కర్నూలు : రాజోలి నీటి మళ్లింపు పథకం కుడికాల్వకు మరో ముందడుగు పడింది. నీటి కేటాయింపులు ఉన్న ఈ కాల్వ నిర్మాణానికి సర్వే చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు ఎస్‌ఆర్‌ఈఎస్ ఏజెన్సీతో అగ్రిమెంటు చేసుకున్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఆర్డీఎస్ కుడికాల్వకు 4 టీఎంసీల నీటిని నికర జలాల కింద కేటాయించింది. ఈ నీటిని కోసిగి మండలం సమీపంలో నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి వాడుకోవచ్చు. ఇక్కడ కాల్వ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన సర్వే కోసం ప్రభుత్వం రూ.3.09 కోట్లు కేటాయించింది.
సర్వేకు జలవనరుల శాఖ అధికారులు టెండర్లు పిలువగా ఎస్‌ఆర్‌ఈఎస్ ఏజెన్సీ దక్కించుకుంది. అగ్రిమెంట్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్‌కు అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. ఏడాదిలోప సర్వే పూర్తి చేసి డీపీఆర్‌ను తయారు చేయాలని అగ్రిమెంటులో ఏజెన్సీకి సూచించారు. ఇప్పటికే ఇంజినీర్లు తయారు చేసిన అలైన్‌మెంట్‌ను ఆధారం చేసుకుని సర్వే చేయాలని జలవనరుల శాఖ ఒప్పందం చేసుకుంది. ఈ కాల్వ నిర్మాణం వల్ల జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 40వేల ఎకరాల ఆయకట్టుకు, వేలాది మంది ప్రజలకు తాగునీటి అవసరాలు తీరనున్నాయి.