* విద్యార్థి మద్దతుదారుల వీరంగం
* ఉద్రిక్తత - కెమెరాలో దాడి దృశ్యాలు
* ఖండించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు
* ట్రాఫిక్ ఉచ్చులో కోడంబాక్కం
సాక్షి, చెన్నై : తనయుడ్ని మందలించాడన్న ఆగ్రహంతో ఉపాధ్యాయుడిపై ఓ తండ్రి కన్నెర్ర జేశాడు. తన అనుచరగణాన్ని పంపించి చితకొట్టించాడు. ఆ ఉపాధ్యాయుడిపై దాడిచేసిన ఘటన సీసీ కెమెరాలో రికార్డు కావడంతో వివాదానికి దారితీసింది. పైశాచికత్వంగా దాడి జరగడాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఖండించారు. కోడంబాక్కంలో రోడ్డెక్కారు. ఆ పరిసరాలు శుక్రవారం గంటల తరబడి ట్రాఫిక్ ఉచ్చులో చిక్కాయి. ఉపాధ్యాయులు పిల్లల్ని మందలించడం సహజం. మరి కొందరు ఉపాధ్యాయులు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించడం వివాదానికి దారి తీస్తోంది. ఇలాంటి ఉపాధ్యాయుల్ని కొట్టినా పట్టించుకునే వారు ఉండరు. అయితే, ఇందుకు భిన్నంగా ఉపాధ్యాయుడిపై దాడి జరగడం సహచర ఉపాధ్యాయుల్నే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులకు కోపం తెప్పించింది.
మందలింపు
కోడంబాక్కం యూనెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కాలనీలో లయోలా విద్యా సంస్థ ఉంది. ఇక్కడ పీటీ మాస్టర్‌గా భాస్కర్ రాజు పనిచేస్తున్నాడు. రొనాల్డ్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థి స్కూల్ ఆవరణలో ‘ఈల’ వేస్తూ, నానా హంగామా సృష్టించినట్టు రాజు చెవిన పడింది. దీంతో రొనాల్డ్‌ను మందలించాడు. స్కూల్ నుంచి వెలుపలకు వెళ్లిన రొనాల్డ్ తన తండ్రి అరులానందంకు పీటీ మాస్టర్ మందలింపు విషయాన్ని వివరించాడు.
ఆగ్రహానికి లోనైన అరులానందం తన అనుచరుల్ని వెంట వేసుకొచ్చాడు. ఎవ్వరూ లేని సమయంలో పీటీ మాస్టర్ భాస్కర్ రాజును చితకొట్టించాడు. అంతటితో ఆగకుండా కోడంబాక్కం స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా, రాజుపై అరులానందం అనుచరులు పైశాచికత్వాన్ని ప్రదర్శించడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అరుు్యంది.
రాజుకున్న వివాదం
మందలించడాన్న కారణంతో ఉపాధ్యాయుడిపై విద్యార్థి తండ్రి అనుచరులు పైశాచికత్వాన్ని ప్రదర్శించ డం సహచర ఉపాధ్యాయుల్లో ఆగ్రహాన్ని రేపింది. విద్యార్థుల తల్లిదండ్రుల సంఘాలు సైతం ఆ దృశ్యాల్ని తీవ్రంగా పరిగణించాయి. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు సైతం పీటీ మాస్టర్‌కు మద్దతుగా నిలిచాయి. ఉదయాన్నే కోడంబాక్కం రోడ్డెక్కారు. ఆ పరిసరాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కాయి. వాహనాల్ని దారి మళ్లించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
బుజ్జగింపులు
కోడంబాక్కం మార్గంలో నిరసనతో ఆ ప్రభావం వళ్లువర్‌కోట్టం, టీ నగర్, అశోక్ పిల్లర్, వడపళని పరిసరాల మీద పడింది. ఆందోళన కారుల్ని బుజ్జగించేందుకు కమిషనర్ జార్జ్ రంగంలోకి దిగారు. పెద్ద ఎత్తున బలగాలు సైతం రంగంలోకి దిగాయి. పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడం ఓ దశలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఎట్టకేలకు కమిషనర్ జార్జ్ ఆందోళన కారుల్ని బుజ్జగించారు. అరులానందం అనుచరులు పది మందిని అరెస్టు చేశారు. ఆ సీసీ కెమెరా వీడియో ఫుట్టేజ్ ఆధారంగా అందర్నీ అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.
పీటీ మాస్టరుపై దాడి
Published Sat, Nov 22 2014 3:08 AM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM
Advertisement
Advertisement