డిమాండ్లు పరిష్కరించాల్సిందే!
► ఢిల్లీలో తమిళ రైతులు
► ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభం
► 25వ రోజుగా ఆందోళన కొనసాగింపు
టీనగర్: తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని ఢిల్లీలో తమిళ రైతులు స్పష్టం చేశారు. శుక్రవారం ఆందోళనలో భాగంగా ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు, జాతీయ బ్యాంకులలో రైతులు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయాలి, తదితర డిమాండ్లతో గత నెల 14 నుంచి ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నాటికి ఈ ఆందోళన 25వ రోజుకు చేరింది. జాతీయ దక్షిణాది నదుల అనుసంధాన రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాకన్ను నేతృత్వంలో రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో గత 14వ తేదీ నుంచి ఆందోళన జరుపుతున్నారు.
ఇలావుండగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆందోళనకు మద్దతుగా ధర్నాలు జరుపుతున్నారు. 25వ రోజుగా శుక్రవారం ధర్నా చేపట్టారు. అయ్యాకన్ను, ప్రధాన కార్యదర్శి పళనివేలు, కార్యదర్శి మురుగన్ సహా 25 మంది శుక్రవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దీనిగురించి అయ్యాకన్ను మాట్లాడుతూ రైతుల డిమాండ్లపై రాష్ట్రపతిని కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, కేంద్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంకు అధికారులతో సంబంధంలేని ప్రకటనలు విడుదల చేస్టున్నట్లు తెలిపారు.
25 మంది ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించామని, తమ కోర్కెలు నెరవేరేంత వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ రక్తాన్ని పీల్చుతోందని, అందుచేత తమ అరచేతులను గాయపరచుకుని రక్తాన్ని చిందిస్తూ ఆందోళన జరుపుతున్నట్లు తెలిపారు. దీంతో తమ ప్రాణాలు కోల్పోయినా ఫర్యాలేదని, తమ కోర్కెలను నెరవేర్చాల్సిందేనని అన్నారు.
25 రోజులుగా పోరాటం సాగిస్తున్నామని, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణసామి తమను కలిసి మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు తెలిపారని, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిసామి తమను వచ్చి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తమను కలిసేందుకు నిరాకరిస్తున్నారని, దీంతో ఆందోళనను మరింత ఉధ్ధృతం చేశామన్నారు.