వృద్ధుని కళ్లు పీక్కుతిన్న కుక్కలు
► విషమ పరిస్థితుల్లో అభాగ్యుడు
► విజయపురలో దారుణం
విజయపుర (బెంగళూరు గ్రామీణ): దిక్కుమొక్కు లేకుండ దేవనహళ్ళి రోడ్డులోని జంగ్లిపీర్ బాబా దర్గా వద్ద ఆశ్రయం పొందుతున్న వృద్ధునిపై వీధికుక్కలు దాడిచేసి కళ్లను బయటకు పీకి తిని ముఖం మీద తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘోర సంఘటన గురువారం విజయపురలో చోటు చేసుకుంది. బాధితుడు నగరంలోని గంగెనహళ్ళికి చెందిన మహ్మద్ ఇబ్రహీం (80). ఇతను కొన్నిరోజులుగా ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు.
బుధవారం అర్ధరాత్రి నిద్రలో ఉండగా వీధికుక్కలు అతని మీద పడి రెండు కళ్ళు పీక్కోని తిన్నాయి. దాంతో అతను రెండు కళ్ళు కోల్పోయి రక్తం మడుగులో పడి ఉన్నాడు. ఉదయమే అక్కడికి దగ్గర్లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే పిళ్ళ మునిశ్యామప్పకు ఈ విషయం తెలిసి అనుచరులకు చెప్పి అతనికి వైద్యసాయం అందించాలని చెప్పారు. ప్రాథమిక వైద్యం చేసి బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.
పరిస్థితి విషమం – డాక్టర్ మంజుల
విజయపుర ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు డాక్టర్ మంజుల వృద్ధునికి ప్రాథమిక వైద్యం చేశారు. ఆమె మాట్లాడుతూ వృద్ధునికి వీపు మీద పుండ్లు అయ్యాయని, ఆ వాసనకు కుక్కలు దాడిచేశాయన్నారు. అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని, ఇలాంటి పరిస్థితి తాను ఎప్పుడు చూడలేదని అన్నారు. విజయపుర పట్టణంలో వీధి కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉందని, చాలామంది వీధికుక్కల దాడిలో గాయపడి ఆస్పత్రికి సైతం వస్తున్నారని తెలిపారు. ఇలాంటి వీది కుక్కలను అరికట్టవలసిన అవసరం ఉందని ఆమె చెప్పారు. రోటరీ సంస్థ మాజీ అధ్యక్షుడు పుట్టరాజప్ప, పురసభ అధికారి ఉదయం వాకింగ్ వెళుతున్న సమయంలో దాడి చేసి వారిని కూడా కరిచాయని తెలిపారు. ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారిని కూడా వదలకుండా వెంటాడి మరీ కరుస్తున్నాయని ఆమె అన్నారు.