నాగుపామును చంపి హుండీ చోరీ
తిరువణ్ణామలై: కణ్ణమంగళం సమీపంలోని అమ్మన్ ఆలయంలో నాగుపామును చంపి హుండీని చోరీ చేసిన సంఘటన పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. తిరువణ్ణామలై జిల్లా కణ్ణమంగళం సమీపంలోని సందవాసల్ పుష్పగిరి చెరువు వద్ద పూవమ్మన్ ఆలయం ఉంది. ఈ ఆలయం ఎదుట అతి పెద్ద పుట్ట కూడా ఉంది. పుట్టలో నాగుపాము అమ్మన్ ఆలయంలోకి ప్రవేశించి తిరిగి పుట్టలోకి వస్తుండగా భక్తులు చూశారు. ఈ విషయం దావానంలా వ్యాపించడంతో భక్తులు పుట్టలో పాలు, గుడ్లు పెట్టి పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఈ ఆలయంలో దురైస్వామి పిల్లై అర్చకుడిగా ఉన్నారు. ఇతను భోజన సమయం మినహా మిగిలిన సమయాల్లో ఆలయంలోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యం లో శుక్రవారం రాత్రి 8 గంటలకు ఇంటికి భోజనానికి వెళ్లి వచ్చాడు. ఆ సమయంలో ఆలయ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఆలయ హుండీ కనిపించలేదు. మూలస్థానం వద్ద నాగుపామును కొట్టి చంపి ఉండడాన్ని గమనించాడు. వెంటనే విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో వారు భారీగా ఆలయం వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సందవాసల్ పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని విచారించగా అక్కడి సమీపంలోని పొలంలో హుండీ కనిపించింది. అందులో నగదును దుండగులు చోరీ చేసినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు.