దైవ సన్నిధికి వెళుతూ అనంత లోకాలకు..
అన్నవరప్పాడు (పెరవలి): అతివేగం పన్నెండేళ్ల బాలుడి ప్రాణం తీసింది. దైవ సన్నిధికి వెళుతుండగా కారు రూపంలో మృత్యువు కబళించింది. జాతీయ రహదారిపై పెరవలి మండలం అన్నవరప్పాడు వెంకటేశ్వస్వామి ఆలయం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు దుర్మరణం పాలయ్యాడు. హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. అన్నవరప్పాడు గ్రామానికి చెందిన పులపర్తి అచ్చన్న, భార్య దుర్గ, కుమారుడు మణికంఠ సాయి కౌశిక్ (11), బంధువులు, వారి పిల్లలతో కలిసి శనివారం ఉదయం 8 గంటల సమయంలో గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి బయలుదేరారు. వీరంతా ఆలయం దగ్గరకు చేరుకున్నారు. ఇదే సమయంలో కుమారుడు చేయి పట్టుకుని రోడ్డు దాటుదామని తల్లి దుర్గ అనుకుంటుండగా వీరితో పాటు వచ్చిన ముగ్గురు బంధువుల పిల్లలు రోడ్డు మార్జిన్‌లోకి చేరారు. ఇది చూసిన మ ణికంఠ తల్లి చేయి విడిపించుకుని రోడ్డుదాటేద్దామంటూ ఒక్కసారిగా పరుగు పెట్టాడు. అదే సమయంలో జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు మణికంఠను ఢీకొట్టింది. దీంతో గాలిలోకి ఎగిరి కారు ముందు భాగంలో అద్దాలపై పడి అక్కడి నుంచి సుమారు 10 మీటర్ల దూరంలో రోడ్డుపై పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రా ణాలు విడిచాడు. తల్లిదండ్రులు, బంధువుల కళ్లముందే ప్రమాదం జరగడంతో వారంతా భీతిల్లిపోయారు. హైవే పెట్రోలింగ్ పోలీసుల సాయంతో బాలుడిని తణుకు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తమ ఒక్కగానొక్క బిడ్డను ఎలాగైనా బతికించండంటూ తల్లిదండ్రుల రోదనలు కంటతడి పెట్టించాయి. పెరవలి ఏఎస్‌ఐ ద్వారంపూడి త్రిమూర్తిరెడ్డి ఘటనాస్థలికి చేరుకుని కారు డ్రైవర్ కొండపల్లి దుర్గారావుని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
అన్నవరప్పాడు.. కన్నీటి సంద్రం
మణికంఠ మృతి విషయం తెలిసిన గ్రామం మూగబోయింది. బంధువులు, గ్రామస్తులు మృతుని ఇంటికి చేరుకున్నారు. కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నారు. వికలాంగుడైన తాత కాశీరావు మనుమడి మృతదేహాం చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘నాకు దిక్కేమిటిరా దేవుడు, నన్ను చూసేవారు ఎవరు, నాకు సరుకులు తెచ్చేవాడు ఎవరూ అంటూ’ బోరుమన్నాడు. ‘తమ్ముడూ, తమ్ముడూ’ అంటూ మణికంఠ అక్క రోదనలు కంటతడిపెట్టించాయి.