‘తన్నీరు ఇల్లె తంబీ’ | The AP government has not been able to release water to Tamil Nadu | Sakshi
Sakshi News home page

‘తన్నీరు ఇల్లె తంబీ’

Published Wed, Jul 19 2017 4:07 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM

‘తన్నీరు ఇల్లె తంబీ’ - Sakshi

‘తన్నీరు ఇల్లె తంబీ’

మాకే లేవు మీకెలా
కృష్ణ నీటిపై ఏపీ
వర్షాలు కురిపించలేం
చెన్నైలో దాహార్తికి తంటాలు


వర్షాలు కురవక జలాశయాలు ఎండిపోయి మాకే నీళ్లు లేవు. మీకెలా ఇస్తాం.. తన్నీరు ఇల్లె తంబీ (నీళ్లు లేవు తమ్ముడు) అంటూ తమిళనాడుపై యుగళగీతం పాడాయి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు. తాగునీరు, సాగునీరు కోసం తిప్పలు పడుతున్న తమిళనాడు పొరుగురాష్ట్రాలపై ఆధారపడగా వారు సైతం మొండిచేయిచూపారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై
: చెన్నై దాహార్తిని తీర్చే జలాశయాల్లో పూండి జలాశయం ఎంతో ముఖ్యమైంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 3,231 మిలియన్‌ ఘనపుటడుగులు కాగా ప్రసుత్తం 20 మిలియన్‌ ఘనపుటడుగులు మాత్రమే ఉంది. గత ఏడాది జూలై 17వ తేదీన 776 మిలియన్‌ ఘనపుటడుగుల నీరు నిల్వ ఉంది. గత ఏడాది తగిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో తమిళనాడులోని జలాశయాలు నిండలేదు. దీంతో నాలుగు నెలల క్రితమే పూండి జలాశయం ఎండిపోయింది.

పుళల్, చెంబరబాక్కం, చోళవరం, వీరాణం జలాశయాలు ఎడారిని తలపిస్తుండగా చెన్నైలో తాగునీటి ఇబ్బందులు మరింతగా పెరిగిపోయాయి. ఈ దుర్భరస్థితిని తట్టుకునేందుకు మాంగాడు క్వారీల నుంచి నీరు, పోరూరు జలాశయం నీటిని శుద్ధి చేసి చెన్నైకి పంపుతున్నారు. ఇదిగాక నైవేలీ సొరంగ నీరు, సముద్రపు నీటి నిర్లవీకరణతో తాగునీటికి అవసరాలను ఓమేరకు తీరుస్తున్నారు. వ్యవసాయ బావులు, బోర్ల నీటిని చెన్నైకి తరలిస్తున్నా చాలడం లేదు.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కండలేరు జలాశయం ద్వారా పూండికి కృష్ణానది నీరు విడుదల చేయడం పరిపాటి. అయితే కృష్ణనీరు రాలేదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ మధ్యన జరిగిన ఒప్పందం ప్రకారం జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు కండలేరు నుంచి పూండికి 8 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఆ తరువాత జూలై నుంచి అక్టోబరు వరకు మరో 4 టీఎంసీలను విడుదల చేయాలి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి తరువాత కృష్ణనీరు విడుదల చేయకపోవడంతో తమిళనాడు అధికారులు ఏపీకి ఉత్తరం రాశారు.  అయితే ఏపీ ప్రభుత్వం నీటి విడుదల చేయలేమంటూ చేతులెత్తేసింది.

కావేరీలో నీళ్లు లేవు : కర్ణాటక మంత్రి       
కావేరి వాటా జలాలను తమిళనాడుకు విడుదల చేసేలా ఆదేశించాలని సుప్రీం కోర్టులో తమిళనాడు ప్రభుత్వ న్యాయవాదులు వాదన వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి పటేల్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, గత నెల 1వ తేదీ నుంచి ఈనెల 17వ తేదీ వరకు 44 టీఎంసీల నీటిని తమిళనాడుకు వదలాల్సి ఉంది. అయితే పులిగుండు జలాశయం నుంచి 2.2 టీఎంసీల నీటిని వదిలినట్లు రికార్డులు చెబుతున్నాయని అన్నారు.

  తమ రాష్ట్రానికే తగినంత నీరు అందుబాటులోని తరుణంలో తమిళనాడు ఒత్తిడి చేస్తోందని చెప్పారు. గత ఏడాది జూలైలో కర్ణాటక జలాశయాల్లో 57 టీఎంసీల నీళ్లు ఉండగా, ప్రస్తుతం 26 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని అన్నారు. అందుబాటులో ఉన్న నీటితో కర్ణాటక అవసరాలే తీరనపుడు తమిళనాడుకు నీళ్లు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తమిళనాడుకు తన్నీరు కోసం కర్ణాటకలో వర్షం కురిపించలేమని ఆయన ఎద్దేవా చేశారు.  

వర్షాలు లేవు.. నీళ్లు రావు : ఆంధ్రప్రదేశ్‌
ఏపీకి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, కండలేరు జలాశయంలో 8 టీఎంసీల నిల్వ ఉంటేనే తమిళనాడుకు నీళ్లు ఇవ్వగలం, కనీసం 5 టీఎంసీలైనా ఉండాలని అన్నారు. అయితే ఇప్పుడున్న నీళ్లు మాకే చాలవని, వర్షాలు పడిన తరువాతనే లేకుంటే ఎటువంటి పరిస్థితిల్లోనూ నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రభుత్వం తమకివ్వాల్సిన రూ.460 కోట్ల బాకీని ముందు చెల్లించాలని ఆయన తిరుగుబాణం వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement