ముంబై: స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రసంగంపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణె సోమవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణలకు దారి తీసిన ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. రాణెపై మహారాష్ట్రలో పలు చోట్ల కేసులు నమోదవడంతో.. జన్ ఆశీర్వాద్ యాత్రలో భాగంగా మహారాష్ట్రలో పర్యటిస్తున్న రాణెను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఏకంగా కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది.
సంవత్సరం గుర్తులేకపోవడం సిగ్గుచేటు
జన్ ఆశీర్వాద్ యాత్రలో భాగంగా మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని రత్నగిరిలో రాణె పర్యటించారు. ఈ సందర్భంగా ఆనాడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశిస్తూ ఆగస్ట్ 15న సీఎం ఠాక్రే చేసిన ప్రసంగాన్ని రాణె ప్రస్తావించారు. ‘ఏ ఏడాదిలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందో సాక్షాత్తూ సీఎంకు తెలీకపోవడం నిజంగా సిగ్గుచేటు. ప్రసంగాన్ని మధ్యలో ఆపి ఆయన వెనక వైపున్న సిబ్బందిని ఏడాది గురించి అడిగి తెల్సుకున్నారు. ఆ రోజు నేనే అక్కడ ఉండి ఉంటే గట్టిగా సీఎం చెంప పగలగొట్టేవాడిని’అని రాణె వ్యాఖ్యానించారు. దీంతో రాణె వ్యాఖ్యలు మహారాష్ట్ర వ్యాప్తంగా శివసేన పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం తెప్పించాయి.
ముంబై, పుణె, నాగ్‌పూర్, థానె, అమరావతిసహా రాష్ట్రంలోని పలు పట్టణాల్లో శివసేన కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బీజేపీ కార్యాలయాలను ధ్వంసంచేశారు. మరోవైపు, నాసిక్ సిటీలో, రత్నగిరి జిల్లాసహా పలు పట్టణాల్లో శివసేన, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ముంబైలోని రాణె నివాసం వద్ద బీజేపీ, శివసేన కార్యకర్తలు రాళ్లు రువ్వుకుంటూ ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు వారందరినీ చెదరగొట్టారు. 50 మంది కార్యకర్తలపై కేసులు పెట్టారు. రాణెను కేబినెట్ నుంచి తొలగించాలంటూ ప్రధాని మోదీకి శివసేన ఎంపీ వినాయక్ రౌత్ లేఖ రాశారు..
వెనువెంటనే అరెస్ట్
రాణెపై పుణె, నాసిక్, మహాడ్ సహా పలు చోట్ల ఎఫ్‌ఐఆర్‌లు నమోదవడంతో రాణెను అరెస్ట్‌చేయాల్సిందిగా నాసిక్ పోలీస్ కమిషనర్ ఆదేశాలిచ్చారు. దీంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలని రాణె రత్నగిరిలోని సెషన్స్ కోర్టును కోరారు. నాసిక్‌లోని కేసు.. తమ పరిధిలోది కాదంటూ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు తిరస్కరించింది. కమిషనర్ ఆదేశాలతో పోలీసులు రాణెను మంగళవారం మధ్యాహ్నం గోల్‌వాలీలో అరెస్ట్‌చేసి సంగమేశ్వర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేందుకు రాయ్‌గఢ్ జిల్లాలోని మహాడ్‌కు తీసుకొచ్చారు. దీంతో రాణె బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
అరెస్ట్, తీవ్రమైన చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలంటూ రాణె తరపు న్యాయవాది అనికేత్ నికమ్ హైకోర్టును కోరారు. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించబోమని, ముందుగా రిజిస్ట్రీ ముందు కేసు ఫైల్ చేయండంటూ జస్టిస్ ఎస్‌ఎస్ షిండే, జస్టిస్ ఎన్‌జే జమదార్‌ల డివిజన్ బెంచ్ రాణె లాయర్‌ను ఆదేశించింది. తనపై పలుచోట్ల దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలంటూ రాణె హైకోర్టులో మరో పిటిషన్ దాఖలుచేసే ప్రయత్నంచేయగా... సాంకేతిక కారణాల వల్ల మంగళవారం అది సాధ్యపడలేదు.
నేనంటే భయం..
అరెస్ట్ తర్వాత రాణె ఇండియాటుడేతో మాట్లాడారు. ‘‘వారు (మహారాష్ట్ర ప్రభుత్వం) నన్ను చూసి భయపడుతున్నారు. అందుకే ఇదంతా చేస్తున్నారు. నేనేమీ తీవ్రమైన వ్యాఖ్యలేవీ చేయలేదు. ‘నేనక్కడ ఉంటే చెంప మీద కొట్టేవాడిని’అని అన్నాను. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వివాదంలో సీఎం కుమారుడు ఆదిత్య ఇరుక్కున్నారు. అయినా అరెస్ట్ చేయలేదు. నన్ను ఎందుకు అరెస్ట్‌చేశారు?అని వ్యాఖ్యానించారు.
ఓర్వలేకే ఈ అరెస్ట్: నడ్డా
బీజేపీ జన్ ఆశీర్వాద్ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందని, అందుకే ఓర్వలేక శివసేన ప్రభుత్వం ఇలా అరెస్ట్‌లకు పాల్పడుతోందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.
రాత్రికి బెయిల్
మహాడ్ కోర్టు నారాయణ్ రాణెకు మంగళవారం రాత్రి బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు ఏడు రోజుల కస్టడీ కోరినా మహాడ్ కోర్టు జడ్జి షేక్‌బాబాసో పాటిల్ నిరాకరించారు. ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర జరిగిందేమోననే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని, రాణెను పోలీసు కస్టడీకి ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది భూషణ్ సాల్వి కోరారు. దీనిని రాణె లాయర్లు గట్టిగా వ్యతిరేకించారు. రాణె వయసు 69 ఏళ్లని, షుగర్, బీపీ సమస్యలు ఉన్నాయని కోర్టును నివేదించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఏ కింద రాణెకు ఎలాంటి సమన్లు ఇవ్వలేదని, అందువల్ల అరెస్టు చట్టవిరుద్ధమని రాణె న్యాయవాది అనికేత్ నికమ్ వాదించారు. కస్టడీ అనవసరమన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి పాటిల్ కేంద్రమంత్రిని పోలీసు కస్టడీకి అప్పగించానికి నిరాకరించారు. రూ.15 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment