ష్..గప్‌చుప్!
ఇష్టం వచ్చినట్టు ఇతర పార్టీల నాయకులను ఉద్దేశించి విమర్శలు, ఆరోపణలు గుప్పించే కమలనాథుల నోటికి తాళం పడింది. గప్‌చుప్... ఇక విమర్శలు వద్దు అని పార్టీ వర్గాలకు తమిళి సై సౌందరరాజన్ హుకుం జారీ చేశారు. ఇక మీదట ఏవైనా విమర్శలు, ఆరోపణలు చేయాలన్నా తాను చూసుకుంటానని ఆమె స్పష్టం చేశారు.
సాక్షి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేస్తున్న ఎండీఎంకే నేత వైగో తీరుపై రాష్ట్రానికి చెందిన బీజేపీ జాతీయ నాయకులు హెచ్ రాజా, సుబ్రమణ్య స్వామి విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కమలనాథులు చేస్తున్న హెచ్చరికలు, బెదిరిం పుల వ్యవహారం రాష్ట్రంలో చర్చకు దారి తీసింది. రాష్ట్ర బీజేపీకి మళ్లీ పాత రోజులు వచ్చే అవకాశాలు కనిపిన్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు బీజేపీ మీద దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. ఇది కాస్త అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ నేతృత్వంలో కూటమి ఏర్పాటు మీద ప్రభావం చూపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్‌కు ఆ ఇద్దరు నేతల తీరు శిరోభారంగా మారినట్టుంది. ఇక అధిష్టానం ఆదేశాలతో రాష్ట్ర పార్టీలో తన మార్కు రాజకీయ చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రానికి చెందిన జాతీయ నాయకులు, సీనియర్ కమలనాథుల ఇష్టారాజ్యానికి, వారి నోళ్లకు తాళం వేసే రీతిలో, ఇక నేను చూసుకుంటా...గప్ చుప్ అంటూ తమిళి సై సౌందరరాజన్ స్పందించడం గమనార్హం.
రైల్వేస్టేషన్‌లో స్వచ్ఛ భారత్: చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని ఓ ప్రైవేటు విద్యా సంస్థ చేపట్టింది. ఇందులో తమిళి సై పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ విమర్శలు, ఆరోపణలు గుప్పించే పార్టీ వర్గాల నోళ్లకు తాళం వేస్తూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కూటమిలో ఉంటూ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడం ఎంత వరకు భావ్యం అని ఎండీఎంకే, పీఎంకే నేతలను ఆమె ప్రశ్నించారు. ఇక మీదట అలాంటి విమర్శలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇక మీదట పార్టీకి చెందిన నాయకులెవ్వరూ కూటమి పార్టీల మీద విమర్శలు గుప్పించేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఏదేని విమర్శలు వాళ్లు చేసినా, ఆరోపణలు సంధించినా, తాను చూసుకుంటానని, తాను స్పందిస్తానని, మరెవ్వరూ స్పందించేందుకు వీల్లేదని హెచ్చరించారు. ఎండీఎంకే నేత వైగోపై తమ పార్టీ నేత రాజా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఓ ప్రశ్నకు స్పష్టం చేశారు.
రాజా వ్యాఖ్యలు, బెదిరింపుల వ్యవహారాన్ని అధిష్టానం పరిశీలిస్తోందన్నారు. అన్భుమణి రాందాసు ఒక ఎంపీగా పార్లమెంట్‌లో తన గళాన్ని వినిపిస్తున్నారని, సభలో జరిగే వ్యవహారాలకు , కూటమికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తమిళ జాలర్లను ఉరి నుంచి రక్షించడంలో కేంద్రంలోని తమ ప్రభుత్వం వ్యవహరించిన విధానం అందరికీ తెలిసిందేనన్నారు. ఇకనైనా కూటమిలోని ఎండీఎంకే, పీఎంకే నాయకులు మోదీని విమర్శించడం మానుకుని, తమిళ ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. పార్టీలో సీనియర్ల నోళ్లకు తాళం వేసే రీతిలో తమిళి సై స్పందించడంతో ఇక అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీలో ఆమె వాయిస్ పెరిగినట్టేనని కమలనాథులు పేర్కొంటుండడం గమనార్హం.