గన్ రైతుది....ట్రిగ్గర్ టీడీపీది! | tdp leaders gaining benefits over rain gun scheme | Sakshi
Sakshi News home page

గన్ రైతుది....ట్రిగ్గర్ టీడీపీది!

Published Mon, Sep 12 2016 12:00 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

గన్ రైతుది....ట్రిగ్గర్ టీడీపీది! - Sakshi

గన్ రైతుది....ట్రిగ్గర్ టీడీపీది!

► కర్షకుల ‘కన్నీటితడి’
 టీడీపీ నాయకుల చేతుల్లో రెయిన్‌గన్లు
► వారు చెప్పిన వారికే రక్షక తడులు
► సీఎం పర్యటన తరువాత పెరిగిన ‘పచ్చ’పాతం
 
రెయిన్ గన్..వర్షాభావ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉపయోగిస్తున్న పరికరం. ఎండుతున్న పైర్లకు ప్రాణం పోయాల్సింది పోయి.. అధికార పార్టీ నాయకుల చేతుల్లో చిక్కి విలవిల్లాడుతోంది. రాజకీయమే లక్ష్యంగా ఈ గన్ పేలుతోంది. పార్టీలకు అతీతంగా నిర్వహించాల్సిన రక్షకతడి కార్యక్రమం పక్కదోవ పట్టి కర్షకుల ‘కన్నీటితడి’గా మారింది. ఆదోని వ్యవసాయ డివిజన్ ఇందుకు కేంద్రమైంది.
 
కర్నూలు : వర్షాభావం వల్ల ఎండుతున్న పంటలకు రక్షక నీటి తడులు ఇచ్చే కార్యక్రమం ఆదోని వ్యవసాయ డివిజన్‌లో అధికార తెలుగుదేశం నాయకుల చేతుల్లోకి వెళ్లింది. ఈ కార్యక్రమం కింద మంజూరు చేసిన రెయిన్‌గన్లు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సెక్రటరీలు, వీఆర్‌ఓల ఆధీనంలో ఉండాలి. అయితే టీడీపీ నాయకుల చేతుల్లో ఉండిపోయాయి. అధికార పార్టీ నాయకులు సూచిస్తున్న రైతుల పంటలకు అధికారులు నీటితడులు ఇస్తున్నారు. ‘‘మా నియోజకవర్గానికి 400 రెయిన్‌గన్‌లు, 400 స్ప్రింక్లర్లు, 100 ఆయిల్ ఇంజన్‌లు సిద్ధంగా ఉంచండి. ఇవన్నీ మా ఆధీనంలోనే ఉంచాలి’’అని టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల నుంచి జిల్లా అధికారులు ఫోన్లు వస్తున్నాయంటే వాస్తవం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

హడావుడి సరే..అమలేది?.. జిల్లాలో కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్‌లలో ఆగస్టు నెలలో వర్షాలు లేవు. కర్నూలు డివిజన్‌లో కొంతవరకు కొన్ని మండలాల్లో వర్షాలు కురిసినా ఆదోని డివిజన్‌లో చినుకు జాడ లేదు. సెప్టెంబర్ నెలలో పది రోజులు గడచినా వాన ఆచూకీ లేకుండా పోయింది. ఇప్పటికే వేరుశనగ పూర్తి దెబ్బతినగా.. మిగిలిన పంటలను కాపాడుకోవడానికి రైతులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 20 రోజులుగా రెయిన్‌గన్‌లంటూ జిల్లా యంత్రాంగం హడావుడి చేస్తున్నా.. నిజంగా వర్షాభావం వల్ల దెబ్బతిన్న పంటలను కాపాడటంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.
 
ఏం జరిగిందంటే.. ఎండు పంటటన్నింటికీ నీటితడులు ఇచ్చే విధంగా ముందుగా ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందించారు. కొన్ని పంటలకు నీటి తడులు కూడా ఇచ్చారు. అయితే ఆలూరు మండలం అరికెర గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చి వెళ్లిన తర్వాత నీటి తడులు ఇవ్వడంలో మార్పు వచ్చింది. రెయిన్‌గన్‌లు, స్ప్రింక్లర్లు, ఆయిల్ ఇంజన్‌లు టీడీపీ నాయకుల ఆధీనంలోకి వెళ్లాయి. గ్రామాలవారీగా ఏయే రైతుల పంటలకు నీటితడులు ఇవ్వాలో అధికార పార్టీ నాయకులు సూచిస్తున్నారు. ఆలూరు వ్యవసాయ సబ్ డివిజన్‌లో ఈ తంతు ఎక్కువగా సాగుతోంది. దేశం కార్యకర్తలకు చెందిన పంటలకు మాత్రమే నీటి తడులు ఇవ్వడంపై స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం అధికారులపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. కరువులో ‘పచ్చ’పాతం చూపవద్దని గట్టిగా హెచ్చరించారు. 
 
అనుకూరులకే.. ‘‘ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి చెందిన రైతుల భూములకే నీటితడులు ఇస్తున్నారు.. ఇది నిజమే కదా’’ అంటూ ఆదోని, పత్తికొండ, ఆదోని నియోజకవర్గాల్లో పంటలకు రక్షక తడులు ఇచ్చే విధులు నిర్వహిస్తున్న అధికారులు పేర్కొంటున్నారు. నెల రోజులుగా వర్షాలు లేక పంటలు ఎండుతున్నాయి... రెయిన్‌గన్‌ల ద్వారా నీటి తడులు ఇవ్వండని రైతులు కోరుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. టీడీపీ నాయకులు సూచిస్తున్న కార్యకర్తల పంటలను ఆగమేఘాల మీద తడిపేందుకు సిద్ధం అవుతున్నారు. తెలుగు దేశం కార్యకర్తల పంటలను కాపాడేందుకే రెయిన్‌గన్‌లు తీసుకొచ్చారా అని కొందరు రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 
 
 పంట ఎండుతున్నా పట్టించుకోవడం లేదు:  
 నాది మూడెకరాల చేను. మెట్ట భూమి. ఈ ఏడు ఉల్లి నాటిన. చేను పక్కనే పెద్ద వంక ఉంది. పంట ఎండుతోంది.. రెయిన్‌గన్లను ఇవ్వాలని అధికారులను అడిగితే.. కొంతమంది టీడీపీ నాయకులు వాటిని తీసుకెళ్లినారని, వారిని అడిగి తీసుకోవాలని చెబుతున్నారు. వారి దగ్గరికి మేము వెళ్లి అడిగితే బాగుండదు సార్.. అని పదేపదే ప్రాధేయపడుతున్నా పట్టించుకోవడం లేదు.  - సూరి, పెద్దహోతూరు రైతు
 
మా దృష్టికి రాలేదు
రెయిన్‌గన్లు గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ఉన్నాయి. టీడీపీ నాయకులు చేతుల్లో ఉన్నట్లు మా దృష్టికి రాలేదు. ఎక్కడా ఇలా జరుగుతున్నట్లయితే ఫిర్యాదు చేయవచ్చు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. - జేడీఏ ఉమామహేశ్వరమ్మ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement