Ratnagiri district
-
సీఎంపై అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అరెస్ట్
-
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేంద్ర మంత్రి నారాయణ రాణె అరెస్ట్
ముంబై: స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రసంగంపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణె సోమవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణలకు దారి తీసిన ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. రాణెపై మహారాష్ట్రలో పలు చోట్ల కేసులు నమోదవడంతో.. జన్ ఆశీర్వాద్ యాత్రలో భాగంగా మహారాష్ట్రలో పర్యటిస్తున్న రాణెను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఏకంగా కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. సంవత్సరం గుర్తులేకపోవడం సిగ్గుచేటు జన్ ఆశీర్వాద్ యాత్రలో భాగంగా మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని రత్నగిరిలో రాణె పర్యటించారు. ఈ సందర్భంగా ఆనాడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశిస్తూ ఆగస్ట్ 15న సీఎం ఠాక్రే చేసిన ప్రసంగాన్ని రాణె ప్రస్తావించారు. ‘ఏ ఏడాదిలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందో సాక్షాత్తూ సీఎంకు తెలీకపోవడం నిజంగా సిగ్గుచేటు. ప్రసంగాన్ని మధ్యలో ఆపి ఆయన వెనక వైపున్న సిబ్బందిని ఏడాది గురించి అడిగి తెల్సుకున్నారు. ఆ రోజు నేనే అక్కడ ఉండి ఉంటే గట్టిగా సీఎం చెంప పగలగొట్టేవాడిని’అని రాణె వ్యాఖ్యానించారు. దీంతో రాణె వ్యాఖ్యలు మహారాష్ట్ర వ్యాప్తంగా శివసేన పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం తెప్పించాయి. ముంబై, పుణె, నాగ్‌పూర్, థానె, అమరావతిసహా రాష్ట్రంలోని పలు పట్టణాల్లో శివసేన కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బీజేపీ కార్యాలయాలను ధ్వంసంచేశారు. మరోవైపు, నాసిక్ సిటీలో, రత్నగిరి జిల్లాసహా పలు పట్టణాల్లో శివసేన, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ముంబైలోని రాణె నివాసం వద్ద బీజేపీ, శివసేన కార్యకర్తలు రాళ్లు రువ్వుకుంటూ ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు వారందరినీ చెదరగొట్టారు. 50 మంది కార్యకర్తలపై కేసులు పెట్టారు. రాణెను కేబినెట్ నుంచి తొలగించాలంటూ ప్రధాని మోదీకి శివసేన ఎంపీ వినాయక్ రౌత్ లేఖ రాశారు.. వెనువెంటనే అరెస్ట్ రాణెపై పుణె, నాసిక్, మహాడ్ సహా పలు చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదవడంతో రాణెను అరెస్ట్చేయాల్సిందిగా నాసిక్ పోలీస్ కమిషనర్ ఆదేశాలిచ్చారు. దీంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలని రాణె రత్నగిరిలోని సెషన్స్ కోర్టును కోరారు. నాసిక్‌లోని కేసు.. తమ పరిధిలోది కాదంటూ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు తిరస్కరించింది. కమిషనర్ ఆదేశాలతో పోలీసులు రాణెను మంగళవారం మధ్యాహ్నం గోల్వాలీలో అరెస్ట్‌చేసి సంగమేశ్వర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేందుకు రాయ్‌గఢ్ జిల్లాలోని మహాడ్‌కు తీసుకొచ్చారు. దీంతో రాణె బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్, తీవ్రమైన చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలంటూ రాణె తరపు న్యాయవాది అనికేత్ నికమ్ హైకోర్టును కోరారు. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించబోమని, ముందుగా రిజిస్ట్రీ ముందు కేసు ఫైల్ చేయండంటూ జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎన్జే జమదార్‌ల డివిజన్ బెంచ్ రాణె లాయర్‌ను ఆదేశించింది. తనపై పలుచోట్ల దాఖలైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలంటూ రాణె హైకోర్టులో మరో పిటిషన్ దాఖలుచేసే ప్రయత్నంచేయగా... సాంకేతిక కారణాల వల్ల మంగళవారం అది సాధ్యపడలేదు. నేనంటే భయం.. అరెస్ట్ తర్వాత రాణె ఇండియాటుడేతో మాట్లాడారు. ‘‘వారు (మహారాష్ట్ర ప్రభుత్వం) నన్ను చూసి భయపడుతున్నారు. అందుకే ఇదంతా చేస్తున్నారు. నేనేమీ తీవ్రమైన వ్యాఖ్యలేవీ చేయలేదు. ‘నేనక్కడ ఉంటే చెంప మీద కొట్టేవాడిని’అని అన్నాను. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వివాదంలో సీఎం కుమారుడు ఆదిత్య ఇరుక్కున్నారు. అయినా అరెస్ట్ చేయలేదు. నన్ను ఎందుకు అరెస్ట్‌చేశారు?అని వ్యాఖ్యానించారు. ఓర్వలేకే ఈ అరెస్ట్: నడ్డా బీజేపీ జన్ ఆశీర్వాద్ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందని, అందుకే ఓర్వలేక శివసేన ప్రభుత్వం ఇలా అరెస్ట్‌లకు పాల్పడుతోందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. రాత్రికి బెయిల్ మహాడ్ కోర్టు నారాయణ్ రాణెకు మంగళవారం రాత్రి బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు ఏడు రోజుల కస్టడీ కోరినా మహాడ్ కోర్టు జడ్జి షేక్బాబాసో పాటిల్ నిరాకరించారు. ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర జరిగిందేమోననే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని, రాణెను పోలీసు కస్టడీకి ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది భూషణ్ సాల్వి కోరారు. దీనిని రాణె లాయర్లు గట్టిగా వ్యతిరేకించారు. రాణె వయసు 69 ఏళ్లని, షుగర్, బీపీ సమస్యలు ఉన్నాయని కోర్టును నివేదించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఏ కింద రాణెకు ఎలాంటి సమన్లు ఇవ్వలేదని, అందువల్ల అరెస్టు చట్టవిరుద్ధమని రాణె న్యాయవాది అనికేత్ నికమ్ వాదించారు. కస్టడీ అనవసరమన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి పాటిల్ కేంద్రమంత్రిని పోలీసు కస్టడీకి అప్పగించానికి నిరాకరించారు. రూ.15 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. చదవండి: చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’ -
Maharashtra Rains: మహారాష్ట్రలో కుండపోత
సాక్షి ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఆకాశానికి చిల్లులు పడ్డాయన్నట్టుగా కుండపోతగా వర్షాలు కురిశాయి. దీంతో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యా యి. ముంబైతోపాటు ముఖ్యంగా కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రలోని అనేక జిల్లాల్లో నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. రత్నగిరి, రాయ్‌గఢ్ జిల్లాల్లో దాదాపు నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. అనేక గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు ముంబై – పుణే, ముంబై – నాసిక్ మార్గాలపై రైళ్ల రాకపోకలు గురువారం స్తంభించాయి. ఇంకోవైపు జలాశయాలన్ని నిండిపోయాయి. దీంతో ముఖ్యంగా రత్నగిరి జిల్లాలోని చిప్లూన్ తాలూకాతోపాటు కొల్హాపూర్‌లో జిల్లాలో పంచగంగా, వైశిష్ట, శివ నదులలో వచ్చిన వరదల కారణంగా ఇళ్లల్లోని నీరు చొరబడింది. మరోవైపు వరద నీటిలో వేలాది మంది చిక్కుకుపోయారు. ఒక్క చిప్లూన్లోనే అయిదు వేల మందికిపైగా వరదల్లో చిక్కుకున్నారు. వీరందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక యంత్రాంగంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సైన్యం, నేవీ రంగంలోకి దిగాయి. ఇప్పటికే అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ ఇంకా అనేక మంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం వేచిచూస్తున్నారు. 2005 తర్వాత ఇంత భారీ ఎత్తున వరదలు మళ్లీ ఇప్పుడే వచ్చాయంటూ అనేక మంది స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. చిప్లూన్ పట్టణం పూర్తిగా జలమయమైంది. పట్టణంలోని మార్కెట్‌తోపాటు అనేక ప్రాంతాల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు వచ్చేశాయి. ఇలా సుమారు 12 అడుగుల నీరు చేరింది. దీంతో అనేక మంది టెర్రస్పైకెక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు కొల్హాపూర్‌లోని చిఖలీలో గతంలో మాదిరిగానే ఈసారి కూడా ముంపుకు గురైంది. దీంతో గ్రామంలోని వారందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ చేపట్టింది. థానే జిల్లాలో వరద చుట్టుముట్టడంతో ఎత్తైన ప్రాంతానికి చేరుకుని సాయం కోసం చూస్తున్న ప్రజలు రత్నగిరి జిల్లాలోని పరశురాం ఘాట్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మృతి చెందారు. వార్దా జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో వరద నీటిలో కొట్టుకుపోయి ఇద్దరు చనిపోయారు. రత్నగిరి జిల్లాలో జాగ్బుడి, వశిష్టి, కొడావలి, శాస్త్రి, భావ్ నదులు ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగుతున్నాయి. చిప్లూన్, ఖేడ్, లాన్జా, రాజ్పూర్, సంగమేశ్వర్ పట్టణాలను వరద నీరు ముంచెత్తింది. ఎడతెరపిలేని వర్షాలతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ తెలిపారు. గురువారం ముఖ్యమంతి ఉద్దవ్ ఠాక్రే పరిస్థితిని సమీక్షించారు. భారత వాతావరణ శాఖ తీర ప్రాంత జిల్లాల్లో మరో మూడురోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం... ముంబై, కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం రవాణ వ్యవస్థపై పడింది. రోడ్డు, రైలు సేవలకు అంతరాయం కలిగింది. ముఖ్యంగా ముంబైకి సమీపంలోని టీట్‌వాలా, వాంగణీతోపాటు బద్లాపూర్, అంబర్నాథ్లలో కురిసిన వర్షం కారణంగా గురువారం తెల్లవారుజామున వరద నీరు రైల్వేట్రాక్‌పై చేరింది. రైళ్ల రాకపోకలు స్తంభించాయి. మరోవైపు కసారాలో కొండచరియలు విరిగి రైల్వే ట్రాక్‌పై పడ్డాయి. దీంతో ముంబై – నాసిక్, ముంబై – పుణేల మధ్య నడిచే మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనేక రైళ్లు ఎక్కడికక్కడే నిలిపివేయాల్సి వచ్చింది. ముంబై నుంచి షోలాపూర్ బయలుదేరిన సిద్దేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం అర్దరాత్రి నుంచి బద్లాపూర్ రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. దీంతో ఈ రైల్లోని ప్రయాణికులు సుమారు 11 గంటలకుపైగా ఒకే రైల్వే స్టేషన్లో ఉండాల్సి వచ్చింది. అనంతరం సెంట్రల్ రైల్వే ఈ రైలును బద్లాపూర్లోనే రద్దు చేసింది. అనంతరం అదే రైలును తిరిగి వీటి వరకు నడిపింది. మరోవైపు ఇగత్పురి రైల్వేస్టేషన్లో కూడా అనేక రైళ్లు రద్దు చేశారు. దీంతో ఇగత్పురి రైల్వేస్టేషన్ నుంచి ముంబైకి వచ్చే ప్రయాణికుల కోసం సెంట్రల్ రైల్వే ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. ఇలా మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఎంఎస్‌ఆర్‌టిసి) బస్సుల ద్వారా ముంబైకి తరలించారు. ఆరువేల మందికి పైగా ప్రయాణికులు ఇలా పలుచోట్ల చిక్కుకుపోయారు. చాలా సమయంపాటు పిల్లలు, వృద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతోపాటు ముంబై నుంచి హైదరాబాద్‌తోపాటు దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే ౖఅనేక రైళ్లను ముఖ్యంగా ముంబై – పుణే రైల్వే మార్గంపై అనేక రైళ్లను రద్దు చేశారు. అదేవిధంగా ముంబై – నాసిక్ మార్గంతోపాటు కోంకణ్ మార్గంలో కూడా పలు రైళ్లను రద్దు చేశారు. దీంతోపాటు ముంబై గోవా మార్గంపై కూడా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుకు గురయ్యారు. అనేక వాహనాలు వరద నీటిలో మునిగిపోగా... మరికొన్ని కొట్టుకుపోయాయి. ఉద్దవ్‌కు మోదీ ఫోన్ న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మహారాష్ట్రలోని వరద పరిస్థితిపై ఆరా తీశారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకు ఫోన్ చేసి మాట్లాడిన ఆయన కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా మహారాష్ట్రకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరదల్లో చిక్కుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో రాష్ట్ర అధికారులకు సహాయపడుతున్నాయి. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో మాట్లాడాను. వరద నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన అన్నిరకాల సహాయసహకారాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపాను’ అని మోదీ ట్వీట్ చేశారు. -
మంత్రి ఇంటి ముందు వినూత్నంగా నిరసన
-
మంత్రి ఇంటి ముందు పీతలు వదిలారు..
సాక్షి, ముంబై: రత్నగిరి జిల్లాలో తివరే డ్యాం ఆనకట్ట తెగిపోవడానికి పీతలే ప్రధాన కారణమని వ్యాఖ్యలు చేసిన జలవనరుల శాఖ మంత్రి తానాజీ సావంత్‌కు ఎన్సీపీ కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపారు. మంగళవారం ఉదయం ఎన్సీపీ కార్యకర్తలు గుంపులుగా వచ్చి సావంత్ ఇంటి ప్రాంగణంలో గంపలో పీతలు తీసుకొచ్చి పోసి నిరసన తెలిపారు. తివరే డ్యాం ఆనకట్ట తెగిపోవడానికి ప్రధాన కారణం పీతలేనని ఇటీవల తానాజీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహానికి గురైన ఎన్సీపీ కార్యకర్తలు మంత్రి ఇంటి ముందు పీతలు పోశారు. మరోవైపు అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా ఇటీవల కురిసిన వర్షాలకు తివరే ఆనకట్టకు గండిపడి దిగువన ఉన్న గ్రామాలు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 19మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. -
పట్టాలు తప్పిన గూడ్స్
సాక్షి, ముంబై: రత్నగిరి జిల్లాలోని కొంకణ్ రైల్వేమార్గంపై మంగళవారం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటనలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అయితే కొంకణ్ రైల్వేమార్గంపై రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అందిన వివరాల మేరకు చిప్లూన్-కమాఠేల మధ్య ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబై నుంచి గోవా బయల్దేరిన గూడ్స్ రైలు చిప్లూన్ ఓవర్‌హెడ్ బ్రిడ్జి సమీపంలో పట్టాలు తప్పింది. సుమారు 700 మీటర్ల వరకు రైలు పట్టాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పట్టాలు తప్పిన తొమ్మిది బోగీల్లో ఆరు బోగీలు పట్టాలకు ఆరు అడుగుల దూరంలో పడిపోగా, మిగిలిన మూడు బోగీలు సుమారు 50 అడుగుల దూరంలో పడిపోయాయి. ఒక బోగీ సమీపంలోని మురికివాడపై పడింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటన అనంతరం కొంకణ్ రైల్వేమార్గంపై సాయంత్రం వరకు రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. యుద్ధప్రాతిపదికపై రైల్వేమార్గాన్ని పునరుద్ధరించే పనులు కొనసాగిస్తున్నారు. అనేక రైళ్లు రద్దు... గూడ్స్ రైలు ప్రమాదం కారణంగా మడ్గావ్-ముంబై మాండవి ఎక్స్‌ప్రెస్, మడ్గావ్-దాదర్ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్, సావంత్‌వాడీ-దివా, రత్నగిరి-దాదర్, దాదర్-రత్నగిరి పాసింజర్ రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారిమళ్లించారు.