ముంబై: ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న వేడి ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదు. శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వర్గానికి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. ఇప్పటికే అధికారం కోల్పోయి.. శివసేన గుర్తును కాపాడుకునేందుకే ఇబ్బందులు పడుతున్న థాక్రే వర్గానికి మరో దెబ్బ తగలనుంది. నలుగురు ఎమ్మెల్యేలు అధికార పక్షంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారటా! ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన నలుగురు శివసేన ఎమ్మెల్యేలు అధికార వర్గంలో చేరేందుకు తమతో టచ్‌లో ఉన్నారని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే శనివారం వెల్లడించారు. అంధేరీ అసెంబ్లీ ఉప ఎన్నికల వేళ ఎమ్మెల్యేలు అధికారపక్షంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలపటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరనేది బయటకు వెల్లడించలేదు రాణే.
‘మొత్తం 56 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 6-7 ఎమ్మెల్యేలు ఉన్నారు.(ఉద్ధవ్ థాక్రే వర్గంలో) వారు కూడా బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు. కానీ, వారి పేర్లు నేను వెల్లడించను.’ అని తెలిపారు. పుణెలో నిర్వహించిన ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో ఈ మేరకు వెల్లడించారు. ఉద్ధవ్ థాక్రేపై విమర్శలు గుప్పించారు రాణే. ఆయన రాజకీయం కేవలం మాతోశ్రీ వరకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. అయితే, ఈ విషయంపై ఉద్ధవ్ థాక్రే వర్గం ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు.
కేంద్ర మంత్రి నారాయణ్ రాణే
ఇదీ చదవండి: ‘బ్రిటన్ ప్రధానిగా బోరిస్ సరైన వ్యక్తి’.. భారత సంతతి ఎంపీ మద్దతు
Comments
Please login to add a commentAdd a comment