South Western Railway
-
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 4 రైళ్లు రద్దు.. వివరాలివే!
గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా బెంగళూరు వెళ్లే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది. యలహంక - పెనుకొండ మధ్య డబ్లింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా రద్దు చేసినట్లు వెల్లడించింది. 12, 13, 14 తేదీల్లో సికింద్రాబాద్ యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్.. సోలాపూర్ హసన్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే మరో ఆరు ట్రైన్లను పాక్షికంగా రద్దు అవగా.. 12 రైళ్లను దారి మళ్లించింది. కాగా, ముందస్తు సమాచారం లేకపోవడంతో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. సికింద్రాబాదు - యశ్వంత్ పూర్ మధ్య నడిచే 12735 నెంబర్ గల రైలును డిసెంబర్ 12న దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. యశ్వంత్ పూర్ - సికింద్రాబాదు మధ్య నడిచే 12736 నెంబర్ గల రైలును డిసెంబర్ 12న దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. సోలాపూర్ - హసన్ మధ్య నడిచే 11311 నెంబర్ గల రైలును డిసెంబర్ 12, 13, 14న దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. హసన్ - సోలాపూర్ మధ్య నడిచే 11312 నెంబర్ గల రైలును డిసెంబర్ 12, 13, 14న దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. Cancellation / Partial Cancellation / Diversion of Trains due to Non-Interlocking Works on South Western Railway @drmsecunderabad @drmgtl @drmgtl @VijayawadaSCR pic.twitter.com/EWRctFm5FX — South Central Railway (@SCRailwayIndia) December 8, 2021 -
భారీగా తగ్గిన ఏసీ కోచ్ టికెట్ల ధరలు
సాక్షి, బెంగళూర్ : ప్రయాణీకులకు రైల్వేలు తీపికబురు అందించాయి. ఏసీ ట్రైన్లలో ఎక్కువ మంది ప్రయాణీకులను ఆకర్షించేలా ఐదు రైళ్లలో ఏసీ కోచ్ టికెట్ ధరలను రైల్వేలు ఇటీవల తగ్గించాయి. కర్నాటకలో బెంగళూర్, గడగ్, మైసూర్ నుంచి ఐదు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ కోచ్‌ల ధరలను నైరుతి రైల్వే ప్రకటించింది. బెంగళూర్ మీదుగా మైసూర్, చెన్నై శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ చైర్ కార్ ధర తగ్గించడంతో బస్సు, విమానాల కన్నా అధికంగా ప్రయాణీకులు ఈ ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రయాణిస్తున్నారని నైరుతి రైల్వే ప్రతినిధి వెల్లడించారు. శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో చార్జీల తగ్గింపుకు లభించిన స్పందనతో బెంగళూర్ నుంచి యశ్వంత్‌పూర్-హూబ్లీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఏసీ చైర్‌కార్ ధరలను రూ 735 నుంచి రూ 590కు తగ్గించామని తెలిపారు. గత వారం ఈ ఎక్స్‌ప్రెస్ ఏసీ చార్జీలను తొలిసారిగా తగ్గించడంతో స్పందన ప్రోత్సాహకరంగా ఉందని తెలిపారు. ఇక మైసూర్-షిర్డీ ఎక్స్‌ప్రెస్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ చార్జీలను సైతం డిసెంబర్ 3 నుంచి రూ 495 నుంచి రూ 260కి తగ్గిస్తామని వెల్లడించారు. బెంగళూర్, హుబ్లీ మధ్య నడిచే యశ్వంత్‌పూర్-బికనీర్ ఎక్స్‌ప్రెస్ ఏసీ చార్జీలను నవంబర్ 30 నుంచి రూ 735 నుంచి రూ 590కి తగ్గిస్తామన్నారు. ఇక యశ్వంత్‌పూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ఏసీ ఫేర్‌ను నవంబర్ 22 నుంచి రూ 345 నుంచి రూ 305కు తగ్గించనున్నట్టు చెప్పారు. ప్రయాణీకులకు సుఖవంతమైన ప్రయాణం అందించేందుకు ఏసీ కోచ్‌లలో వులెన్ దుప్పట్ల స్ధానంలో మెరుగైన నాణ్యతతో కూడిన నైలాన్ బ్లాంకెట్స్ అందుబాటులోకి తేనున్నారు. -
పరుగులు పెట్టిన రైలు
రాయదుర్గం–కళ్యాణదుర్గం మార్గంలో 110 కిలోమీటర్ల స్పీడ్‌తో ట్రయల్ రన్ విజయవంతం వారం రోజుల్లోగా సౌత్ వెస్ట్రన్ రైల్వే జీఎంకు నివేదిక నెలాఖరులోనే ప్యాసింజర్ రైలు నడిపే అవకాశం? రాయదుర్గం టౌన్: రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం వరకు నిర్మించిన కొత్త రైలు మార్గంలో ప్రత్యేక తనిఖీ రైలు శుక్రవారం అధికారికంగా పట్టాలెక్కింది. ఈ మార్గంలో 110 కిలోమీటర్ల వేగంతో రైలును ప్రయోగాత్మకంగా నడిపి పరీక్షించారు. ట్రయల్ రన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతమైనట్లు రైల్వే సేఫ్టీ అధికారులు తెలిపారు. 40 కిలోమీటర్ల మధ్య దూరం గల ఈ మార్గంలో తొలుత రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గానికి ఉదయం 9.30 గంటలకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రత్యేక రైలు కళ్యాణదుర్గం స్టేషన్‌కు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి మధ్యాహ్నం 2.20 గంటలకు అదే వేగంతో ఎలాంటి టెక్నికల్ సమస్యలు లేకుండా విజయవంతంగా రాయదుర్గం స్టేషన్‌కు వెళ్లింది. మొదటి రోజు ఆరు మోటార్ ట్రాలీలలో సీఆర్ఎస్ తనిఖీలు నిర్వహించిన సౌత్ వెస్ట్రన్ రైల్వే, రైల్వే సేఫ్టీ ఉన్నతాధికారులు రెండో రోజైన శుక్రవారం ట్రయల్ రన్‌ను పూర్తి చేశారు. అనంతరం ఇంజినీర్లను, రైలు గార్డులు, డ్రైవర్లు, అధికారులను అభినందించారు. రాయదుర్గం చేరుకున్న తరువాత విలేకర్లతో రైల్వే చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి అశోక్ గుప్తా, చీఫ్ సేఫ్టీ కమిషనర్ మనోహర్, ఏడీఆర్ఎం పునిత్ మాట్లాడారు. ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశామని, ఆథరైజేషన్ నివేదికను వారం రోజుల్లోగా సౌత్‌వెస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్‌కు అందజేస్తామన్నారు. సేఫ్టీ తనిఖీల్లో అన్ని పారా మీటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత ట్రయల్ రన్ విజయవంతమైందన్నారు. మార్గంలో రైలు నడిపేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. అన్ని రకాలుగా ట్రాక్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. నెలాఖరులో లేదా జనవరిలో ఒక ప్యాసింజర్ రైలు నడిపించే అవకాశం ఉందన్నారు. రాయదుర్గం నుంచి టుంకూరుకు 207 కిలోమీటర్లకు గాను ఇప్పటి వరకు 40 కిలోమీటర్ల మేర కళ్యాణదుర్గం వరకు రైలు నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు. ఆంధ్రా పరిధిలోని 94 కిలోమీటర్లకు గాను ఇంకా 23 కిలోమీటర్ల పరిధిలో భూమి అక్విజేషన్ కార్యక్రమం కొనసాగుతోందని, కర్ణాటక పరిధిలోనూ ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. -
20న రైల్వే రిజర్వేషన్‌కు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) ఆధునీకరణ పనుల దృష్ట్యా ఈ నెల 20వ తేదీన పీఆర్ఎస్ సేవలను రెండున్నర గంటలపాటు నిలిపివేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 20న ఉదయం 11.30 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 వరకు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ నిలిచిపోనుందని చెప్పారు. దీని వల్ల దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోని అన్ని రిజర్వేషన్ కేంద్రాల వద్ద టికెట్ బుకింగ్ సేవలు ఆగిపోతాయి. అలాగే ద.మ.రైల్వే, సదరన్ రైల్వే, నైరుతి రైల్వే జోన్ల పరిధిలో ఇంటర్నెట్ టికెట్ బుకింగ్ సేవలు, పీఎన్ఆర్ సంబంధమైన సేవలు కూడా నిలిచిపోతాయి. కరెంట్ బుకింగ్ కూడా ఉండదు. పీఆర్ఎస్ ద్వారా జరిగే టికెట్ రద్దు, రిఫండ్ సేవలు కూడా ఉండవు. రిఫండ్ కోసం కౌంటర్ల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. -
నేడు జగన్ పర్యటన ఇలా..
పలమనేరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ఆదివారం పెద్దపంజాణి మండలంలోని కెళవాతి నుంచి ప్రారంభం అవుతుందని పార్టీ స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తెలి పారు. చదళ్లవారి పల్లె, కొళత్తూరు, తుర్లపల్లెక్రాస్, తుర్లపల్లె, కొత్తూరులో రోడ్‌షో ఉంటుందన్నారు. పుంగనూరు మండలం బత్తలాపురంలో పితాంబరం కల్పన కుటుంబాన్ని ఓదారుస్తారని తెలిపారు. అక్కడ నుంచి తుర్లపల్లె క్రాస్, నేలపల్లె, దిన్నెపలెల్లో రోడ్‌షో ఉంటుందని చెప్పారు. మండల కేంద్రమైన పెద్దపంజాణిలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, బసవరాజుకండిగ, కోగిలేరు, గుడిపల్లె క్రాస్‌ల్లో రోడ్‌షో, రాయలపేటలో జరిగే బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని వివరించారు. కమ్మపాళెంలో డోలు నాగరాజు కుటుంబాన్ని ఓదార్చి, అక్కడి నుంచి చెన్నారెడ్డిపల్లె క్రాస్, సుద్దగుండ్ల పల్లె క్రాస్, కెళవాతి క్రాస్, వీరప్పల్లె, కొత్త వీరప్పల్లె, ఎ.కొత్తకోట క్రాస్, దాదేపల్లెల్లో రోడ్‌షోల్లో పాల్గొంటారని తెలిపారు. దుర్గ సముద్రంలో తోటి శంకరమ్మ కుటుంబాన్ని ఓదారుస్తారని, ఆ తర్వాత చారాలలో వై ఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారన్నారు. శెట్టిపల్లె, చిట్టిరెడ్డి పల్లెల్లో రోడ్‌షో నిర్వహించి రాత్రికి చౌడేపల్లెలో జగన్మోహన్రెడ్డి బస చేస్తారని వారు వివరించారు. -
వామ్మో.. బెంగళూరు డివిజన్ రైళ్లా!
గుంతకల్లు, న్యూస్‌లైన్: దక్షిణ పశ్చిమ రైల్వే (ఎస్డబ్ల్యుఆర్) బెంగళూరు రైల్వే డివిజన్ నుంచి వచ్చే రైళ్లు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. బెంగళూరులో రైళ్ల నిర్వహణ ప్రమాణాల మేరకు లేకపోవడంతోనే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తప్పులు, పొరపాట్ల నుంచి దక్షిణ పశ్చిమ రైల్వే గుణపాఠం నేర్చుకోవడం లేదు. దీంతో మళ్లీ మళ్లీ అవే తప్పులే పునరావృతం అవుతున్నాయి. దీంతో ఆ డివిజన్ నుంచి రైళ్లు తరచుగా ప్రమాదాలలో చిక్కుకుంటున్నాయి. ఈ రైళ్లలో ప్రయాణించాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి దాపురించింది. ఈ పరిణామాల నేపథ్యంలో 20 రోజుల వ్యవధిలోనే మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా శనివారం తెల్లవారుజామున 3.40 గంటల సమయంలో అనంతపురం జిల్లా కొత్తచెరువు రైల్వేస్టేషన్ సమీపంలో బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్లే నాందేడ్ ఎక్స్‌ప్రెస్(16594) బోగీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. త్రీ టైర్ ఏసీ బోగీ ( కోచ్ బీ1) పూర్తిగా మంటలకు ఆహుతైంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నపిల్లలతో సహా 26 మంది ప్రయాణికులు చనిపోయారు. మూడు రోజుల క్రితం త్రుటిలో తప్పిన ప్రమాదం ఈ నెల 26న బెంగళూరు నుంచి జైపూర్ బయలుదేరిన జైపూర్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ : 12975)కు చెందిన బోగీలు ధర్మవరం రైల్వేస్టేషన్ సమీపంలో ఇంజన్ నుంచి విడిపోయాయి. ఇంజన్ డ్రైవరుతోపాటు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రైన్ ఫార్మేషన్ నిర్వహణలో లోపం వల్లే ఈ సంఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌కు ఘటనకు సరిగ్గా రెండు రోజుల ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది. చెన్నై నుంచి షిర్డీ (వయా బెంగళూరు) ప్రయాణించే వీక్లీ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ : 22601) బోగీలకు బెంగళూరులో నీటిని నింపకపోవడంతో ఏసీ బోగీలోని ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడి ఆగ్రహంతో టీటీఈ సంజీవయ్యపై దాడి చేసి చితకబాదడంతో మృతి చెందారు. ఈ నెల 11వ తేదీన ఈ సంఘటన జరగడం గమనార్హం. బెంగళూరు రైల్వే డివిజన్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ రెండు సంఘటనలు జరిగినట్ల్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. బెంగళూరులో రైళ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, అక్కడ రైళ్లను క్లీన్ చేయకుండా, ఏసీ పరికరాలు, విద్యుత్ వైరింగ్లను తనిఖీ చేయకుండా, బోగీల్లో నీటిని నింపకుండా, రైలును పూర్తి స్థాయిలో చెక్ చేయకుండా పంపుతుండడంతో ప్రమాదాలకు దారితీస్తోంది. బెంగళూరులో రద్దీ ఎక్కువగా ఉండడం, అక్కడ ఫార్మేషన్స్‌ను పెట్టడానికి రోడ్లు లేకపోవడం, సిబ్బంది తక్కువగా ఉండడం తదితర కారణాల వల్ల బెంగళూరు అధికారులు రైళ్లను నిర్వహించకుండానే పంపుతుండడంతో ఆ భారం దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్‌పై పడుతోంది. దీంతో గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు, సిబ్బంది సతమతమవుతున్నారు. బెంగళూరు రైల్వే డివిజన్ నుంచే వచ్చే రైళ్లంటేనే ఇక్కడి అధికారులు హడలిపోతున్నారు.