నవంబర్‌లోనే ‘ముఖ్య’నేత ఖరారు
Published Thu, Aug 8 2013 1:00 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
న్యూఢిల్లీ: పదిహేనేళ్లు అధికారానికి దూరంగా ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై గురిపెట్టింది. ఈ ఎన్నికలకు సరిగ్గా నెల ముందు అంటే నవంబర్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి నితిన్ గడ్కారీ బుధవారం విలేకరులకు తెలిపారు. సీఎం అభ్యర్థిత్వంపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా సీఎం అభ్యర్థిని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ ముఖ్య పదవికి ఢిల్లీ బీజేపీశాఖ మాజీ అధ్యక్షుడు హర్షవర్ధన్ పాటిల్‌ను ప్రకటిస్తారన్న విలేకరుల ప్రశ్నకు గడ్కారీ సమాధానమిస్తూ ఇప్పటివరకు ఎవరి పేరును ఖరారు చేయలేదన్నారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా ఢిల్లీ బీజేపీ సీనియర్ నాయకుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని ఆయన తెలిపారు.
అయితే రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కు సన్నిహితంగా ఉండటంతో పాటు అవినీతి ఆరోపణలు లేని అందరికీ ఆమోదయోగ్యుడైన వర్ధన్ పేరు పరిశీలనకు వచ్చే అవకాశముం దని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని ఇప్పటికే పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చిన సీనియర్ నాయకులు ఆ పదవికి వర్ధన్ ఆమోదయోగ్యుడని తెలిపారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే దీని గురించి తనకేమీ తెలియదని వర్ధన్ అన్నారు. దీనిపై ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ మాట్లాడు తూ సీఎం అభ్యర్థిత్వం విషయంలో తగిన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.
గందరగోళానికి తెరదించేందుకే...
కార్యకర్తల్లో ఉన్న గందరగోళానికి తెరదించేందుకు సాధ్యమైనంత త్వరగా సీఎం అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ యోచిస్తుందని వర్గాలు తెలిపాయి. 2008 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ముఖ్య పదవికి వీకే మల్హోత్రా పేరును ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. దీనికి సంబంధించి సంకేతాలున్నాయని, తొందర్లోనే ప్రకటన వస్తుందని సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. గోయల్ పనితీరుపట్ల పార్టీ నాయకుల్లో ఉన్న అసంతృప్తి గురించి అధిష్టాన ప్రముఖులకు అవగాహన ఉందన్నారు. ఇప్పటికే గోయల్ పనితీరుపై బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, వర్ధన్, మాజీ మేయర్ అర్తి మెహ్రా, అనేక మంది పార్టీ సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయమై గోయల్ మాట్లాడుతూ పార్టీ నాయకుల్లో ఎలాంటి నైరాశ్యం లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలుపు బాటలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యతతో పనిచేస్తున్నామని తెలిపారు. పార్టీలో అంతర్గత పోరు లేదని, పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళుతున్నామని వివరించారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ సన్నద్ధతకు వివిధ విషయాల గురించి ఇటీవలే నితీన్ గడ్కారీతో గోయల్ సమావేశమై చర్చించారు.
సమష్టిగా పనిచేయండి
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించేందుకు పార్టీ కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని గడ్కారీ కోరారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌లతో బుధవారం సమావేశమైన ఆయన ఈ మేరకు నాయకులకు హితబోధ చేశారు. వార్డుస్థాయిలో పార్టీని మరింత పటిష్టపరిచే దిశగా శ్రమించాలన్నారు. కౌన్సిలర్ ప్రదర్శనను బట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల టికెట్లను ఇస్తామని సంకేతాలు ఇచ్చారు. 2008 అసెంబ్లీ ఎన్నికలకు ముందే కౌన్సిలర్‌లకు ఎమ్మెల్యేల టికెట్లు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని గుర్తు చేశారు. నాయకులు, కార్యకర్తల మధ్య అసంతృప్తి ఉంటే వాటన్నింటిని పక్కనపెట్టి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు.
Advertisement