శశిపెరుమాళ్ బిడ్డల అరెస్ట్
టాస్మాక్ దుకాణాలను ఎత్తివేయాలని ఆందోళన
15 మంది ఆందోళనకారుల అరెస్ట్
చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్యంపై పోరులో గాంధేయవాది శశిపెరుమాళ్ ప్రాణాలు కోల్పోగా ఆయన వారసులు పోరాటబాట పట్టారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, కుమార్తె సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోరాట యోధుడు, ప్రముఖ గాంధేయవాది శశిపెరుమాళ్ కన్యాకుమారి జిల్లా ఉన్నామలైకడైలోని మద్యం దుకాణాలను మూసివేయాలని కోరుతూ గత నెల 31వ తేదీన సమీపంలోని సెల్‌టవర్ ఎక్కాడు. ఆందోళన సాగిస్తున్న తరుణంలో గుండెపోటుకు గురై టవర్‌పైనే మృతి చెందాడు. శశిపెరుమాళ్ మృతదేహానికి ఆచారిపళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 1వ తేదీన పోస్ట్‌మార్టం పూర్తిచే యగా రాష్ట్రంలో మద్య నిషేధం విధిస్తున్నట్లు ప్రకటిస్తేగానే శశిపెరుమాళ్ శవాన్ని స్వాధీనం చేసుకునేది లేదని ఆయన బంధువులు ప్రతిజ్ఞ చేయడంతోపాటూ ఆందోళనకు దిగారు.
ఇదిలా ఉండగా, మద్యనిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ శశిపెరుమాళ్ కుటుంబ సభ్యులు సేలం గాంధీ విగ్రహం ముందు ఆదివారం నిరాహారదీక్ష ప్రారంభించారు. శశిపెరుమాళ్ అకాల మరణానికి ప్రభుత్వ వైఖరే కారణమంటూ ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ఈనెల 4వ తేదీ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో శశిపెరుమాళ్ స్వగ్రామానికి చెందిన ప్రజలు, సేలంలోని అన్ని పార్టీల కార్యకర్తలు పాత బస్‌స్టేషన్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు నిరవధిక నిరాహారదీక్ష చేపట్టేందుకు పోలీసులను అనుమతి కోరారు. నిషేదాజ్ఞలు అమలులో ఉన్నందున దీక్షలకు అనుమతి నిరాకరించారు.
నిషేదాజ్ఞలు మీరి దీక్షలు ప్రారంభిస్తారనే అనుమానంతో ఉదయం 7 గంటలకే గాంధీ విగ్రహం వద్ద పోలీసులు మోహరించారు. ఉదయం 8.30 గంటలకు శశిపెరుమాళ్ చిత్రపటంతో ఆందోళనకారులు ఊరేగింపుగా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. అలాగే మరోవైపు నుంచి ఉదయం 10.30 గంటలకు ఎండీఎంకే తదితర పార్టీలు, ప్రజా సంఘాలు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, శశిపెరుమాళ్ చిత్రపటంపై పూలువేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మద్యనిషేధం కోరుతూ నినాదాలు సాగించారు. పోలీసులు వారిని అడ్డుకుంటున్న తరుణంలో శశిపెరుమాళ్ భార్య మగిళం, కుమారుడు నవీందన్, పదేళ్ల వయస్సుగల కుమార్తె కవియరసి అక్కడికి చేరుకుని నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించారు. నిషేదాజ్ఞలు మీరి నిరాహారదీక్షలు చేపట్టారంటూ శశిపెరుమాళ్ కుమారుడు, కుమార్తె సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మద్యనిషేధం కోసం నిరాహారదీక్ష
Published Mon, Aug 3 2015 2:50 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement