ఆందోళన విరమించిన తమిళ రైతులు
న్యూఢిల్లీ: రుణమాఫీ చేయాలంటూ ఢిల్లీలో 41 రోజులుగా ఆందోళన చేస్తున్న తమిళ రైతులు తమ పోరాటానికి విరామం ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఇచ్చిన హామీతో ఆందోళన విమరమించారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే మే 25 నుంచి మరోసారి ఆందోళనకు దిగుతామని రైతు నాయకుడు అయ్యాకన్ను హెచ్చరించారు. తమకు రైలు టికెట్లు ఇస్తే ఈ రోజే తమిళనాడుకు బయలుదేరతామని చెప్పారు.
నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన పళనిస్వామి ఆదివారం ఉదయం పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్, పార్టీ ఎంపీ తంబిదురైతో కలిసి జంతర్‌మంతర్ వద్దకు అడుగు పెట్టారు. ఆయన్ను రైతులు సాదరంగా ఆహ్వానించి తమ గోడును ఏకరువు పెడుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. అక్కడే రోడ్డుపై కూర్చుని సీఎం రైతు నాయకుడు అయ్యాకన్నుతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటానని, ఆందోళన వీడాలని కోరారు. రైతు సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యల్ని వేగవంతం చేసిందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అందరికీ న్యాయం జరుగుతుందని, ఆందోళన వీడి రాష్ట్రానికి బయలుదేరాలని కోరారు.
సీఎం విజ్ఞప్తిని అయ్యాకన్ను తోసిపుచ్చారు. ప్రధాని మోదీతో సీఎం చర్చించిన అనంతరం వెలువడే ప్రకటన మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రధానితో భేటీకి తమను తీసుకెళ్తామన్న సూచన కూడా చేశారని, ప్రధాని ఇచ్చే హామీ మేరకు పోరాటం కొనసాగించాలా వద్దా అన్నది నిర్ణయిస్తామన్నారు. అక్కడినుంచి సీఎం బయలుదేరి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో రైతుల పోరాటాల ప్రస్తావన తీసుకొస్తూ రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా నిధుల కేటాయింపులు, నీట్ మినహాయింపుపై సీఎం ప్రసంగం సాగింది. రైతులు ఇచ్చిన వినతిపత్రాన్ని ప్రధానికి అందజేశారు. ఆందోళన విరమిస్తున్నట్టు ఆదివారం సాయంత్రం రైతులు ప్రకటించారు.