annavarappadu
-
దైవ సన్నిధికి వెళుతూ అనంత లోకాలకు..
అన్నవరప్పాడు (పెరవలి): అతివేగం పన్నెండేళ్ల బాలుడి ప్రాణం తీసింది. దైవ సన్నిధికి వెళుతుండగా కారు రూపంలో మృత్యువు కబళించింది. జాతీయ రహదారిపై పెరవలి మండలం అన్నవరప్పాడు వెంకటేశ్వస్వామి ఆలయం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు దుర్మరణం పాలయ్యాడు. హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. అన్నవరప్పాడు గ్రామానికి చెందిన పులపర్తి అచ్చన్న, భార్య దుర్గ, కుమారుడు మణికంఠ సాయి కౌశిక్ (11), బంధువులు, వారి పిల్లలతో కలిసి శనివారం ఉదయం 8 గంటల సమయంలో గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి బయలుదేరారు. వీరంతా ఆలయం దగ్గరకు చేరుకున్నారు. ఇదే సమయంలో కుమారుడు చేయి పట్టుకుని రోడ్డు దాటుదామని తల్లి దుర్గ అనుకుంటుండగా వీరితో పాటు వచ్చిన ముగ్గురు బంధువుల పిల్లలు రోడ్డు మార్జిన్లోకి చేరారు. ఇది చూసిన మ ణికంఠ తల్లి చేయి విడిపించుకుని రోడ్డుదాటేద్దామంటూ ఒక్కసారిగా పరుగు పెట్టాడు. అదే సమయంలో జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు మణికంఠను ఢీకొట్టింది. దీంతో గాలిలోకి ఎగిరి కారు ముందు భాగంలో అద్దాలపై పడి అక్కడి నుంచి సుమారు 10 మీటర్ల దూరంలో రోడ్డుపై పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రా ణాలు విడిచాడు. తల్లిదండ్రులు, బంధువుల కళ్లముందే ప్రమాదం జరగడంతో వారంతా భీతిల్లిపోయారు. హైవే పెట్రోలింగ్ పోలీసుల సాయంతో బాలుడిని తణుకు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తమ ఒక్కగానొక్క బిడ్డను ఎలాగైనా బతికించండంటూ తల్లిదండ్రుల రోదనలు కంటతడి పెట్టించాయి. పెరవలి ఏఎస్ఐ ద్వారంపూడి త్రిమూర్తిరెడ్డి ఘటనాస్థలికి చేరుకుని కారు డ్రైవర్ కొండపల్లి దుర్గారావుని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అన్నవరప్పాడు.. కన్నీటి సంద్రం మణికంఠ మృతి విషయం తెలిసిన గ్రామం మూగబోయింది. బంధువులు, గ్రామస్తులు మృతుని ఇంటికి చేరుకున్నారు. కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నారు. వికలాంగుడైన తాత కాశీరావు మనుమడి మృతదేహాం చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘నాకు దిక్కేమిటిరా దేవుడు, నన్ను చూసేవారు ఎవరు, నాకు సరుకులు తెచ్చేవాడు ఎవరూ అంటూ’ బోరుమన్నాడు. ‘తమ్ముడూ, తమ్ముడూ’ అంటూ మణికంఠ అక్క రోదనలు కంటతడిపెట్టించాయి. -
అన్నవరప్పాడు ఆలయంలో చోరీ
అన్నవరప్పాడు (పెరవలి) : జాతీయ రహదారి పక్కన పెరవలి మండలం అన్నవరప్పాడు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగింది. గర్భాలయం ఎదుట ఉన్న ప్రధాన హుండీని దొంగ అపహరించాడు. రెండు నెలలుగా హుండీ ఆదాయం లెక్కించకపోవడంతో సుమారు రూ.50 వేలకు పైగా సొమ్ము ఉంటుందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయ మేనేజర్ బ్రహ్మారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి 8.30 గంటలకు ఆలయ ప్రధాన తలుపులు మూసివేశారు. నైట్ వాచ్మెన్ కోటిపల్లి ఆంజనేయులు విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి 1–2 గంటల మధ్య చోరీ జరిగినట్టు ఆలయంలోని సీసీ కెమెరాలో నమోదైంది. అసలేం జరిగిందంటే.. రాత్రి 1 గంటకు ప్రధాన ఆలయం పక్కన ఉన్న అలివేలు మంగతాయారు గుడి తలుపులు పగులకొట్టేందుకు దొం గ ప్రయత్నించాడు. అవి తెరుచుకోకపోవడంతో 1.15 నిమిషాలకు గర్భాలయం ఎదుట ఉన్న ప్రధాన హుండీకి ఉన్న ఇనుమ గొలుసులను తెంపి హుండీతో ఉడాయించాడు. ఈ సమయంలో ఆలయంలోని విద్యుత్ దీపాలను దొంగ ఆర్పివేశాడు. దీనిని గమనించిన నైట్ వాచ్మెన్ దీపాలు వేశాడు. మరలా దొంగ దీపాలను ఆర్పివేశాడు. దీంతో అనుమానం వచ్చిన నైట్ వాచ్మెన్ ఆలయం వెనుక నివాసం ఉంటున్న సిబ్బందిని తీసుకురావడానికి వెళ్లాడు. వారు వచ్చి ఆలయ ప్రాంగణంలో పరిశీలించినా దొంగను మాత్రం గమనించలేదు. తర్వాత కొద్దిసేపటికి దొంగ హుండీతో సమీపంలోని పొలంలోకి వెళ్లాడు. నైట్‌వాచ్‌మెన్, ఆలయ సిబ్బంది గర్భాలయం వద్ద చూడగా హుండీ చోరీకి గురైనట్టు గుర్తించారు. పొలంలో హుండీ పగులగొట్టిన దొంగ సొమ్ముతో ఉడాయించాడు. ఆ సమయంలో ఆలయం వద్ద మోటార్ బైక్ శబ్ధం రావడంతో ఆలయ సిబ్బంది, స్థానికులు పొలం వైపుగా వెళ్లారు. దొంగ వేగంగా మోటార్ బైక్‌పై తప్పించుకుని పోయాడు. స్థానికులు ఖండవల్లి గ్రామం వరకూ దొంగను వెంబడించినా ఫలితం లేదు. ఖండవల్లి నుంచి తూర్పువిప్పర్రు రోడ్డులోకి దొంగ వేగంగా వెళ్లిపోయాడు. ఇది మూడోసారి అన్నవరప్పాడు గ్రామంలో ఆలయాల్లోని హుండీలు అపహరణకు గురికావడం ఇది మూడోసారి. గతేడాది జూలైలో ఇదే తరహాలో ఈ ఆలయంలోనే చోరీ జరిగింది. గత నెలలో గ్రామంలోని శక్తమ్మవారి ఆలయంలో హుండీని అపహరించారు. మరలా ఇప్పుడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీ చోరీకి గురైంది. -
శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ
పెరవలి : పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలంలోని అన్నవరప్పాడులో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్థరాత్రి దొంగలు పడ్డారు. ఆలయంలోని హుండీ దొంగలు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం గుడి పూజారులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... చోరీ జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యాగాల వల్లే దేశం సుభిక్షం
అన్నవరప్పాడు (పెరవలి) : వేద పండితులు నిర్వహిస్తున్న యాగాలు, అర్చకులు చేస్తున్న పూజల వల్లనే దేశం సుభిక్షంగా ఉందని దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో వేద పండితుడు ఖండవల్లి సూర్యనారాయణ చార్యులు రచించిన ‘సంక్షిప్త ప్రతిష్ఠా సరళి గ్రం«థం’ను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 1721 దేవాలయాలకు గాను 710 దేవాదాయ శాఖా అధీనంలో ఉన్నాయని అన్నారు. వీట న్నింటికీ కమిటీలు వేస్తున్నామని, ఇప్పటికీ 80 శాతం పూర్తి చేశామని చెప్పారు. జిల్లాలో ప్రముఖ దేవాలయాలైన భీమవరం మావుళ్లమ్మ అమ్మవారు, ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయాలను కలుపుతూ టూరిజం ఏర్పాటు చేస్తున్నామని, ఇది త్వరలోనే భక్తులకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గత నెలలో దేవాలయాలన్నింటిలో నిర్వహించిన వరుణ, అరుణయాగం, సహస్ర ఘటాభిషేకం వల్లనే మూడు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని తెలిపారు. శాస్త్రాలు, పురాణాలు ఆధారంగా క్రతువుల్లో చేసే యాగాల ఫలమే ప్రపంచశాంతికి, దేశ సుఖశాంతులకు దోహదం చేస్తున్నాయని అన్నారు. తొలుత ఆయనకు పండితులు వేద మంత్రాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలకగా వేదపండితులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆ శాఖ ఇ¯Œæస్పెక్టర్ శ్రీనివాస్, ఈవో వీఎస్ఎస్ బ్రహ్మారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న వోల్వో బస్సు
గుంటూరు : గుంటూరు జిల్లా రొంపిచర్ల మండం అన్నవరప్పాడు వద్ద శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగివున్న ఆయిల్ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఒక ప్రైవేటు వోల్వో బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లా కొండేపీకి చెందిన సిహెచ్ రమణయ్య, టంగుటూరుకు చెందిన బాలబ్రహ్మచారిల పరిస్థితి విషమంగా వుంది. గాయపడిన మరో 16 మంది ప్రయాణీకులను చికిత్సల కోసం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వోల్వో బస్సు హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.