బెంగళూరు, న్యూస్‌లైన్ : ఆస్తి పన్ను వసూలు చేయడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) కార్పొరేటర్(బీజేపీ) రమేష్ మండిపడ్డారు. మంగళవారం నిర్వహించిన పాలికె సమావేశంలో అధికారుల వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని రెండు వేల కట్టడాల నుంచి పాలికెకి రూ. 1500 కోట్ల మేర ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉందని గుర్తు చేశారు. బీబీఎంపీలోని ఎనిమిది ఉప విభాగాలు ఉన్నాయని, వీటి పరిధిలో 30 ప్రఖ్యాతి గాంచిన కట్టడాల నుంచి రూ. ఒక కోటి(ఒక్కొక్క కట్టడం), మరో రూ. 50 లక్షలు(ఒక్కొ కట్టడం) చొప్పున 13 వేల కట్టడాల నుంచి పన్ను వసూలు చేయాల్సి ఉందని వివరించారు. అయితే పాలికె రెవెన్యూ అధికారులు మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తూ పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం కనబరుస్తున్నారని ఆరోపించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి
బీబీఎంపీ పరిధిలో ఆస్తి పన్ను వసూలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని పాలికె పాలన విభాగం నేత అశ్వత్థ నారాయణగౌడ సూచించారు. పాలికె పరిధిలోని కొన్ని వేల మంది ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకుండా చోద్యం చూస్తున్నారని తెలిపారు. రుణాల వసూళ్లలో బ్యాంకుల వ్యవహరిస్తున్న తరహాలోనే ఆస్తి పన్ను వసూలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నగరంలోని మార్కెట్‌లలో వ్యాపారాలు చేసుకుంటున్న వారికి అనుమతులు రెన్యూవల్ చేయాలని సూచించారు.
పాలికె నిధులు లాక్కొంటున్నారు
బీబీఎంపీలోకి విలీనమైన 110 గ్రామాల అభివృద్ధికి కేటాయించిన నిదులను స్థానిక ఎమ్మెల్యేలు లాగేసుకుంటున్నారని పాలికె విపక్ష నేత(జేడీఎస్) ఆర్.ప్రకాష్ ఆరోపంచారు. బీబీఎంపీలోకి విలీనమైన తర్వాత 110 గ్రామాల అభివృద్ధికి నాలుగేళ్లలో రూ. 40 కోట్ల నిధులు విడుదలయ్యాయని గుర్తు చేశారు. ఈ నిధులను తమ కోటా నిధులుగా ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారని తెలిపారు. సీనియర్ కార్పొరేటర్ పద్మనాభరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల పట్ల గౌరవముందని, అయితే నిధులు ఖర్చు చేసే విషయంలో కార్పొరేటర్ల నిర్ణయమే అంతిమం కావాలని అన్నారు. సమావేశంలో నగర ఇన్‌చార్జి మంత్రి రామలింగారెడ్డి, మేయర్ కట్టె సత్యనారాయణ, పాలికె కమిషనర్ లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
పన్ను వసూలులో ఉదాసీనత
Published Wed, Jan 1 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
Advertisement
Advertisement