సాక్షి,ముంబై: కేంద్రమంత్రి నారాయణ్ రాణే వ్యాఖ్యలతో రేగిన దుమారం మరింత తీవ్రమవుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై వ్యాఖ్యలకు నిరసనగా శివసేన కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. కేంద్ర మంత్రికి సంబంధించిన ఆస్తులపై దాడిచేశారు. అలాగే నాసిక్‌లోని బీజేపీ కార్యాలయంపై కూడా రాళ్లు రువ్వారు. ఘర్షణకు దారి తీసింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో బీజేపీ-శివసేన కార్యకర్తల వార్ మరింత ముదురుతోంది.
ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై సూక్ష్మ, చిన్న, మధ్యతరహా శాఖా మంత్రి నారాయణ్ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై శివసేన కార్యకర్తలు దూకుడుమీద ఉన్నారు. ముంబైతోపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు , ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం పూణేలోని ఆర్ డెక్కన్ మాల్‌పై రాళ్లు రువ్వారు. దీంతో తీవ్ర నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. యువ నేత వరుణ్ దేశాయ్ నాయకత్వంలో, కొంతమంది శివసేన కార్యకర్తలు నినాదాలు చేస్తూ ముంబైలోని జుహులోని రాణే బంగ్లాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో, రాణే మద్దతుదారులు ప్రతిఘటించడంతో జుహు ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ముంబై, నాసిక్, చిప్లూన్, సాంగ్లీ, ఔరంగాబాద్ లలో శివ సైనికులు రెచ్చిపోయారు. వీరి ఆందోళనలు, ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తత రాజేశాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా దేశ స్వాతంత్య్ర దిన సంవత్సరాన్ని మరచిపోయారని, అదే తానైతే ఆయనను చెంపదెబ్బ కొట్టి ఉండేవాడినంటూ కేంద్రమంత్రి రాణే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. దీంతో నాసిక్ పోలీసులు రాణేను అరెస్టు చేయడం, చివరకు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment