అన్నవరప్పాడు ఆలయంలో చోరీ
అన్నవరప్పాడు ఆలయంలో చోరీ
Published Mon, Sep 5 2016 1:44 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
అన్నవరప్పాడు (పెరవలి) : జాతీయ రహదారి పక్కన పెరవలి మండలం అన్నవరప్పాడు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగింది. గర్భాలయం ఎదుట ఉన్న ప్రధాన హుండీని దొంగ అపహరించాడు. రెండు నెలలుగా హుండీ ఆదాయం లెక్కించకపోవడంతో సుమారు రూ.50 వేలకు పైగా సొమ్ము ఉంటుందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయ మేనేజర్ బ్రహ్మారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి 8.30 గంటలకు ఆలయ ప్రధాన తలుపులు మూసివేశారు. నైట్ వాచ్‌మెన్ కోటిపల్లి ఆంజనేయులు విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి 1–2 గంటల మధ్య చోరీ జరిగినట్టు ఆలయంలోని సీసీ కెమెరాలో నమోదైంది.
అసలేం జరిగిందంటే..
రాత్రి 1 గంటకు ప్రధాన ఆలయం పక్కన ఉన్న అలివేలు మంగతాయారు గుడి తలుపులు పగులకొట్టేందుకు దొం గ ప్రయత్నించాడు. అవి తెరుచుకోకపోవడంతో 1.15 నిమిషాలకు గర్భాలయం ఎదుట ఉన్న ప్రధాన హుండీకి ఉన్న ఇనుమ గొలుసులను తెంపి హుండీతో ఉడాయించాడు. ఈ సమయంలో ఆలయంలోని విద్యుత్ దీపాలను దొంగ ఆర్పివేశాడు. దీనిని గమనించిన నైట్ వాచ్‌మెన్ దీపాలు వేశాడు. మరలా దొంగ దీపాలను ఆర్పివేశాడు. దీంతో అనుమానం వచ్చిన నైట్ వాచ్‌మెన్ ఆలయం వెనుక నివాసం ఉంటున్న సిబ్బందిని తీసుకురావడానికి వెళ్లాడు. వారు వచ్చి ఆలయ ప్రాంగణంలో పరిశీలించినా దొంగను మాత్రం గమనించలేదు. తర్వాత కొద్దిసేపటికి దొంగ హుండీతో సమీపంలోని పొలంలోకి వెళ్లాడు. నైట్‌వాచ్‌మెన్, ఆలయ సిబ్బంది గర్భాలయం వద్ద చూడగా హుండీ చోరీకి గురైనట్టు గుర్తించారు. పొలంలో హుండీ పగులగొట్టిన దొంగ సొమ్ముతో ఉడాయించాడు. ఆ సమయంలో ఆలయం వద్ద మోటార్ బైక్ శబ్ధం రావడంతో ఆలయ సిబ్బంది, స్థానికులు పొలం వైపుగా వెళ్లారు. దొంగ వేగంగా మోటార్ బైక్‌పై తప్పించుకుని పోయాడు. స్థానికులు ఖండవల్లి గ్రామం వరకూ దొంగను వెంబడించినా ఫలితం లేదు. ఖండవల్లి నుంచి తూర్పువిప్పర్రు రోడ్డులోకి దొంగ వేగంగా వెళ్లిపోయాడు.
ఇది మూడోసారి
అన్నవరప్పాడు గ్రామంలో ఆలయాల్లోని హుండీలు అపహరణకు గురికావడం ఇది మూడోసారి. గతేడాది జూలైలో ఇదే తరహాలో ఈ ఆలయంలోనే చోరీ జరిగింది. గత నెలలో గ్రామంలోని శక్తమ్మవారి ఆలయంలో హుండీని అపహరించారు. మరలా ఇప్పుడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీ చోరీకి గురైంది.
Advertisement
Advertisement