Tamil farmers
-
మోదీకి గుడి కట్టిన రైతు
తిరుచిరాపల్లి: ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలకు ముగ్ధుడైన ఓ తమిళ రైతు మోదీకి గుడి కట్టాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లికి 63 కిలోమీటర్ల దూరంలో ఉండే ఏరకుడి గ్రామం లో పి.శంకర్ అనే రైతు మోదీ గుడిని గత వారమే ప్రారంభించాడు. అక్కడ మోదీ ప్రతిమకు ప్రతిరోజూ హారతి ఇస్తున్నాడు. తను ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధి పొందానని, ఆయనంటే తనకెంతో అభిమానమని శంకర్ పేర్కొన్నాడు. గుడి నిర్మాణానికి లక్షా ఇరవై వేల రూపాయల ఖర్చు అయింది. -
పుర్రెలతో రైతుల నిరసన
టీ.నగర్: తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ తమిళ రైతులు ఢిల్లీలో సోమవారం రెండో రోజుగా పుర్రెలు, బిక్షాటన పాత్రలతో వినూత్నంగా నిరసన తెలిపారు. కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటుచేయాలని, జాతీయ బ్యాంకుల్లో రైతుల రుణాలను మాఫీ చేయాలని తదితర కోర్కెలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ జాతీయ దక్షిణాది నదుల అనుసంధానం రైతుల సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద తమిళనాడు రైతులు ఆదివారం నుంచి ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ కార్యాలయం ఎదుట గోచీలతో ఆందోళనలో పాల్గొన్న రైతులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి సాయింత్రం విడిపించారు. ఇలాఉండగా సోమవారం రెండో రోజుగా జంతర్‌మంతర్ వద్ద పుర్రెలు, భిక్షాపాత్రలతో వినూత్నంగా ఆందోళన జరిపారు. ఆ సమయంలో జోరున వర్షం కురిసింది. అయినప్పటికీ వర్షంలో తడుస్తూనే వారు తమ కోర్కెలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. -
రైతుల ఆందోళనకు డీఎంకే మద్దతు
పళ్లిపట్టు: సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న చెక్‌డ్యాం నిర్మాణానికి వ్యతిరేకంగా తమిళరైతులు చేపట్టిన ఆందోళనకు డీఎంకే మద్దతు పలికింది. పళ్లిపట్టు సమీపంలోని ఆంధ్రా తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దులోని కుశస్థలి నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెక్‌డ్యాం నిర్మిస్తుండడంతో తమిళ రైతులు వారం రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో చెక్‌డ్యాం నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో తిరువళ్లూరు జిల్లా డీఎంకే కార్యదర్శి వేణు అధ్యక్షతన మండల కార్యదర్శి జి.రవీంద్ర సమక్షంలో 300 మంది డీఎంకే శ్రేణులు ఆదివారం చెక్‌డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి తమిళ రైతుల ఆందోళనకు తమ మద్దతు తెలిపారు. వేణు మాట్లాడుతూ సరిహద్దులో యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెక్‌డ్యాం నిర్మించి సరిహద్దు గ్రామీణుల మధ్య చిచ్చుపెడుతున్నట్లు తమిళ రైతులకు తీవ్ర నష్టాన్ని ఏర్పరిచే చెక్‌డ్యాం నిర్మాణాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అంతవరకు రైతులకు మద్దతుగా డీఎంకే ఆందోళనలో పాల్గొంటుందని తెలిపారు. జిల్లా డీఎంకే అధ్యక్షుడు పగలవన్, పళ్లిపట్టు పట్టణకార్యదర్శి జ్యోతికుమార్, తిరుత్తణి పట్టణ కార్యదర్శి భూపతి, మండల నాయకులు మునిరత్నం నాయుడు, దేవరాజు, దాస్, తిరుమలైలోకనాథన్, సుధామెహన్ సహా 300 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆందోళన విరమించిన తమిళ రైతులు
న్యూఢిల్లీ: రుణమాఫీ చేయాలంటూ ఢిల్లీలో 41 రోజులుగా ఆందోళన చేస్తున్న తమిళ రైతులు తమ పోరాటానికి విరామం ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఇచ్చిన హామీతో ఆందోళన విమరమించారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే మే 25 నుంచి మరోసారి ఆందోళనకు దిగుతామని రైతు నాయకుడు అయ్యాకన్ను హెచ్చరించారు. తమకు రైలు టికెట్లు ఇస్తే ఈ రోజే తమిళనాడుకు బయలుదేరతామని చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన పళనిస్వామి ఆదివారం ఉదయం పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్, పార్టీ ఎంపీ తంబిదురైతో కలిసి జంతర్‌మంతర్ వద్దకు అడుగు పెట్టారు. ఆయన్ను రైతులు సాదరంగా ఆహ్వానించి తమ గోడును ఏకరువు పెడుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. అక్కడే రోడ్డుపై కూర్చుని సీఎం రైతు నాయకుడు అయ్యాకన్నుతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటానని, ఆందోళన వీడాలని కోరారు. రైతు సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యల్ని వేగవంతం చేసిందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అందరికీ న్యాయం జరుగుతుందని, ఆందోళన వీడి రాష్ట్రానికి బయలుదేరాలని కోరారు. సీఎం విజ్ఞప్తిని అయ్యాకన్ను తోసిపుచ్చారు. ప్రధాని మోదీతో సీఎం చర్చించిన అనంతరం వెలువడే ప్రకటన మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రధానితో భేటీకి తమను తీసుకెళ్తామన్న సూచన కూడా చేశారని, ప్రధాని ఇచ్చే హామీ మేరకు పోరాటం కొనసాగించాలా వద్దా అన్నది నిర్ణయిస్తామన్నారు. అక్కడినుంచి సీఎం బయలుదేరి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో రైతుల పోరాటాల ప్రస్తావన తీసుకొస్తూ రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా నిధుల కేటాయింపులు, నీట్ మినహాయింపుపై సీఎం ప్రసంగం సాగింది. రైతులు ఇచ్చిన వినతిపత్రాన్ని ప్రధానికి అందజేశారు. ఆందోళన విరమిస్తున్నట్టు ఆదివారం సాయంత్రం రైతులు ప్రకటించారు. -
ఆందోళన విరమించిన తమిళ రైతులు
-
25న విపక్షాల తమిళనాడు బంద్.. భారీ బహిరంగ సభ
-
మూత్రసేవనంతో నిరసన
- 40వ రోజుకు చేరిన తమిళ రైతుల వినూత్న ఆందోళన - జంతర్ మంతర్ ఖాళీ చేయాలంటూ ఢిల్లీ పోలీసుల హెచ్చరిక - 25న విపక్షాల తమిళనాడు బంద్.. భారీ బహిరంగ సభ సాక్షి, చెన్నై: రుణమాఫీ చేయాలంటూ ఢిల్లీలో 40 రోజులుగా తమిళ రైతులు చేస్తున్న ఆందోళన కొత్త బాట పట్టింది. శనివారం కొందరు రైతులు తమ మూత్రం తామే తాగి నిరసన తెలిపారు. దీంతో వీరిపై ఢిల్లీ పోలీసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడు అయ్యాకన్నుతో సహా పలువురిని స్టేషన్‌కు తీసుకెళ్లి హెచ్చరించి వదిలిపెట్టారు. మరోవైపు, ఈ ఆందోళనను తాత్కాలికంగా వీడాలని రైతు నాయకుడు అయ్యాకన్నుకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సూచించారు. అటు, రైతు బంద్‌కు నడిగర్ (దక్షిణ భారత నటీనటుల) సంఘం మద్దతు ప్రకటించింది. విద్యార్థి సంఘాలు బంద్ విజయవంతానికి పిలుపునిచ్చాయి. కట్టలు తెగిన రైతు ఆగ్రహం నెలకు పైగా ఢిల్లీలో వినూత్న రీతుల్లో నిరసన కొనసాగిస్తున్న తమిళనాడు రైతుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానంటూ తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ భరోసా ఇచ్చారు. దీంతో రెండ్రోజులపాటు తమ ఆందోళనకు విరామమిచ్చారు. శనివారం అకస్మాత్తుగా జంతర్‌మంతర్ వద్ద దీక్షకు దిగిన రైతులు మళ్లీ ఆందోళన బాట చేపట్టారు. రాధాకృష్ణన్ తమను మోసం చేశారంటూ ఆగ్రహించారు. తాము మోసపోతున్నామని, తమను పట్టించుకునేవాడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మూత్రాన్ని తామే తాగేందుకు ప్రయత్నించారు. అక్కడున్న ఢిల్లీ పోలీసులు వీరిని ఆపేటప్పటికే ఒకరిద్దరు మూత్రం సేవించారు. వీరిని అడ్డుకున్న పోలీసులు.. రైతు నాయకుడు అయ్యాకన్ను సహా పలువురిని స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా మందలించారు. జంతర్‌మంతర్‌ను ఖాళీ చేసి వెళ్లాలని హెచ్చరించినా రైతులు అక్కడే కూర్చున్నారు. కాగా, నీతి ఆయోగ్ సమావేశానికి ఢిల్లీ వచ్చిన తమిళనాడు సీఎం పళనిస్వామి ఆదివారం ఉదయం రైతులకు కలవనున్నారు. 40వేల కోట్ల కరువు పరిహార ప్యాకేజీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రండి కలసి పోరాడదాం ఢిల్లీ వేదికగా 40 రోజులుగా సాగుతున్న ఆందోళనను తాత్కాలికంగా వీడాలని రైతు నాయకుడు అయ్యాకన్నుకు డీఎంకే స్టాలిన్ సూచించారు. 25వ తేదీ చేపట్టనున్న రైతు బంద్ విజయవంతమే లక్ష్యంగా అఖిలపక్షం నాయకులతో శనివారం చెన్నైలో స్టాలిన్ సమావేశం అయ్యారు. తర్వాత స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ బంద్ విజయవంతంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చేలా చేద్దామని, ఢిల్లీలో ఆందోళన వీడి రాష్ట్రానికి రావాలని నిరసన తెలుపుతున్న రైతులకు పిలుపునిచ్చారు. మోదీ అపాయింట్మెంట్ కోరినా ఇవ్వటం లేదన్నారు. ఇక, బంద్‌కు మద్దతుగా పలు సంఘాలు, సంస్థలు కదలుతున్నాయి. నడిగర్ సంఘం బంద్‌కు మద్దతు ప్రకటించింది. చెన్నైలో విద్యార్థి సంఘాల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. -
ఒంటిపై రాతలతో నిరసన
► ఢిల్లీలో తమిళ రైతుల ఆందోళన ► 30వ రోజుగా డిమాండ్ల పరిష్కారానికి పట్టు టీనగర్: ఢిల్లీలో తమ డిమాండ్ల కోసం ఆందోళన జరుపుతున్న తమిళ రైతులు బుధవారం ఒంటిపై రాతలతో నిరసన చేపట్టారు. ప్రస్తుతం ఈ ఆందోళన 30వ రోజుకు చేరుకుంది. ఇందులో ఎలాగైనా తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆం దోళన కొనసాగిస్తామని పట్టుబట్టారు. ఇంతవరకు అనేక వినూత్న పద్ధతుల్లో ఆందోళన జరుపుతున్న రైతులు బుధవారం తమ ఒంటిపై ‘బ్యాంకు రుణాలు మాఫీ చేయాలి, కావేరి మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేయా లి’ అంటూ తమ ఒంటిపై డిమాండ్లను రాసి ఆందోళన జరిపారు. ఇందులో ఓపీఎస్ వర్గం, శశికళ వర్గానికి చెందిన పలువురు ఎంపీలు పాల్గొన్నారు. అంతేకాకుండా కేంద్ర మంత్రులు పాల్గొన్నట్లు సమాచారం అందింది. ఇలాఉండగా మంగళవారం బీజేపీ కేంద్ర మంత్రి పొన్రాధాకృష్ణన్ను కలిసి రైతు సంఘాల అధ్యక్షుడు అయ్యాకన్ను చర్చలు జరిపా రు. అందులో కొంత అనుకూలత ఏర్పడినందున బుధవారం మళ్లీ ఆయన కార్యాలయంలో రాతపూర్వకంగా తమ డిమాండ్లను తెలిపారు. ఈ సందర్భంగా పొన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతు సంఘాల అధ్యక్షుడు అయ్యాకన్ను సహా ఐదుగురు బు«ధవారం ఉదయం పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురైను కలిశారు. దీనిగురించి తంబిదురై మాట్లాడుతూ రాష్ట్ర రైతుల కోర్కెల గురించి ప్రధానికి పిటిషన్ అందజేశానని, దీన్ని స్వీకరించిన ప్రధాని రైతుల బ్యాంకు రుణాలు, కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు, కరువుసాయం అందజేత తదితర పరిష్కారాల గురించి అతిత్వరలో చర్యలు తీసుకుంటామని లేఖ ద్వారా తెలిపారన్నారు. ఈ లేఖను రైతుల పోరాటంలో పాల్గొననున్న సమయంలో వారికి చూపుతామన్నారు. ఇలాఉండగా పొన్‌రాధాకృష్ణన్ నేతృత్వంలో రాష్ట్ర పంచాయతీ అధ్యక్షుడు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పరిశుభ్రమైన మంచినీటి సరఫరా, 100 శాతం మరుగుదొడ్ల కల్పన, తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం పంచాయతీ అధ్యక్షులకు అవార్డులను అందజేసి ప్రోత్సహిస్తోంది. ఈ అవార్డులను అందుకునేందుకు కొందరు మాజీ పంచాయతీ అధ్యక్షుడు ఢిల్లీకి సోమవా రం చేరుకున్నారు. వీరంతా బుధవారం ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఇందులో కేంద్ర మంత్రి పొన్‌రాధాకృష్ణన్ పాల్గొన్నారు. 25 నుంచి రాస్తారోకో :రైతుల సంఘం ప్రకటన వ్యవసాయ రుణాలు రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25వ తేదీ నుంచి రాస్తారోకోలు జరపనున్నట్లు రైతుల సంఘం ప్రకటించింది. రాష్ట్ర రైతుల సంఘం కార్యవర్గ సమావేశం సేలంలో మంగళవారం జరిగింది. ఇందులో రాష్ట్ర అధ్యక్షుడు చిన్నస్వామి పాల్గొన్నారు. ఇందులో వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో ప్రదర్శనలు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. నారాయణస్వామి డిమాండ్ : రైతుల రుణాలను మాఫీ చేయాలని కోరుతూ పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు కుటుంబానికి రూ.20 వేల సాయం రైతు భధ్రతా పథకంలో సభ్యునిగా ఉన్న రైతు సహజ మరణం పొందితే ఆయన కుటుంబానికి ఆర్థికసాయాన్ని రూ.20 వేలుకు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. -
డిమాండ్లు పరిష్కరించాల్సిందే!
► ఢిల్లీలో తమిళ రైతులు ► ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభం ► 25వ రోజుగా ఆందోళన కొనసాగింపు టీనగర్: తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని ఢిల్లీలో తమిళ రైతులు స్పష్టం చేశారు. శుక్రవారం ఆందోళనలో భాగంగా ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు, జాతీయ బ్యాంకులలో రైతులు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయాలి, తదితర డిమాండ్లతో గత నెల 14 నుంచి ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నాటికి ఈ ఆందోళన 25వ రోజుకు చేరింది. జాతీయ దక్షిణాది నదుల అనుసంధాన రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాకన్ను నేతృత్వంలో రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో గత 14వ తేదీ నుంచి ఆందోళన జరుపుతున్నారు. ఇలావుండగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆందోళనకు మద్దతుగా ధర్నాలు జరుపుతున్నారు. 25వ రోజుగా శుక్రవారం ధర్నా చేపట్టారు. అయ్యాకన్ను, ప్రధాన కార్యదర్శి పళనివేలు, కార్యదర్శి మురుగన్ సహా 25 మంది శుక్రవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దీనిగురించి అయ్యాకన్ను మాట్లాడుతూ రైతుల డిమాండ్లపై రాష్ట్రపతిని కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, కేంద్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంకు అధికారులతో సంబంధంలేని ప్రకటనలు విడుదల చేస్టున్నట్లు తెలిపారు. 25 మంది ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించామని, తమ కోర్కెలు నెరవేరేంత వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ రక్తాన్ని పీల్చుతోందని, అందుచేత తమ అరచేతులను గాయపరచుకుని రక్తాన్ని చిందిస్తూ ఆందోళన జరుపుతున్నట్లు తెలిపారు. దీంతో తమ ప్రాణాలు కోల్పోయినా ఫర్యాలేదని, తమ కోర్కెలను నెరవేర్చాల్సిందేనని అన్నారు. 25 రోజులుగా పోరాటం సాగిస్తున్నామని, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణసామి తమను కలిసి మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు తెలిపారని, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిసామి తమను వచ్చి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తమను కలిసేందుకు నిరాకరిస్తున్నారని, దీంతో ఆందోళనను మరింత ఉధ్ధృతం చేశామన్నారు.