
టీ.నగర్ (చెన్నై) : తమిళనాడు రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు గురువారం పదవీ విరమణ చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. 2016 జూన్ 1న జయలలిత హయాంలో సీఎం కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన నియమితులయ్యారు. అదే నెల 8న రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టారు. జయలలిత మృతి అనంతరం గత ఏడాది డిసెంబరు 21న సచివాలయంలోని రామ్మోహన్‌రావు గదిలో, అన్నానగర్‌లోని ఆయన నివాసంలో ఐటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ క్రమంలో రామ్మోహన్‌రావును ఆ పదవి నుంచి తొలగించారు. అనంతరం గత మార్చి 31న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా ఆయన నియమితులయ్యారు. ప్రస్తుతం 60 ఏళ్లు పూర్తి కావడంతో గురువారం ఆయన పదవీ విరమణ చేశారు. 1957 సెప్టెంబరులో జన్మించిన రామ్మోహన్‌రావు 1985లో ఐఏఎస్ అధికారిగా పదవిలో చేరారు.