20న రైల్వే రిజర్వేషన్‌కు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్‌ఎస్) ఆధునీకరణ పనుల దృష్ట్యా ఈ నెల 20వ తేదీన పీఆర్‌ఎస్ సేవలను రెండున్నర గంటలపాటు నిలిపివేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 20న ఉదయం 11.30 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 వరకు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ నిలిచిపోనుందని చెప్పారు.
దీని వల్ల దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోని అన్ని రిజర్వేషన్ కేంద్రాల వద్ద టికెట్ బుకింగ్ సేవలు ఆగిపోతాయి. అలాగే ద.మ.రైల్వే, సదరన్ రైల్వే, నైరుతి రైల్వే జోన్‌ల పరిధిలో ఇంటర్నెట్ టికెట్ బుకింగ్ సేవలు, పీఎన్‌ఆర్ సంబంధమైన సేవలు కూడా నిలిచిపోతాయి. కరెంట్ బుకింగ్ కూడా ఉండదు. పీఆర్‌ఎస్ ద్వారా జరిగే టికెట్ రద్దు, రిఫండ్ సేవలు కూడా ఉండవు. రిఫండ్ కోసం కౌంటర్‌ల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేస్తారు.