ఒంటిపై రాతలతో నిరసన
► ఢిల్లీలో తమిళ రైతుల ఆందోళన
► 30వ రోజుగా డిమాండ్ల పరిష్కారానికి పట్టు
టీనగర్: ఢిల్లీలో తమ డిమాండ్ల కోసం ఆందోళన జరుపుతున్న తమిళ రైతులు బుధవారం ఒంటిపై రాతలతో నిరసన చేపట్టారు. ప్రస్తుతం ఈ ఆందోళన 30వ రోజుకు చేరుకుంది. ఇందులో ఎలాగైనా తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆం దోళన కొనసాగిస్తామని పట్టుబట్టారు. ఇంతవరకు అనేక వినూత్న పద్ధతుల్లో ఆందోళన జరుపుతున్న రైతులు బుధవారం తమ ఒంటిపై ‘బ్యాంకు రుణాలు మాఫీ చేయాలి, కావేరి మేనేజ్‌మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేయా లి’ అంటూ తమ ఒంటిపై డిమాండ్లను రాసి ఆందోళన జరిపారు.
ఇందులో ఓపీఎస్ వర్గం, శశికళ వర్గానికి చెందిన పలువురు ఎంపీలు పాల్గొన్నారు. అంతేకాకుండా కేంద్ర మంత్రులు పాల్గొన్నట్లు సమాచారం అందింది. ఇలాఉండగా మంగళవారం బీజేపీ కేంద్ర మంత్రి పొన్‌రాధాకృష్ణన్‌ను కలిసి రైతు సంఘాల అధ్యక్షుడు అయ్యాకన్ను చర్చలు జరిపా రు. అందులో కొంత అనుకూలత ఏర్పడినందున బుధవారం మళ్లీ ఆయన కార్యాలయంలో రాతపూర్వకంగా తమ డిమాండ్లను తెలిపారు. ఈ సందర్భంగా పొన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రైతు సంఘాల అధ్యక్షుడు అయ్యాకన్ను సహా ఐదుగురు బు«ధవారం ఉదయం పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురైను కలిశారు. దీనిగురించి తంబిదురై మాట్లాడుతూ రాష్ట్ర రైతుల కోర్కెల గురించి ప్రధానికి పిటిషన్ అందజేశానని, దీన్ని స్వీకరించిన ప్రధాని రైతుల బ్యాంకు రుణాలు, కావేరి మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు, కరువుసాయం అందజేత తదితర పరిష్కారాల గురించి అతిత్వరలో చర్యలు తీసుకుంటామని లేఖ ద్వారా తెలిపారన్నారు. ఈ లేఖను రైతుల పోరాటంలో పాల్గొననున్న సమయంలో వారికి చూపుతామన్నారు.
ఇలాఉండగా పొన్‌రాధాకృష్ణన్ నేతృత్వంలో రాష్ట్ర పంచాయతీ అధ్యక్షుడు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పరిశుభ్రమైన మంచినీటి సరఫరా, 100 శాతం మరుగుదొడ్ల కల్పన, తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం పంచాయతీ అధ్యక్షులకు అవార్డులను అందజేసి ప్రోత్సహిస్తోంది. ఈ అవార్డులను అందుకునేందుకు కొందరు మాజీ పంచాయతీ అధ్యక్షుడు ఢిల్లీకి సోమవా రం చేరుకున్నారు. వీరంతా బుధవారం ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఇందులో కేంద్ర మంత్రి పొన్‌రాధాకృష్ణన్ పాల్గొన్నారు.
25 నుంచి రాస్తారోకో :రైతుల సంఘం ప్రకటన
వ్యవసాయ రుణాలు రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25వ తేదీ నుంచి రాస్తారోకోలు జరపనున్నట్లు రైతుల సంఘం ప్రకటించింది. రాష్ట్ర రైతుల సంఘం కార్యవర్గ సమావేశం సేలంలో మంగళవారం జరిగింది. ఇందులో రాష్ట్ర అధ్యక్షుడు చిన్నస్వామి పాల్గొన్నారు. ఇందులో వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో ప్రదర్శనలు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారు.
నారాయణస్వామి డిమాండ్ : రైతుల రుణాలను మాఫీ చేయాలని కోరుతూ పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతు కుటుంబానికి రూ.20 వేల సాయం
రైతు భధ్రతా పథకంలో సభ్యునిగా ఉన్న రైతు సహజ మరణం పొందితే ఆయన కుటుంబానికి ఆర్థికసాయాన్ని రూ.20 వేలుకు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఉత్తర్వులు జారీ చేశారు.