మరోసారి కాంట్రాక్టర్ల సిండికేట్!
Published Wed, Sep 7 2016 11:49 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న కాంట్రాక్టర్లు
ప్రజాప్రతినిధుల మధ్యవర్తిత్వంతో సిండికేట్
మంచిర్యాలలో రూ.1.29 కోట్ల పనులకు టెండర్లు
మంచిర్యాల టౌన్ : మంచిర్యాల మున్సిపాలిటీలో మరో అవినీతికి తెరలేచింది. ఎస్సీ ఎస్టీ, టీఎఫ్‌సీ నిధులు రూ.1.29 కోట్ల నిధులతో ఎ స్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పను లు, డ్రెయినేజీల నిర్మాణం, పైప్‌లైన్ల ఏర్పాటు, రోడ్లు వేయడంపై మంగళవారం సాయంత్రం వరకు ఆన్‌లైన్‌లో టెండర్లను ఆహ్వానించారు. టెండర్లు ఆన్‌లైన్‌లోనే ఆహ్వానించినా, పోటీ ఉండడంతో లెస్ అమౌంట్‌కు పోటాపోటీగా టెండర్లు వేసే అవకాశం ఉందని, దీంతో అం దరూ నష్టపోతారన్న ఉద్దేశంతోనే సిండికేట్‌కు తెరలేపినట్లుగా సమాచారం. దీంతో చివరి రోజున కాంట్రాక్టర్లు మున్సిపల్ ప్రజాప్రతినిధి ఇంట్లోనే సమావేశమై సిండికేట్ అయినట్లుగా సమాచారం. మున్సిపల్ పనులు చేపట్టే కాం ట్రాక్టర్ల నుంచి ఎలాంటి పోటీ లేకుండా చేసేం దుకు మున్సిపాలిటీ ముఖ్య ప్రజాప్రతినిధి మధ్యవర్తిత్వం జరిపినట్లు తెలిసింది. ఈ చర్చ లు జరుగుతుండగానే, ఓ సీనియర్ ప్రజాప్రతినిధికి చెందిన ఇద్దరు సోదరుల కుమారులు ఒకరిపై ఒకరు బాహాబాహీ అన్నట్లుగా కొట్టుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చివరికి కాంట్రాక్టర్లందరూ రింగై, సిండికేట్‌గా మారినట్లు తెలిసింది. టెండర్లకు నిర్ణయించిన ధరకు కొద్ది తక్కువ లెస్ అమౌంట్‌కు టెండర్లు వేయాలని నిర్ణయించగా, అందులో 11 శాతం పనులు దక్కించుకున్న వెంటనే చెల్లించాలని, 5 శాతం టెండర్లలో పాల్గొనని కాంట్రాక్టర్లకు, మిగిలిన 6 శాతంలో మూడు శాతం పాలకవర్గం ముఖ్య నేతకు, మిగిలిన మూడు శాతం పాలకవర్గ కౌన్సిలర్లకు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లుగా సమాచారం. ముఖ్య ప్రజాప్రతినిధి ఇంట్లోనే ఈ తతంగం జరగడం, అక్కడి స్థానికుల ద్వారా సమాచారం పట్టణం అంతా వ్యాపించి, పట్టణంలో ఇదో చర్చకు దారితీసింది. ఇప్పటికే మంచిర్యాల మున్సిపాలిటీ అవినీతిలో కూరుకుపోగా, ఇకపై ఈ అవినీతిని ఎవరు ఆపుతారని, సిండికేటుగా మారి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఏ మేరకు నాణ్యతతో పనులు చేపడతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
Advertisement