గుంతకల్లు, న్యూస్‌లైన్: దక్షిణ పశ్చిమ రైల్వే (ఎస్‌డబ్ల్యుఆర్) బెంగళూరు రైల్వే డివిజన్ నుంచి వచ్చే రైళ్లు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. బెంగళూరులో రైళ్ల నిర్వహణ ప్రమాణాల మేరకు లేకపోవడంతోనే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తప్పులు, పొరపాట్ల నుంచి దక్షిణ పశ్చిమ రైల్వే గుణపాఠం నేర్చుకోవడం లేదు. దీంతో మళ్లీ మళ్లీ అవే తప్పులే పునరావృతం అవుతున్నాయి. దీంతో ఆ డివిజన్ నుంచి రైళ్లు తరచుగా ప్రమాదాలలో చిక్కుకుంటున్నాయి.
ఈ రైళ్లలో ప్రయాణించాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి దాపురించింది. ఈ పరిణామాల నేపథ్యంలో 20 రోజుల వ్యవధిలోనే మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా శనివారం తెల్లవారుజామున 3.40 గంటల సమయంలో అనంతపురం జిల్లా కొత్తచెరువు రైల్వేస్టేషన్ సమీపంలో బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్లే నాందేడ్ ఎక్స్‌ప్రెస్(16594) బోగీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. త్రీ టైర్ ఏసీ బోగీ ( కోచ్ బీ1) పూర్తిగా మంటలకు ఆహుతైంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నపిల్లలతో సహా 26 మంది ప్రయాణికులు చనిపోయారు.
మూడు రోజుల క్రితం త్రుటిలో తప్పిన ప్రమాదం
ఈ నెల 26న బెంగళూరు నుంచి జైపూర్ బయలుదేరిన జైపూర్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ : 12975)కు చెందిన బోగీలు ధర్మవరం రైల్వేస్టేషన్ సమీపంలో ఇంజన్ నుంచి విడిపోయాయి. ఇంజన్ డ్రైవరుతోపాటు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రైన్ ఫార్మేషన్ నిర్వహణలో లోపం వల్లే ఈ సంఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌కు ఘటనకు సరిగ్గా రెండు రోజుల ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది. చెన్నై నుంచి షిర్డీ (వయా బెంగళూరు) ప్రయాణించే వీక్లీ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ : 22601) బోగీలకు బెంగళూరులో నీటిని నింపకపోవడంతో ఏసీ బోగీలోని ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడి ఆగ్రహంతో టీటీఈ సంజీవయ్యపై దాడి చేసి చితకబాదడంతో మృతి చెందారు.
ఈ నెల 11వ తేదీన ఈ సంఘటన జరగడం గమనార్హం. బెంగళూరు రైల్వే డివిజన్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ రెండు సంఘటనలు జరిగినట్ల్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. బెంగళూరులో రైళ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, అక్కడ రైళ్లను క్లీన్ చేయకుండా, ఏసీ పరికరాలు, విద్యుత్ వైరింగ్‌లను తనిఖీ చేయకుండా, బోగీల్లో నీటిని నింపకుండా, రైలును పూర్తి స్థాయిలో చెక్ చేయకుండా పంపుతుండడంతో ప్రమాదాలకు దారితీస్తోంది.
బెంగళూరులో రద్దీ ఎక్కువగా ఉండడం, అక్కడ ఫార్మేషన్స్‌ను పెట్టడానికి రోడ్లు లేకపోవడం, సిబ్బంది తక్కువగా ఉండడం తదితర కారణాల వల్ల బెంగళూరు అధికారులు రైళ్లను నిర్వహించకుండానే పంపుతుండడంతో ఆ భారం దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్‌పై పడుతోంది. దీంతో గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు, సిబ్బంది సతమతమవుతున్నారు. బెంగళూరు రైల్వే డివిజన్ నుంచే వచ్చే రైళ్లంటేనే ఇక్కడి అధికారులు హడలిపోతున్నారు.
వామ్మో.. బెంగళూరు డివిజన్ రైళ్లా!
Published Sun, Dec 29 2013 3:41 AM | Last Updated on Wed, Sep 5 2018 3:52 PM
Advertisement