపీ, ఎండీఎంకే, అన్నాడీఎంకే ఉన్నాయి. పీఎంకే, డీఎండీకే మౌనం వహించే పనిలో పడ్డాయి. అయితే మంగళవారం అన్నా అరివాలయం వేదికగా జరగనున్న ఈ అఖిల పక్షం బేటీకి ఎన్ని ప్రతి పక్ష పార్టీలకు చెందిన వారు తరలి వస్తారో అన్న ఎదురు చూపులు పెరిగాయి.
ఇప్పటికే కాంగ్రెస్, మనిదనేయమక్కల్ కట్చితో పాటుగా మరికొన్ని చిన్న పార్టీలు మద్దతు ప్రకటించాయి. తాజాగా తమిళ మానిల కాంగ్రెస్ తాము సైతం అంటూ ముందుకు వచ్చింది. సోమవారం మీడియాతో ఆ పార్టీ నేత జీకే వాసన్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సాగుతున్న ఈ సమాలోచనకు తాను స్వయంగా వెళ్తున్నట్టు ప్రకటించారు. ఇది అన్ని వర్గాల సమస్య అని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్న విషయాన్ని పరిగణించాలని సూచించారు. పెరుందలైవర్ మక్కల్ కట్చి నేత ఎన్‌ఆర్ ధనపాలన్ సైతం డీఎంకే పిలుపునకు మద్దతు ప్రకటించారు. కొన్ని రైతు సంఘాలు, మరికొన్ని ప్రజా సంఘాలు కదిలేందుకు సిద్ధం కాగా, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కావేరి బోర్డు సాధన లక్ష్యంగా దీక్షకు నిర్ణయించడం విశేషం.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరునావుక్కరసర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించని దృష్ట్యా, ప్రధాన ప్రతిపక్షం ముందుకు వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇష్టం ఉంటే, సమావేశానికి హాజరు కావాలని, ఇష్టానుసారంగా విమర్శలు, ఆరోపణలు గుప్పించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఎండీఎంకే నేత వైగో తీసుకున్న నిర్ణయాన్ని పునస్సమీక్షకు మక్కల్ ఇయక్కంలోని వీసీకే పట్టుబట్టే పనిలో నిమగ్నమైంది.
వీసీకే హాజరయ్యేనా: రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో, ప్రధాన ప్రతిపక్షం అయినా, ముందుకు వచ్చి అఖిల పక్షానికి పిలుపునివ్వాలని డిమాండ్ చేసిన వారిలో వీసీకే నేత తిరుమావళవన్ ఉన్నారు. మక్కల్ ఇయక్కంలో కీలక పాత్ర పోషిస్తున్న తిరుమావళవన్‌ను ఆ డిమాండ్ సందిగ్ధంలో పడేసింది. మక్కల్ ఇయక్కం డీఎంకే సమావేశాన్ని బహిష్కరించింది. ఇందుకు తగ్గట్టుగా ఆ ఇయక్కం కన్వీనర్, ఎండీఎంకే నేత వైగో ప్రకటన చేశారు.
అయితే వైగో తన నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని తిరుమావళవన్ ఒత్తిడి చేసేందుకు సిద్ధం అయ్యారు. సోమవారం చెన్నైలో జరిగిన వీసీకే కార్యవర్గంలో ఇందుకు తగ్గ నిర్ణయం తీసుకున్నారు. ఇయక్కంలోని సీపీఎం, సీపీఐలతో సమీక్షించే పనిలో తిరుమావళవన్ నిమగ్నం కావడం గమనార్హం. ఎండీఎంకే కరాఖండిగా తాము దూరం అని తేల్చిన దృష్ట్యా, ఇక, సీపీఎం, సీపీఐలు ఏ మేరకు స్పందిస్తాయో అన్న ఎదురు చూపులు పెరిగాయి. కలిసి వస్తే మిత్రులతో పాటుగా తిరుమా డీఎంకే కార్యాలయం మెట్లు ఎక్కే అవకాశాలు ఉన్నాయి. లేని పక్షంలో తానొక్కడిని వెళ్తే మాత్రం, ఇక మక్కల్ ఇయక్కంలో అంతర్గతంగా సాగుతున్న విభేదాలు బయట పడ్డట్టే.