సాక్షి, ముంబై: రత్నగిరి జిల్లాలోని కొంకణ్ రైల్వేమార్గంపై మంగళవారం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటనలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అయితే కొంకణ్ రైల్వేమార్గంపై రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అందిన వివరాల మేరకు చిప్లూన్-కమాఠేల మధ్య ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ముంబై నుంచి గోవా బయల్దేరిన గూడ్స్ రైలు చిప్లూన్ ఓవర్‌హెడ్ బ్రిడ్జి సమీపంలో పట్టాలు తప్పింది. సుమారు 700 మీటర్ల వరకు రైలు పట్టాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పట్టాలు తప్పిన తొమ్మిది బోగీల్లో ఆరు బోగీలు పట్టాలకు ఆరు అడుగుల దూరంలో పడిపోగా, మిగిలిన మూడు బోగీలు సుమారు 50 అడుగుల దూరంలో పడిపోయాయి. ఒక బోగీ సమీపంలోని మురికివాడపై పడింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటన అనంతరం కొంకణ్ రైల్వేమార్గంపై సాయంత్రం వరకు రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. యుద్ధప్రాతిపదికపై రైల్వేమార్గాన్ని పునరుద్ధరించే పనులు కొనసాగిస్తున్నారు.
అనేక రైళ్లు రద్దు...
గూడ్స్ రైలు ప్రమాదం కారణంగా మడ్‌గావ్-ముంబై మాండవి ఎక్స్‌ప్రెస్, మడ్‌గావ్-దాదర్ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్, సావంత్‌వాడీ-దివా, రత్నగిరి-దాదర్, దాదర్-రత్నగిరి పాసింజర్ రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారిమళ్లించారు.
పట్టాలు తప్పిన గూడ్స్
Published Tue, Oct 7 2014 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM
Advertisement
Advertisement