సెంథిల్ అవుట్
రవాణా శాఖ మంత్రి, అన్నాడీఎంకే కరూర్ జిల్లా కార్యదర్శి సెంథిల్ బాలాజీకి ఉద్వాసన పలికారు. ప్రభుత్వ, పార్టీ పదవి నుంచి ఆయన్ను హఠాత్తుగా సాగనంపడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన చేతిలో ఉన్న పదవులను పరిశ్రమల శాఖ మంత్రి తంగమణికి అప్పగించారు.
సాక్షి, చెన్నై : 2011 ఎన్నికల్లో కరూర్ నియోజకవర్గం నుంచి సెంథిల్ బాలాజీ అసెంబ్లీ మెట్లు ఎక్కారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు తన కేబినెట్‌లో సీఎం జయలలిత చోటు కల్పించారు. రవాణా శాఖ మంత్రిగా, పార్టీ కరూర్ జిల్లా కార్యదర్శిగా పదవులు దక్కడంతో సెంథిల్ బాలాజీ తన సత్తాను చాటారు. చతికిలబడ్డ రవాణా సంస్థను బలోపేతం చేయడానికి శ్రమించారు. సీఎం జయలితకు సన్నిహితంగా మెలిగే స్థాయికి చేరారు. పలుమార్లు కేబినెట్‌లో మార్పులు జరిగినా సెంథిల్ బాలాజీ శాఖ కనీసం మార్పు కూడా జరగలేదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష ఖరారు కావడంతో సీఎం జయలలితపై అనర్హత వేటు పడ్డ సమయంలో సీఎం చాన్స్ సెంథిల్ బాలాజీకి దక్కబోతున్నంతగా ప్రచారం కూడా సాగింది. అమ్మ నిర్దోషిగా బయటపడటంతో మొక్కులు కూడా తీర్చుకున్నారు.
అయితే సీఎంగా జయలలిత మళ్లీ పగ్గాలు చేపట్టినానంతరం సెంథిల్ బాలాజీ ప్రభుత్వ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో సోమవారం సెంథిల్ బాలాజీని పదవి నుంచి తొలగిస్తూ సీఎం జయలలిత చేసిన సిఫారసుకు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆమోదముద్ర వేశారు. ఆ బాధ్యతలను పరిశ్రమల శాఖ మంత్రి తంగమణికి అదనంగా అప్పగించారు. అదే సమయంలో కరూర్ జిల్లా కార్యదర్శి పదవి నుంచి కూడా సెంథిల్ బాలాజీని తొలగించినట్టు అన్నాడీఎంకే కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ఆ బాధ్యతను కూడా పార్టీ నామక్కల్ జిల్లా కార్యదర్శి తంగమణికి అదనంగా అప్పగించడం గమనార్హం.
సెంథిల్ ఉద్వాసన వెనుక బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా లేదా ఇటీవల జరిగిన డ్రైవర్ల నియామకంలో గోల్‌మాల్ జరిగిందా లేదా రహస్యాల్ని బహిరంగంగా మాట్లాడటం అలవాటు చేసుకున్న బాలాజీ నోరు జారారా అన్న చర్చ అన్నాడీఎంకేలో బయలుదేరింది. జయలలితకు విశ్వాస పాత్రుడిగా, కేబినెట్‌లో యువకుడిగా ఉన్న సెంథిల్ బాలాజీపై జయలలిత కన్నెర్ర చేయడంతో ఇతర మంత్రుల్లో గుబులు బయలుదేరింది. సోమవారం సీఎం జయలలిత సచివాలయానికి 12 గంటల సమయంలో వచ్చారు. ఆమె రాగానే మంత్రుల వరుసలో నిలబడి నమస్కరించి, ఆహ్వానం పలికిన బాలాజీకి కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆమె షాక్ ఇచ్చారు.