మూత్రసేవనంతో నిరసన
- 40వ రోజుకు చేరిన తమిళ రైతుల వినూత్న ఆందోళన
- జంతర్ మంతర్ ఖాళీ చేయాలంటూ ఢిల్లీ పోలీసుల హెచ్చరిక
- 25న విపక్షాల తమిళనాడు బంద్.. భారీ బహిరంగ సభ
సాక్షి, చెన్నై: రుణమాఫీ చేయాలంటూ ఢిల్లీలో 40 రోజులుగా తమిళ రైతులు చేస్తున్న ఆందోళన కొత్త బాట పట్టింది. శనివారం కొందరు రైతులు తమ మూత్రం తామే తాగి నిరసన తెలిపారు. దీంతో వీరిపై ఢిల్లీ పోలీసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడు అయ్యాకన్నుతో సహా పలువురిని స్టేషన్‌కు తీసుకెళ్లి హెచ్చరించి వదిలిపెట్టారు. మరోవైపు, ఈ ఆందోళనను తాత్కాలికంగా వీడాలని రైతు నాయకుడు అయ్యాకన్నుకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సూచించారు. అటు, రైతు బంద్‌కు నడిగర్ (దక్షిణ భారత నటీనటుల) సంఘం మద్దతు ప్రకటించింది. విద్యార్థి సంఘాలు బంద్ విజయవంతానికి పిలుపునిచ్చాయి.
కట్టలు తెగిన రైతు ఆగ్రహం
నెలకు పైగా ఢిల్లీలో వినూత్న రీతుల్లో నిరసన కొనసాగిస్తున్న తమిళనాడు రైతుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానంటూ తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ భరోసా ఇచ్చారు. దీంతో రెండ్రోజులపాటు తమ ఆందోళనకు విరామమిచ్చారు. శనివారం అకస్మాత్తుగా జంతర్‌మంతర్ వద్ద దీక్షకు దిగిన రైతులు మళ్లీ ఆందోళన బాట చేపట్టారు. రాధాకృష్ణన్ తమను మోసం చేశారంటూ ఆగ్రహించారు. తాము మోసపోతున్నామని, తమను పట్టించుకునేవాడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మూత్రాన్ని తామే తాగేందుకు ప్రయత్నించారు. అక్కడున్న ఢిల్లీ పోలీసులు వీరిని ఆపేటప్పటికే ఒకరిద్దరు మూత్రం సేవించారు. వీరిని అడ్డుకున్న పోలీసులు.. రైతు నాయకుడు అయ్యాకన్ను సహా పలువురిని స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా మందలించారు. జంతర్‌మంతర్‌ను ఖాళీ చేసి వెళ్లాలని హెచ్చరించినా రైతులు అక్కడే కూర్చున్నారు. కాగా, నీతి ఆయోగ్ సమావేశానికి ఢిల్లీ వచ్చిన తమిళనాడు సీఎం పళనిస్వామి ఆదివారం ఉదయం రైతులకు కలవనున్నారు. 40వేల కోట్ల కరువు పరిహార ప్యాకేజీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
రండి కలసి పోరాడదాం
ఢిల్లీ వేదికగా 40 రోజులుగా సాగుతున్న ఆందోళనను తాత్కాలికంగా వీడాలని రైతు నాయకుడు అయ్యాకన్నుకు డీఎంకే స్టాలిన్ సూచించారు. 25వ తేదీ చేపట్టనున్న రైతు బంద్ విజయవంతమే లక్ష్యంగా అఖిలపక్షం నాయకులతో శనివారం చెన్నైలో స్టాలిన్ సమావేశం అయ్యారు. తర్వాత స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ బంద్ విజయవంతంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చేలా చేద్దామని, ఢిల్లీలో ఆందోళన వీడి రాష్ట్రానికి రావాలని నిరసన తెలుపుతున్న రైతులకు పిలుపునిచ్చారు. మోదీ అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వటం లేదన్నారు. ఇక, బంద్‌కు మద్దతుగా పలు సంఘాలు, సంస్థలు కదలుతున్నాయి. నడిగర్ సంఘం బంద్‌కు మద్దతు ప్రకటించింది. చెన్నైలో విద్యార్థి సంఘాల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు.