అమ్మ త్వరలో ఇంటికి
అన్నాడీఎంకే నేత వెల్లడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారని.. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో ఆస్పత్రి నుంచి ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని అన్నాడీఎంకే వెల్లడించింది. లండన్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ సమక్షంలో అపోలో ఆస్పత్రి వైద్యులు, ఎయిమ్స్, సింగపూర్ వెద్య నిఫుణులు జయలలిత ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేసి దీనిపై నిర్ణయం తీసుకోనున్నారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి గురువారం ప్రకటించారు. కాగా, అపోలో ఆస్పత్రి మాత్రం దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
జయలలిత ఆస్పత్రిలో చేరి గురువారానికి 29 రోజులైంది. సీఎం జయ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శివకుమార్ నేతృత్వంలో ప్రారంభమైన చికిత్సలో ఆ తర్వాత లండన్, ఎయిమ్స్, సింగపూర్ వైద్యులు పాలుపంచుకున్నారు. ప్రస్తుతం జయలలితకు ఫిజియోథెరపీ మాత్రమే కొనసాగుతోంది. కాగా, జయ డిశ్చార్జ్‌పై నిర్ణయం తీసుకునేందుకు లండన్ డాక్టర్ రిచర్డ్ మరో నాలుగు రోజుల్లో చెన్నై రానున్నట్లు తెలుస్తోంది. అమ్మ కోలుకోవాలని కోరుతూ అనేక ఆలయాల్లో అన్నాడీఎంకే శ్రేణులు గురువారం కూడా ప్రార్థనలు నిర్వహించాయి. జయలలిత అనారోగ్యానికి గురైందన్నవేదనతో ఈనెల 13న శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్న తమిళనాడులోని కుంభకోణానికి చెందిన మోహన్‌కుమార్(48) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.