సాక్షి, చెన్నై: ప్రేమ, కులాంతర వివాహాలు చేసుకునే వారికి భరోసా ఇస్తూ తమిళనాడులోని మధురైలో ప్రత్యేక విభాగం ఆవిర్భవించింది. మధురై కోర్టు ఆదేశాల మేరకు క్రైం ప్రివెన్షల్ సెల్(సీపీసీ)గా ఈ విభాగం ఏర్పాటు అయింది. మూడు విభాగాల సమన్వయంతో రూపుదిద్దుకున్న ఈ విభాగానికి ప్రత్యేక అధికారిని నియమించారు. అలాగే, ప్రేమికుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రకటించారు.
ఇటీవల తమిళనాడులో కులాంతర ప్రేమ వివాహాలు పరువు హత్యలకు దారి తీస్తున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో అధికారికంగా వంద మంది వరకు పరువు హత్యలకు గురైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అనధికారికంగా ఇలాంటి ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయని అంచనా. ప్రధానంగా దక్షిణ, పశ్చిమ తమిళనాడులో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. పరువు కోసం తమ కుమార్తెలను చంపడమో, లేకపోతే తాము చావడమో చేస్తున్నారు. గత ఏడాది తిరుప్పూర్‌లో నడీ రోడ్డు మీద శంకర్ అనే యువకుడిని అతి కిరాతకంగా హతమార్చిన వీడియో బయటకు రావడంతో మద్రాస్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే దంపతులకు తాము అండగా ఉంటామన్నట్టుగా హైకోర్టు భరోసా ఇచ్చింది. అయినా, పరువుహత్యలు ఆగకపోవడంతో కోర్టు కన్నెర్ర చేసింది. పరువు హత్యల కట్టడి లక్ష్యంగా ప్రత్యేక చట్టం తీసుకు రావడంతో పాటుగా పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, ఇందుకు గాను ప్రత్యేక నిధిని, ప్రత్యేక విభాగం ఏర్పాటుకు కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నెలాఖరులో కోర్టు తీర్పు వెలువడ్డ తర్వాత కూడా ఆదివారం సేలం ఆత్తూరులో తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందన్న వేదనతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కోర్టు తీర్పులో తొలి అడుగుగా దక్షిణ తమిళనాడుకు కేంద్రంగా ఉన్న మధురైలో సీపీసీ ఆవిర్భవించడం విశేషం.
ప్రత్యేక వింగ్‌తో భరోసా : మదురై జిల్లా పోలీసు యంత్రాంగం, నగర పోలీసు కమిషనరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రేమికులకు భరోసా ఇస్తూ ప్రత్యేక వింగ్, క్రైం ప్రివెన్షన్ సెల్ (సీపీసీ)ను సోమవారం ఏర్పాటు చేశారు. పోలీసు, సాంఘిక సంక్షేమ శాఖ, ఆది ద్రావిడ సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలో ఈవిభాగం పనిచేస్తుంది. అళగర్ ఆలయ మెయిన్ రోడ్డులోని కమిషనరేట్ ఆవరణలో ఈ విభాగం కోసం ప్రత్యేక వసతులతో విశాలమైన గదిని కేటాయించారు. ఇక్కడికి వచ్చే ఫిర్యాదుల మేరకు తక్షణం ఈ విభాగం స్పందిస్తుంది. ప్రేమికులకు భద్రత కల్పించడం, తల్లిదండ్రుల్ని పిలిపించి చర్చలు జరపడంతో పాటుగా కౌన్సిలింగ్ తదితర వ్యవహారాలు, కేసుల నమోదు మీద ఈ విభాగం ప్రాథమికంగా దృష్టి పెట్టనుంది. ఈ విభాగం కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబరును ప్రకటించారు. ఆ మేరకు 0452–2346302 నంబరును సంప్రదించాలని సూచించారు. దశల వారీగా ఈ విభాగాల్ని ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటు కాబోతున్నాయి.
లవర్స్ కోసం స్పెషల్ టోల్ ఫ్రీ నంబర్
Published Mon, Aug 7 2017 7:50 PM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement
Advertisement